మరోసారి ఆ చట్టానికి Jagan Sarkar పదును.. ఈసారి ఏం జరుగునో..!?

ABN , First Publish Date - 2021-12-16T08:19:45+05:30 IST

మరోసారి ఆ చట్టానికి Jagan Sarkar పదును.. ఈసారి ఏం జరుగునో..!?..

మరోసారి ఆ చట్టానికి Jagan Sarkar పదును.. ఈసారి ఏం జరుగునో..!?

  • ఒప్పందంలోని వ్యక్తికి అమ్మితేనే..
  • 4 శాతం ఫీజు వెనక్కి
  • ‘సేల్‌ కమ్‌ జీపీఏ’పై కొత్త రూల్‌


అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆదాయం పెంచుకోవడం-ప్రజలపై పన్నులు, చార్జీలు పెంచేందుకు అదనపు మార్గాలు ఏమున్నాయోనని పరిశీలిస్తున్న రాష్ట్రప్రభుత్వం.. మరోసారి చట్టానికి పదునుపెట్టింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న వాటికి కొన్ని వివరణలు ఇస్తూ అదనపు ఆదాయం ఆర్జించేందుకు రంగం సిద్ధం చేసింది. ‘సేల్‌ కమ్‌ జీపీఏ’కు కూడా తాజాగా వివరణ ఇచ్చింది. సేల్‌ కమ్‌ జీపీఏ అంటే.. ఒక వ్యక్తి తన ఆస్తిని వేరొకరికి అమ్మేస్తూ.. సదరు ఆస్తిని ఇంకొకరికి అమ్మే జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) కూడా ఇవ్వడం.  సాధారణంగా ఇలాంటి డాక్యుమెంట్లను వ్యాపారంలో రక్షణ కోసం చేస్తుంటారు. ‘ఏ’ అనే వ్యక్తికి 200 గజాల స్థలం ఉంది. దాన్ని ‘బీ’ అనే వ్యక్తి లక్ష రూపాయలకు కొనుగోలు చేయాలనుకున్నాడు. కొనుగోలు చేశాక సదరు ఆస్తిని తిరిగి కొంత ఎక్కువ ధరకు అమ్మి వ్యాపారం చేయాలనేది అతడి ఉద్దేశం. దీంతో నేరుగా అమ్మకం కింద రిజిస్ర్టేషన్‌ చేసుకుంటే 7.5 శాతం రిజిస్ర్టేషన్‌ చార్జీలు చెల్లించాలి. మళ్లీ తాను మరో వ్యక్తికి అమ్మాలంటే అప్పుడు ఇంకో 7.5 శాతం కట్టాలి. అదే సేల్‌ కమ్‌ జీపీఏ కింద రిజిస్ర్టేషన్‌ చేసుకుంటే.. సదరు ఆస్తిని ‘బీ’ అనే వ్యక్తి ఆ తర్వాత ఎవరికి అమ్మినా నాలుగు శాతం ఫీజు మినహాయింపు వస్తుంది. అంటే ఐదు శాతంలో నాలుగు శాతం వెనక్కి ఇస్తారు. అంటే వేరే వ్యక్తికి అమ్మినప్పుడు.. ఆ డాక్యుమెంట్‌పై మళ్లీ వసూలు చేసే 7.5 శాతం ఫీజులో నికరంగా 3.5 శాతం కడితే సరిపోతుంది.


ముందే వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు.. లేదంటే తామిచ్చిన అప్పులకు రక్షణగా రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు ఈ సేల్‌ కమ్‌ జీపీఏ డాక్యుమెంట్లు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం దీనిని సవరించింది. సేల్‌ కమ్‌ జీపీఏ అనేది ఏ వ్యక్తుల మధ్య కుదిరిందో.. ఆ తర్వాత కూడా వారి మధ్య సేల్‌ డీడ్‌ జరిగితేనే సదరు నాలుగు శాతం రిజిస్ర్టేషన్‌ ఫీజు తగ్గిస్తారని స్పష్టంచేసింది. అంటే ‘ఏ’ అనే వ్యక్తి ‘బీ’ అనే వ్యక్తికి సేల్‌ కమ్‌ జీపీఏ ఇస్తే.. ఐదు శాతం ఫీజు చెల్లించినా.. ఇక ఆ తర్వాత కూడా వారిద్దరి మధ్య సేల్‌ డీడ్‌ జరిగితేనే 4 శాతం పన్నును తగ్గించి మిగతా 3.5 శాతం మాత్రమే వసూలుచేస్తారు. అలాకాకుండా ‘బీ’ అనే వ్యక్తి వేరెవరికైనా సదరు ఆస్తిని అమ్మితే అప్పుడు నాలుగు శాతం పన్ను వెనక్కిరాదు. మొత్తం 7.5 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాల్సిందేనని స్టాంపులు-రిజిస్ర్టేషన్ల శాఖ ఉత్తర్వులు జారీచేసింది.


  • పార్టిషన్‌ ఉంటే దానికీ ఫీజు!

‘ఏ’ అనే వ్యక్తికి వెయ్యిగజాల స్థలం ఉంది. దానిని ‘బీ’ అనే డెవలపర్‌కు ఫ్లాట్ల నిర్మాణం కోసం డెవల్‌పమెంట్‌కు ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగే డెవల్‌పమెంట్‌ ఒప్పందాన్ని రిజిస్టర్‌ చేయించుకోవడానికి ఒక్క శాతం ఫీజు కడితే సరిపోతుంది. అయితే ఒకరే కాకుండా ఇద్దరి స్థలాలు కలిపి వెయ్యి గజాలుంటే.. దాన్ని డెవలపర్‌కు ఇచ్చారనుకుందాం. అప్పుడు డెవలప్‌మెంట్‌ ఒప్పందంలో బిల్డర్‌ ఫ్లాట్లు ఇవి, స్థల యజమానుల ఫ్లాట్లు ఇవి అని స్పష్టంగా రాసుకుంటే అప్పుడు రిజిస్ర్టేషన్‌ ఫీజు నాలుగు శాతం వరకు చెల్లించాల్సి ఉంటుందని స్టాంపులు- రిజిస్ర్టేషన్ల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇది గతంలోనూ ఉన్నా ఇప్పుడు మళ్లీ స్పష్టత ఇస్తున్నామని పేర్కొంది.

Updated Date - 2021-12-16T08:19:45+05:30 IST