అడ్డంగా ఇసుక దందా

ABN , First Publish Date - 2022-05-25T08:03:39+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్రమ ఇసుక దందా జోరందుకుంది. వాగులు, వంకలు, నదులు..

అడ్డంగా ఇసుక దందా

  • పాలమూరులో కృష్ణాలో మాఫియా జోరు
  • ఒక్క కృష్ణా మండలంలోనే..వారానికి 1,500 టిప్పర్లతో తరలింపు
  • నెలకు రూ. 150 కోట్ల దందా
  • కీలక నేతలు, రెవెన్యూ, పోలీసుల అండ


మహబూబ్‌నగర్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్రమ ఇసుక దందా జోరందుకుంది. వాగులు, వంకలు, నదులు.. ఇలా వేటినీ వదిలిపెట్టకుండా.. ఇసుక మాఫియా తోడేస్తోంది. దందా సాఫీగా సాగేందుకు కృష్ణానదిలో అడ్డంగా రోడ్డు వేసింది. ఒక్క కృష్ణా మండలంలోనే రోజుకు 1,500 టిప్పర్ల మేర ఇసుక తరలిపోతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలు.. వేల లారీలు ఇసుకను తరలిస్తున్నాయి. నెలకు రూ. 150 కోట్ల మేర ఈ దందా సాగుతున్నా.. రెవెన్యూ అధికారులు, పోలీసులు మామూళ్ల మత్తులో తూగుతూ, మాఫియాకు ఊతమిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని కృషా, దుందుభీ నదితోపాటు.. పెద్దవాగు, ఊకచెట్టువాగు, ఇతర జలాశయాల వద్ద ఇసుక మాఫియా రీచ్‌లు కొనసాగుతున్నాయి. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన అధికారి ఈ మాఫియాపై కఠిన చర్యలు తీసుకున్నారు. దాంతో కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఇసుక మాఫియా.. సదరు అధికారి బదిలీతో యథావిధిగా దందాను ప్రారంభించింది. గతంలో కంటే ఎక్కువ మొత్తంలో జలాశయాల నుంచి ఇసుకను పిండేస్తోంది. రైతులు, ప్రజాసంఘాల నాయకులు అడ్డుకుంటే.. బెదిరింపులకు దిగుతోంది. ‘‘ప్రభుత్వంలోని కీలక నేతల అండదండలు మాకున్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ఏమీ చేయలేరు. మీరేం చేస్తారు?’’ అంటూ హెచ్చరికలు చేస్తూ, దాడులకు దిగుతోంది. ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ, పోలీసు అధికారులు మిన్నకుంటున్నారు. ఇసుక దందాపై వచ్చే ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారు.


ప్రభుత్వ పనుల పేరుతో..

ఇసుకాసురులు చాలా చోట్ల ప్రభుత్వ పనుల పేరుతో ఈ దందాను కొనసాగిస్తున్నారు. పంచాయతీరాజ్‌ రోడ్ల నిర్మాణం.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల పేరుతో 30-40 క్యూబిక్‌ మీటర్ల ఇసుకకు అనుమతి తీసుకుని.. నదులు, వాగులను అడ్డంగా తోడేస్తున్నారు. కీలక ప్రజాప్రతినిధుల అండదండలతో తమ దందాను అడ్డూఅదుపూ లేకుండా సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అనుమతులు-తవ్వకాలను పరిశీలించాల్సిన అధికారులు రీచుల వైపు కన్నెత్తి చూడడం లేదని, రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు విభాగాలకు ఈ మాఫియా నుంచి నెలనెలా మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి సామాన్యులు ఒక ట్రాక్టర్‌ ఇసుక తీసుకోవాలంటే నానా ప్రయాసలు పడాల్సి వస్తోంది. కానీ, ఇక్కడి ఇసుకను యథేచ్ఛగా హైదరాబాద్‌, రాయచూర్‌కు తరలిస్తున్నారు. ఒక టిప్పర్‌ లోడ్‌ను రూ. 25 వేలకు విక్రయిస్తున్నారు. అధికారులు, పోలీసులు, ఆర్టీయే/పోలీసు చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది, నేతలకు మామూళ్లు పోగా.. ఈ మాఫియాకు 80ు మిగులుతోందని అంచనా.


ఇసుక తరలింపు ఇలా..

నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గంలోని కృష్ణా మండలంలో ముడుమాల్‌ వద్ద కృష్ణానదిలో జరుపుతోన్న ఇసుక తవ్వకాల్లో సగటున వారానికి 1,500 లారీల ఇసుక బయటకు వెళుతోంది. ఇక్కడ ఏకంగా నదిలో 2.5 కిలోమీటర్ల మేర రోడ్డును వేసిన ఇసుకారులు, ఓ ర్యాంపును నిర్మించి.. దందా కొనసాగిస్తున్నారు. ఇక్కడి ఇసుక రాయచూర్‌, హైదరాబాద్‌కు తరలుతోంది.

ఇదే జిల్లాలోని నేరెడుగాం, వర్కూరు, అడవి సత్యావార్‌, చిట్యాల, దాసరిపల్లి, గుండ్లపల్లి నుంచి ఆయా వాగులలో జరిపే తవ్వకాల ద్వారా వారానికి 3 వేల పైచిలుకు టిప్పర్ల ఇసుక హైదరాబాద్‌కు, మహబూబ్‌నగర్‌కు చేరుతోంది.

ఉట్కూరు మండలంలోని పెద్దవాగు నుంచి తిప్పరాసుపల్లి, ఓబులాపూర్‌ వాగుల నుంచి ఇసుకను రేయింబవళ్లు మక్తల్‌, మహబూబ్‌నగర్‌ పట్టణాలకు తరలిస్తున్నారు.

కోస్గి మండలంలో పెద్దవాగు పరిసరాల్లోని బిజ్జారం, బోగారం, ఆమ్లికుంట, కడెంపల్లి నుంచి, మద్దూరు మండలంలోని లింగల్‌ఛేడ్‌, పెద్దాపూర్‌, తిమ్మారెడ్డిపల్లి నుంచి నిత్యం వందకు పైగా లారీల ఇసుక తాండూరు, పరిగి పట్టణాలకు తరలిపోతోంది.

కోయిల్‌సాగర్‌ బ్యాక్‌వాటర్స్‌ ప్రాంతంలోని కోయిల్‌కొండ మండలంలో అక్రమ ఇసుక రీచ్‌ నుంచి నిత్యం వందల టిప్పర్ల ఇసుక మహబూబ్‌నగర్‌కు తరలుతోంది. దేవరకద్ర, సీసీకుంట, మూసాపేట, అడ్డాకుల మండలాల్లోనూ ఊకచెట్టువాగు, పెద్దవాగుల్లో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.

దుందుభీ నదిలో ఇసుక తవ్వకాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. తాడూరు, కల్వకుర్తి, వంగూరు మండలాల సరిహద్దు గ్రామాల నుంచి టిప్పర్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను కల్వకుర్తి కేంద్రంగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల సరిహద్దులో మిడ్జిల్‌, తిమ్మాజిపేట మండలాల సరిహద్దుల్లోని ఆవంచ, కొత్తపల్లి ప్రాంతాల నుంచి నిత్యం వందల లారీల ఇసుక హైదరాబాద్‌కు వెళ్తోంది.

Updated Date - 2022-05-25T08:03:39+05:30 IST