నిర్లక్ష్యపు నీడలో సాగర్‌

ABN , First Publish Date - 2022-08-11T08:19:42+05:30 IST

నిర్లక్ష్యపు నీడలో సాగర్‌

నిర్లక్ష్యపు నీడలో సాగర్‌

మూడేళ్లుగా మరమ్మతుల్లేని స్పిల్‌వే

కాల్షియం కోరల్లో సీపేజ్‌ రంధ్రాలు 

ఈ ఏడాది కూడా పనులు పూర్తి చేయలేని వైనం 


విజయపురిసౌత్‌, ఆగస్టు 10: నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తయి ఉపయోగంలోకి వచ్చి అర్ధ శతాబ్దం దాటింది. నిర్మాణ సమయంలో పనుల పర్యవేక్షణకు చీఫ్‌ ఇంజనీరు కార్యాలయాన్ని సాగర్‌లోనే ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్‌ పర్యవేక్షణకు మరమ్మతుల అవసరాన్ని గుర్తించేందుకు నాటి కంటే ఇప్పుడే ఉన్నతాఽధికారుల అవసరం ఎక్కువగా ఉంది. ఏటా వర్షాలు రావడం, స్పిల్‌ వేపై రంధ్రాలు(పిట్స్‌) పడడం సహజమే. ఈ రంధ్రాలను పూడ్చేందుకు సుమారు నాలుగు నెలల వ్యవధి అవసరం. మార్చిలో టెండర్లు పిలిచి, జూలై నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. టెండర్ల సమయమంతా వృథా చేయడంతో ఈ ఏడాది కూడా స్పిల్‌వే పనులు పూర్తి చేయలేకపోయారు. మూడేళ్లుగా స్పిల్‌ వే మరమ్మతులకు నోచుకోలేదు. సీఈ స్థాయి అధికారి నాగార్జున సాగర్‌ కార్యాలయంలో ఉంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో పాటు టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసేవారు. స్పిల్‌వే వేరివింగ్‌ కోటింగ్‌ కాంక్రీట్‌ మందం రెండు మీటర్ల వరకు ఉంటుంది. స్పిల్‌వేపై ఏర్పడిన రంధ్రాలతో వేరివింగ్‌ కోటింగ్‌ కాంక్రీట్‌ కొట్టుకుపోయింది. అలాగే సీపేజ్‌ రంధ్రాలు కాల్షియం కోరల్లో చిక్కుకోవడంతో సీపేజ్‌ వాటర్‌ పంపడం కష్టం. కొన్ని సీపేజ్‌ రంధ్రాలు కాల్షియంతో మూసుకుపోగా మిగిలిన రంధ్రాల ద్వారా సీపేజ్‌ నీరు బయటకు వెళ్తోంది. గతంలో భద్రత కమిటీ సీపేజ్‌ రంధ్రాలు వేయాలని సూచించింది. దీంతో 26వ బ్లాక్‌లో సీపేజ్‌ రంధ్రం ఏర్పాటు చేసి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. సీపేజ్‌ రంధ్రాలు 45 డిగ్రీల కోణంలో ఉండడంతో అందులో ఏర్పడిన కాల్షియంను పూర్తి స్థాయిలో తొలగించడం కష్టంగా మారుతోంది. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు ఉంటేనే నూతనంగా ఏర్పాటు చేసుకుంటున్న లిఫ్ట్‌ ఇరిగేషన్లు పనిచేస్తాయి. వందల కోట్లతో నూతనంగా లిఫ్ట్‌ ఇరిగేషన్లు ఏర్పాటు చేసుకుంటున్నా డ్యామ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి డ్యామ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే ఇరు రాష్ట్రాల ప్రజలకు పది కాలాలపాటు తాగు, సాగు నీటితో పాటు విద్యుత్‌ను అందించవచ్చు. 

Updated Date - 2022-08-11T08:19:42+05:30 IST