ఏపీకి కొత్త సీఎస్ ఇతనేనా..!?
ABN , First Publish Date - 2021-06-26T09:13:25+05:30 IST
సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు తిరిగి వస్తున్నారు. కొనేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన... ప్రస్తుతం కేంద్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ డైరెక్టర్ జనరల్‌గా విధులు
- రాష్ట్రానికి సమీర్ శర్మ
- సీఎస్ పదవి ఇవ్వనున్నారని ప్రచారం
అమరావతి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు తిరిగి వస్తున్నారు. కొనేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన... ప్రస్తుతం కేంద్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంత పెద్ద పోస్టులో ఉండి.. అకస్మాత్తుగా రాష్ట్ర కేడర్‌కు రావడం చర్చనీయాంశంగా మారింది. 1985 బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మను తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేస్తారని అధికార వర్గాల్లో ప్రచారం జరిగింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ (1987 బ్యాచ్).. సమీర్ శర్మ కంటే రెండేళ్లు జూనియర్. దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన సర్వీసును మరో మూడు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే ఆయన కొనసాగడం ఇష్టం లేని ఒక కీలక అధికారి... కొనసాగింపు ప్రతిపాదనను ఆలస్యం చేయించారన్న విమర్శలున్నాయి.
అయితే దాస్‌కు పొడిగింపు ఇస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి రాష్ట్రప్రభుత్వానికి మౌఖికంగా సమాచారం అందింది. ఇంకోవైపు.. రాష్ట్రం అభ్యర్థన మేరకు సమీర్ శర్మను ఏపీకి పంపుతున్నట్లు కేంద్ర నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. పొడిగింపు తర్వాత... దాస్ సెప్టెంబరు చివర్లో రిటైరవుతారు. అంటే అప్పటిదాకా సమీర్ శర్మకు ఇక్కడ పనేమీ ఉండదు. పోనీ ఆ తర్వాతయినా సీఎస్ పదవి ఇచ్చినా.. మరో రెండు నెలల్లో, నవంబరు నెలాఖరులో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.
ఈ మాత్రం దానికే అంత పెద్ద పోస్టు ఎందుకు వదులుకుని వస్తున్నారో సీనియర్ అధికారులకు అర్థం కావడం లేదు. అయితే ప్రస్తుతానికి ఆయన్ను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్‌గా నియమించి.. మూడు నెలల తర్వాత సీఎ్‌సగా నియమిస్తారని.. ఆ తర్వాత రెండు నెలల్లో ఆయన రిటైర్ కావలసి ఉన్నందున.. మళ్లీ కేంద్రానికి రాసి కొనసాగింపు ఇప్పించే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
