సగం నిద్దుర నెలవంక

ABN , First Publish Date - 2022-07-04T06:37:51+05:30 IST

పండు వెన్నెల్లో రెండు తాడిచెట్లు కూర్చుని బైరాగి గీతాన్ని వింటున్నాయి. తాటాకు గుడిసె ముందు పరిచిన బొంతపై...

సగం నిద్దుర నెలవంక

పండు వెన్నెల్లో

రెండు తాడిచెట్లు కూర్చుని

బైరాగి గీతాన్ని వింటున్నాయి.

తాటాకు గుడిసె


ముందు పరిచిన బొంతపై

అవ్వా మనవళ్ల మధ్య దూరి

కథలు వింటూ నిదురోతాడు

చంద్రుడు.


కట్టెల పొయ్యిపై

రొట్టెలు కాల్చుతున్న అమ్మ చెమట ముఖంలో

తళ తళ మెరుస్తాయి

నక్షత్రాలు

రేరాజు చుట్టూ వరద గూడులా

అమ్మను ఆవరించే దిగులు మబ్బులు


ఊరు సద్దుమణిగింది

పొలిమేరల్లో నక్కలు ఊళల రాగంలో

ఉయ్యాలలూగుతున్నాయి


తాటి తోపునుండి

అయ్య పాడుకుంటూ వచ్చే

గువ్వల చెన్న పద్యాలు వినడానికి

చెట్టు పుట్ట

చేల కాలిదారి

ఆకాసంలో వేగుచుక్క

ఆవులిస్తూ కాచుకు కూచుంటాయి.

గరికపాటి మణీందర్‌

99483 26270


Updated Date - 2022-07-04T06:37:51+05:30 IST