అదే తీరు...

ABN , First Publish Date - 2021-11-10T05:30:00+05:30 IST

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్ల నిధులు కేటాయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో జరిగిన జాతరకు ప్రభుత్వం అత్యధికంగా రూ.150.55 కోట్లు కేటాయించింది.

అదే తీరు...

2022 మేడారం మహాజాతరకు పెరగని నిధుల కేటాయింపు
గత జాతర తరహాలోనే రూ.75 కోట్లు ప్రకటించిన ప్రభుత్వం
2016 నుంచి తగ్గుతూ వస్తున్న కేటాయింపులు
ప్రతీ సారి తూతూ మంత్రంగా పనులు
కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్ల పాలు
జాతరకు ఇంకా మూడు నెలలే సమయం
ఇప్పటివరకు మొదలు కాని టెండర్ల ప్రక్రియ


భూపాలపల్లి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరకు  రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్ల నిధులు కేటాయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  2016లో జరిగిన జాతరకు ప్రభుత్వం అత్యధికంగా రూ.150.55 కోట్లు కేటాయించింది. దీంతో  భక్తులకు చాలా వరకు శాశ్వత సౌకర్యాలు ఏర్పడ్డాయి. అయితే 2018లో జరిగిన జాతరకు ప్రభుత్వ రూ.80.55కోట్లు మాత్రమే కేటాయించింది. రెండేళ్లు గడిచే సరికి సగానికి పైగా నిధులకు కోత పెట్టింది.  2020లో జరిగిన జాతర అభివృద్ధికి ప్రభుత్వం రూ.75కోట్లే మంజూరు చేసింది. 2016లో మంజూరు చేసిన నిధుల్లో సగం మాత్రమే కేటాయించింది.

2022లో జరిగే జాతరకు కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు సౌకర్యాలు విరివిగా ఏర్పాటు చేయాల్సిన ఉండగా జిల్లా యంత్రాంగం రూ.112 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ, రెవెన్యూ, దేవాదాయ తదితర శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వం సమీక్షించి నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అయితే.. ఈసారి ఎలాంటి చర్చలు లేకుండానే 2020లో జరిగిన జాతరకు మంజూరు చేసిన తరహాలోనే ఈసారి కూడా రూ.75 కోట్లు కేటాయించారు.  

వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి నాలుగు రోజులపాటు జరగనున్న జాతరకు ఈ నిఽధులతో భక్తులకు సౌకర్యాలు కల్పించనున్నారు. ముఖ్యంగా రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించింది. ఆర్‌అండ్‌బీ శాఖకు గత జాతరలో రూ.9.05 కోట్లు మాత్రమే కేటాయించగా ఈసారి రూ.13 కోట్లు మంజూరు చేసింది. నీటి సౌకర్యం, పారిశుధ్యానికి గతం మాదిరిగానే ఈసారి కూడా రూ.13.50 కోట్లు కేటాయించారు. పోలీసుశాఖకు గత జాతర తరహాలోనే రూ.11 కోట్లు కేటాయించారు. దేవాదాయ శాఖకు రూ.3 కోట్లు కేటాయించారు. రెవెన్యూ శాఖకు మాత్రం ఈసారి నిఽధులు తగ్గించారు. గత జాతరకు రూ.7.50 కోట్లు కేటాయించగా ఈసారి రూ.4.40 కోట్లు మాత్రమే కేటాయించారు. నీటిపారుదల శాఖకు గత జాతరలో రూ.4 కోట్లు ఇవ్వగా ఈసారి  రూ.6 కోట్లు కేటాయించారు. 2020 మహాజాతరలో ఆయా శాఖలకు కేటాయించినట్టుగానే ఈసారి కొంచెం అటుఇటుగా అంతే మొత్తంలో నిధులు కేటాయించారు.  

పనులు సకాలంలో జరిగేనా...?
మేడారం మహాజాతరకు ఇంకా మూడు నెలల సమయమే ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో  జనవరి 31లోగా పనులు పూర్తి కావాల్సి ఉంది. అభివృద్ధికి నిధులు మంజూరు కావటంతో ఆయా శాఖల పనులకు సంబఽంధించి టెండర్లు నిర్వహించాల్సి ఉంది. కాంట్రాక్టర్లను ఎంపిక చేయడం, వారితో ఒప్పందం చేసుకోవడం లాంటి పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇవన్నీ కావాలంటే కనీసం 20 రోజుల నుంచి 30 రోజులకు పైగా సమయం పడుతుంది. అంటే .. పనులు డిసెంబరు రెండు లేదా మూడో వారంలో ప్రారంభించాల్సి వస్తుంది. అయితే కేవలం నెలన్నర రోజుల సమయంలో కోట్లాది రూపాయల పనులు నాణ్యతతో ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి జాతరకూ ఆలస్యంగా  నిధులు మంజూరు చేయడం, నాణ్యత లేకుండా మమ అనిపించడం, కోట్లాది నిధులు స్వాహా చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహాజాతరకు ఆరు నెలల ముందే నిధులు మంజూరు చేస్తే పనుల్లో నాణ్యతతో పాటు భక్తులకు సౌకర్యంగా ఉండేదని భక్తులు అంటున్నారు. ఆలస్యంగా నిధులు ఇచ్చి కాంట్రాక్టర్ల ఆవతారంలో ఉన్న నేతల జేబులు నింపేందుకే ఇలా జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  

కేసీఆర్‌ హమీలకు మోక్షమెప్పుడో..?
విగ్రహాలు లేని ప్రకృతినే దైవంగా పూజించే ఈ మహాజాతర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ హామీలిచ్చారు. 2018 ఫిబ్రవరి 1న తల్లులను దర్శించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మేడారం గద్దెల ప్రాంగణం అభివృద్ధి చేయడంతోపాటు జాతర పరిధిని 200 ఎకరాలకు విస్తరిస్తామని చెప్పారు.  అలాగే రూ.200 కోట్లతో జాతరలో వివిధ అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా జంపన్నవాగుపై చెక్‌డ్యాంలు నిర్మించి స్వచ్ఛమైన నీటిలో భక్తులు స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. వీటన్నింటిపై డీపీఆర్‌ తయారు చేయాలని, 20 రోజుల్లో మళ్లీ (2018, ఫిబ్రవరి 20న) వస్తానని చెప్పారు. ఇదంతా జరిగి నాలుగేళ్లు కావస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో భూసేకరణ, రూ.200 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్‌ను ఐటీడీఏ, రెవెన్యూ అధికారులు సిద్ధం చేసి అప్పటి కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. జాతరకు సంబంధించి ఫైల్‌ ముఖ్యమంత్రికి చేరినా అమలుకు నోచుకోవడం లేదు. 2020 మహాజాతరకు సీఎం కేసీఆర్‌ హాజరైనప్పటికీ  2018లో ఇచ్చిన ఈ హామీపై ఏమాత్రం స్పందించలేదు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం మేడారం అభివృద్ధికి కేసీఆర్‌ కట్టుబడి ఉండాలని భక్తులు కోరుతున్నారు. శాశ్వత పనులు చేపట్టి  ప్రపంచస్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు వచ్చేలా కృషి చేయాలంటున్నారు.

జనవరి 10లోగా పనుల పూర్తి

మేడారం భక్తులకు శాశ్వత సదుపాయాలు
జంపన్న వాగులో చెక్‌డ్యామ్‌లను తొలగిస్తాం..
పస్రా-మేడారం రహదారిని ఆధునీకరిస్తాం..
ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్య

ములుగు కలెక్టరేట్‌, నవంబరు 10: వచ్చేఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చే పట్టిన పనులను జనవరి 10నాటికి పూర్తిచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ములుగు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య తెలిపారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

2022జాతరకు రాష్ట్రప్రభుత్వం రూ.75కోట్లను కేటాయించినట్లు తెలిపారు. వీటిలో ఐదు శాఖల ఆధ్వర్యంలో సివిల్‌పనులకోసం టెండర్‌లు పిలిచామని, వారంపదిరోజుల్లో ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. శాశ్వత ప్రాతిపదికన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. శాఖల వారిగా నివేదికలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే ప్రధానమైన పనులకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించినట్లు పేర్కొన్నారు. గత జాతరతో పోల్చుకుంటే ఈసారి సివిల్‌వర్క్‌లకు రూ.3.5కోట్ల నిధులు ఎక్కువగా కేటాయించడమ జరిగిందని తెలిపారు. ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.13కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు రూ.13.5కోట్లు, గిరిజన సంక్షేమశాఖకు రూ.4.5కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.6కోట్లు, పంచాయతీరాజ్‌ విభాగానికి రూ.4కోట్లు మంజూరుకాగా ఎక్కువశాతం శాశ్వత పనులు చేపడుతున్నామన్నారు.

పస్రా-మేడారం ప్రధాన రహదారి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నదని, రూ.10.3కోట్ల వ్యయంతో రోడ్డును నిర్మించడంతో పాటు,  జంపన్నవాగులోని మూడు చెక్‌డ్యామ్‌లను తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఇరిగేషన్‌ శాఖనుంచి వచ్చిన నివేదిక ఆధారంగా అత్యంత ప్రమాదకరంగా మారిన చెక్‌డ్యాంలను తొలగించడం జరుగుతుందని, భక్తుల పుణ్యస్నానాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఇసుక లెవలింగ్‌ పనులు చేపడుతామని తెలిపారు.

ఇక ప్రధాన శాఖల్లో ఒకటైన ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టే పనులను 38సెక్టార్లుగా విభజించామన్నారు. గద్దెల పరిసరాతోపాటు మేడారం-పస్రా, మేడారం-తాడ్వాయి దారి పొడవునా తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం చేస్తామన్నారు. గిరిజన సంక్షేమశాఖకు ఇచ్చిన రూ.4.5కోట్ల నిధులతో అన్ని శాశ్వత నిర్మాణాలు చేస్తున్నామన్నారు. జంపన్నవాగుపై దుస్తులు మార్చుకునే గదులు, మూడుచోట్ల సులభ్‌ కాంప్లెక్స్‌లు, రెండు ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు, రెండు డైనింగ్‌హాల్‌లు, గత జాతర సందర్భంగా నిర్మించిన విడిది షెడ్ల వద్ద మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.

అదేవిధంగా రూ.1.8కోట్ల వ్యయంతో మేడారం బస్టాండు, హరిత హోటల్‌, ఇంగ్లీషుమీడియం స్కూల్‌ వద్ద మూడు ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లను నిర్మించనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఈసారి మేడారం అనుబంధ జాతరకు ప్రాధాన్యతనిస్తూ దొడ్ల, కొండాయి, నార్లాపూర్‌, బయ్యక్కపేట, పూనుగొండ్లలోని ఆయా దేవతల ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆలయాల మరమ్మతుతోపాటు ప్రహరిగోడలు, మరుగుదొడ్లు, కమ్యూనిటీ షెడ్లను నిర్మించనున్నామన్నారు. మేడారం పరిసరాల్లో వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మూడు సబ్‌సెంటర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పార్కింగ్‌ ఏర్పాట్లను ఈసారి ఏటూరునాగారం ఐటీడీఏ పర్యవేక్షిస్తుందని స్పష్టంచేశారు.





Updated Date - 2021-11-10T05:30:00+05:30 IST