వీటినీ శుభ్రం చేయాలి!

ABN , First Publish Date - 2020-07-15T05:30:00+05:30 IST

కరోనా వైరస్‌ సోకకుండా మాస్క్‌ ధరిస్తున్నాం, శానిటైజర్లు వాడుతున్నాం, సామాజిక దూరం పాటిస్తున్నాం. అయితే మనం రోజూ తాకే వీలున్న కొన్ని ప్రదేశాలను శుభ్రం చేయడం ఆదమరుస్తున్నాం. ఆ ప్రదేశాలు ఏవంటే...

వీటినీ శుభ్రం చేయాలి!

కరోనా వైరస్‌ సోకకుండా మాస్క్‌ ధరిస్తున్నాం, శానిటైజర్లు వాడుతున్నాం, సామాజిక దూరం పాటిస్తున్నాం. అయితే మనం రోజూ తాకే వీలున్న కొన్ని ప్రదేశాలను శుభ్రం చేయడం ఆదమరుస్తున్నాం. ఆ ప్రదేశాలు ఏవంటే...




  1. కారు స్టీరింగ్‌: మనం ఆఫీసులో, ఇంట్లో, బయట... ఇలా ఎన్ని ప్రదేశాల్లో తిరిగినా, ఎన్ని వస్తువులను తాకినా, చివరకు కార్‌ స్టీరింగ్‌నే పట్టుకుంటాం. దాంతో వైరస్‌ స్టీరింగ్‌కు అంటుకుపోతుంది. కారు నడుపుతాం కాబట్టి స్టీరింగ్‌కు దగ్గరగా ఉండే ముక్కు, నోటి ద్వారా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ప్రతి రోజూ స్టీరింగ్‌ను శానిటైజ్‌ చేయడం మర్చిపోకూడదు.


  1. హెడ్‌ఫోన్స్‌: ఉదయం వాకింగ్‌కు వెళ్లేటప్పుడు హెడ్‌ఫోన్స్‌లో పాటలు వింటాం. వర్క్‌లో భాగంగా హెడ్‌ఫోన్స్‌ ద్వారానే సంభాషిస్తాం. ఇలా రోజులో ఎక్కువ సమయం హెడ్‌ఫోన్లతో గడిపే మనం వాటిని శానిటైజ్‌ చేయాలనే విషయం మర్చిపోతూ ఉంటాం. కరోనా వైరస్‌ ఉపరితలాల మీద గంటలతరబడి సజీవంగా ఉంటుంది. కాబట్టి హెడ్‌ఫోన్లను కూడా ప్రతిరోజూ శానిటైజ్‌ చేయడం అవసరం.


  1. టి.వి, ఎ.సి రిమోట్లు: రోజులో అత్యంత తరచుగా, ఎక్కువ మంది తాకే వీలున్న వస్తువులు ఇవి. అయినా వీటిని శుభ్రం చేయాలనే ఆలోచన ఎవరికీ రాదు. తడి సోకితే పాడయ్యే వీలున్న పరికరాలు కావడంతో, వీటిని అలాగే వదిలేస్తూ ఉంటాం. కానీ తలుపు గడియలు శుభ్రం చేసినట్టే, టీవీ, ఏసీ రిమోట్లను కూడా శానిటైజ్‌ చేయడం అవసరం.


  1. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు: డబ్బుతో పనిలేని లావాదేవీలు జరుపుతున్నాం. అయితే బదులుగా ఉపయోగిస్తున్న డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు చేతులు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో వైరస్‌ వాటి మీద చేరుకునే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వాటినీ శానటైజ్‌ చేసుకోవాలి.



  1. రిఫ్రిజిరేటర్‌ హ్యాండిల్‌: సాధారణంగా ఫ్రిజ్‌ హ్యాండిల్‌కు వస్త్రం లేదా ప్లాస్టిక్‌ కవర్‌ వేసి ఉంచుతాం. ఫ్రిజ్‌లో పదార్థాలను ఉంచేటప్పుడు, కూరగాయలను సర్దేటప్పుడు, తీసేటప్పుడూ హ్యాండిల్‌ను తాకుతూనే ఉంటాం. ఆ క్రమంలో సూక్ష్మక్రిములు హ్యాండిల్‌కు అంటుకునే వీలు ఉంటుంది. కాబట్టి వీటినీ శుభ్రం చేస్తూ ఉండాలి.


  1. దిండ్లు: సాధారణంగా దుప్పట్లు, దిండు కవర్లను ఉతికేస్తూ ఉంటాం. కానీ దిండ్లలో కూడా దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ పేరుకుంటూ ఉంటాయి. కాబట్టి వీటిని శుభ్రం చేయడమూ అవసరమే! ఎక్కువ శాతం దిండ్లు వాషింగ్‌ మిషన్‌లో ఉతికేయడానికి వీలున్నవే కాబట్టి, వాటినీ దుప్పట్లతో పాటు ఉతికేస్తూ ఉండండి.



  1. స్విచ్‌బోర్డులు: వీటిని ఇంటిల్లిపాదీ ప్రతి రోజూ తాకుతూ ఉంటాం. కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నట్టే, వీటినీ శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా ఇంటి బయట ఉండే కాలింగ్‌ బెల్‌ను పనివాళ్ల మొదలు, పలువురు తాకుతూ ఉంటారు. కాబట్టి దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం శానిటైజర్‌తో కాలింగ్‌బెల్‌ శుభ్రం చేసుకోవాలి.

Updated Date - 2020-07-15T05:30:00+05:30 IST