ఇసుక మాయం

ABN , First Publish Date - 2020-06-04T09:01:35+05:30 IST

ఇసుక దోపిడీ, అక్రమాలు తవ్వేకొద్దీ వెలికి వస్తూనే ఉన్నాయి. ఒకపక్క స్టాకు యార్డుల్లో తేడాలు, మరోపక్క అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ అక్రమాలు, ఇంకోపక్క ‘ఇంటింటికీ ఇసుక’ కోసం రూపొందించిన యాప్‌లోనే

ఇసుక మాయం

  • ఇంటింటికీ చేరవేతలో చేతివాటం
  • ఒకే బిల్లుపై నాలుగైదు ట్రిప్పులు
  • యాప్‌ రూపకల్పనలోనే ఆ కిరికిరి
  • చెప్పిన ట్రిప్పులు వేస్తేనే రైట్‌రైట్‌
  • వారికే స్టాక్‌ రవాణాకు అనుమతి
  • ఇసుక రీచ్‌ నుంచి యార్డు వరకు
  • ఒక గొలుసుగా ఏర్పడి అక్రమాలు
  • ఈ దోపిడీకి నిఘా ఏజెన్సీ సాయం
  • ఏపీఎండీసీలో ఓ అధికారి వత్తాసు
  • ఒక్కో అధికారి నెల ఆర్జన 15 లక్షలు
  • అది చూసి సీమలో ఇసుక పోస్టుకు
  • మార్పించుకొన్న సాగునీటి అధికారి


అమరావతి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఇసుక దోపిడీ, అక్రమాలు తవ్వేకొద్దీ వెలికి వస్తూనే ఉన్నాయి. ఒకపక్క స్టాకు యార్డుల్లో తేడాలు, మరోపక్క అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ అక్రమాలు, ఇంకోపక్క ‘ఇంటింటికీ ఇసుక’ కోసం రూపొందించిన యాప్‌లోనే అవకతవకలు! ఇలా దోచుకున్నోడికి దోచుకున్నంత అన్న చందాన ఇసుక వ్యవహారం తయారైంది. ‘ఇంటింటికీ ఇసుక’ కోసం ప్రభుత్వం ఒక బృందాన్ని పెట్టి యాప్‌ను రూపొందించింది. అయితే ఆ యాప్‌ను రూపొందించే బృందంలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తి...ఏపీఎండీసీలోని కొందరు, రీచ్‌లలోని మరికొందరితో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని సమాచారం. ఒక వ్యక్తి లారీ ఇసుకను సదరు యాప్‌లో బుక్‌ చేసుకుంటే..ఆయన పేరుమీద రశీదు ఇచ్చి ఇసుక వేసేస్తారు. ఆ తర్వాత మూడు, నాలుగురోజులు కూడా అదే రశీదుపై మరిన్ని లారీల ఇసుకను తరలించేస్తారు. వారెవరూ ఇక ఇసుకను బుక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా కొంత ఎక్కువసొమ్ము తీసుకోవడం,ఒక్కోసారి కొంత తక్కువకు కూడా! ఇలా ఒకే రశీదుపై అక్రమంగా ఇసుకను అమ్మేశారన్నది బహిరంగ రహస్యమే!  యాప్‌లో ఇసుకను బుక్‌ చేసుకున్నప్పుడు...ఆ బుక్‌ చేసుకున్న వ్యక్తికి దగ్గరిలో ఉన్న వాహనాన్ని పంపించాలి. కానీ ఏ వాహనాన్ని పంపించాలన్న విషయంలోను కొంత చేతివాటం ప్రదర్శించారని తెలిసింది. తమకు కొంత ఇచ్చుకునేవారు, అదేవిధంగా తమకు అనుగుణంగా ఒక రశీదుకు అనేక ట్రిప్పులు అక్రమంగా వేసేవారికి మాత్రమే రవాణా అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. సాంకేతికతతో అక్రమాలు నివారించాల్సిన వాళ్లే..దాని సాయంతోనే అక్రమాలకు తెరతీశారని అంటున్నారు. ఇసుక రీచ్‌లు, యార్డుల వరకు ఒక గొలుసుగా ఏర్పడి ఈ తతంగాన్ని నడిపించేశారని సమాచారం.


ఏజెన్సీ అక్రమాలు...ఇంతింతకాదయా! 

ఇసుక రీచ్‌లు, యార్డుల్లో ఏపీఎండీసీ తరఫున అక్రమాలు జరగకుండా నిఘా పెట్టేందుకు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించారు. ఏపీఎండీసీ స్వయంగా ఎంపికచేసి కొంతమందిని నియమించగా, మరికొందరి నియామకం ఒక అవుట్‌ సోర్సింగ్‌ ఏజన్సీకి అప్పగించారు. సదరు ఏజెన్సీ ఒక్కో పోస్టును ఇష్టారాజ్యంగా అమ్ముకుంది. అక్కడితో ఆగకుండా, తామే నియమించిన సిబ్బంది కావడంతో...వారిలోని కొంతమందితో కలిసి రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుకను అమ్మేసిందని తెలుస్తోంది. నాటి అధికారులు కూడా ఈ ఏజెన్సీకి కొమ్ముకాశారు. ఏపీఎండీసీలోని మానవ వనరుల విభాగంలో ఉన్న ఒక అధికారి ఈ ఏజెన్సీకి పూర్తిస్థాయిలో సహకరించారని ఆయా వర్గాలే పేర్కొంటున్నాయి. ఈ ఏజెన్సీ అధినేత సాగించిన అక్రమాలపై విచారణ చేస్తే, కోట్ల రూపాయల దందాలు బయటపడతాయని అంటున్నారు.


ఇసుక మాఫియాను అరికట్టండి: సీపీఐ రామకృష్ణ

‘‘ఇసుక మాఫియా అక్రమాలను అరికట్టాలి. నాణ్యమైన ఇసుక సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఇసుక మాఫియా పెట్రేగిపోతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇసుక సరఫరాలో అక్రమాలు సాగుతూనే ఉన్నాయి. సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేనే ఇసుక అక్రమాలపై గొంతెత్తారంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని వామపక్ష నేతలు రామకృష్ణ, మధు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ కు వారిరువురూ విడివిడిగా లేఖలు రాశారు. ఇసుక పాలసీ తీసుకొస్తామని 5 నెలలపాటు ఇసుక సరఫరానే చేయలేదన్నారు. 


స్టాకుల్లో తేడాలు...

రాష్ట్రంలోని పలు స్టాకుయార్డు నిల్వల్లో తీవ్ర అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వానికి చూపించిన లెక్కలకు... అక్కడ అమ్మిన ఇసుకకు పొంతనే లేదు. కడప స్టాకు యార్డులో అధికారికంగానే 30వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక తేడా బయటపడింది. చిత్తూరుజిల్లా గాజుల మండ్య స్టాకు యార్డులో ఏపీఎండీసీ ఉన్నతాధికారి సహ కారంతో అక్రమాలు జరిగినట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లిలోని ఒక స్టాకుయార్డును వర్షాకాలం కోసం నిల్వ ఉంచేందుకుని ప్రత్యేకించగా, అందులో అనుమతించిన దానికంటే రెట్టింపు నిల్వ చేశారని సమాచారం. ఈ అదనపు నిల్వలను అక్రమంగా అమ్ముకునేందుకు ప్రణాళిక రచించారు.  స్టాకుయార్డుల్లో అక్రమాలకు పాల్పడినవారు  ఫలా నా నాయకుడి అండ ఉందంటూ చెలరేగిపోతున్నారని అంటున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ఇసుక అధికారులు పలువురు ఇలాంటి అక్రమాలకు వత్తాసు పలికారు. నెలకు ఒక్కో జిల్లా ఇసుక అధికారి రూ.10-15లక్షలు అక్రమంగా సంపాదించారని అంటున్నారు. అవుట్‌ సోర్సింగ్‌  పద్ధతిలో తీసుకున్న ఈ డీఎ్‌సవోలు.. అదేవిధంగా గనుల శాఖకు చెందిన డీఎ్‌సవోలు అందినకాడికి సంపాదించేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంపాదన చూసి, విని సాగునీటిశాఖకు చెందిన ఒక అధికారి రాయలసీమలోని ఒక జిల్లా ఇసుక అధికారిగా వేయించుకున్నారని సమాచారం. బెంగళూరుకు అక్రమంగా తరలిన ఇసుకలో ఇతనికీ వాటాలు దక్కాయని అంటున్నారు. ఇసుక అక్రమాలపై అంతర్గత విచారణతో పాటు.. లోతైన దర్యాప్తు చేయిస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తాయంటున్నారు.

Updated Date - 2020-06-04T09:01:35+05:30 IST