Abn logo
Apr 17 2021 @ 00:26AM

ఆ రోజుల్లో త్యాగం ఇప్పుడు లేదు!

తొలితరం వైద్యుల్లో ఆయన ప్రముఖుడు. సాధారణ ఆస్పత్రిగా ఉన్న ‘నిమ్స్‌’ను కార్పొరేట్‌ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి మరువలేనిది. ఆయనే డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు. 2017 మే నెలలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ  ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమం కోసం కాకర్లతో సంభాషించారు. ఆనాటి సంభాషణల్లో కొన్ని ముఖ్యాంశాలు...


మీది చాలా సుదీర్ఘ ప్రయణం. ఈ లాంగ్‌ జర్నీ ఎలా అనిపిస్తుంది?

విసుగుపుడుతోంది. ఎందుకంటే కొలీగ్స్‌ చాలా మంది చనిపోయారు. శిష్యులు కూడా పోయారు. అకడమిక్స్‌కు వచ్చేటప్పటికి ఉత్సాహం వచ్చేస్తుంది. స్టూడెంట్స్‌కు సమాధానాలు చెప్పడం, వాళ్లు నన్ను ఛాలెంజ్‌ చేయడం... వంటి సంఘటనలతో హుషారు పుట్టుకొస్తుంది.


మెడిసిన్‌ వైపు వెళ్లడానికి ప్రేరణ ఎవరు?

మెడిసిన్‌ చేయాలని అనుకోలేదు. మొదటి నుంచి నాకు లెక్కలంటే ఇష్టం. ఇంజనీరింగ్‌ సీటు వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అంతకుముందు మెడిసిన్‌ కోసం తెచ్చిన అప్లికేషన్‌ ఫామ్‌ నా దగ్గర అలానే ఉంది. సరే అప్లై చేద్దాం అని చేశాను. సీటొచ్చింది. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. అయితే నేను, నా స్నేహితుడు కలిసి వెళ్లి 450 రూపాయలు ఫీజు కట్టి వచ్చాం. ఇక, ఫీజు కట్టాక ఏం చేస్తారు. అలా కంటిన్యూ అయిపోయాను. 


స్వాతంత్య్రం పూర్వం చూశారు, స్వాతంత్య్రం తరువాత సుమారు 70 ఏళ్లు చూశారు. ఎలా అనిపిస్తుంది?

ఆ రోజుల్లో ఉన్న తపన, త్యాగం ఇప్పుడు లేవు. ఎంతసేపు డబ్బు సంపాదనపైనే ధ్యాసంతా. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి, పేరు తెచ్చుకోవాలి. ఎట్లా పేరొచ్చినా ఫరవాలేదు.


అమెరికా ఆలోచన ఎలా వచ్చింది?

చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్లాలని ఉండేది. జయప్రకాష్‌ నారాయణ వెళ్లిన తరువాత ఇక తప్పకుండా వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఒకసారి ఛాన్స్‌ వచ్చింది. అప్పుడే ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వారు ఒక అడ్వర్‌టైజ్‌మెంట్‌ వేశారు. ఏంటంటే అమెరికాలో వైద్యపోస్టులు ఖాళీగా ఉన్నాయి అప్లై చేసుకొమ్మని. నా హౌజ్‌ సర్జన్‌ పూర్తి కాలేదు. అప్లై చేసిన వాళ్లంతా ఎండిలు, ఎంఎస్‌లు, పది సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు. అందుకే నేను రేడియాలజీ, డెర్మటాలజీకి మాత్రమే అప్లై చేశాను. రేడియాలజీ విభాగంలో ఛాన్స్‌ వచ్చింది. 


అమెరికా నుంచి  తిరిగి ఎందుకు వెనక్కొచ్చారు?

మొదటిసారి వెళ్లినపుడు ఐదేళ్లు ఉన్నాను. 1956లో చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం వచ్చింది. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చే సమయంలో ఫస్ట్‌ పేపర్స్‌ లేవని పంపించారు. ఆ రోజుల్లో గ్రీన్‌కార్డ్‌ అనేది లేదు. అలా  ఇండియాకి తిరిగొచ్చేశా. 


ఆ తరువాత మళ్లీ అమెరికా ఎందుకెళ్లారు?

ఉస్మానియాలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరిన 14 ఏళ్ల తరువాత అంటే 1970లో మళ్లీ అమెరికా వెళ్లాను. దాని వెనకాల పెద్ద కథ ఉంది. మా మామగారు, అత్తగారికి ఒక్కతే కూతురు. వాళ్లు కూడా హైదరాబాద్‌ వచ్చేశారు. ఆ సమయంలో షేక్‌పేటలో పొలం కొన్నాను. ద్రాక్షతోట ఉండేది. అక్కడే ఇల్లు కట్టుకున్నాం. అప్పుడే నేను, కొందరు మిత్రులం స్కాలర్స్‌గా ఇంగ్లండ్‌  వెళ్లాం. తిరిగొచ్చేటప్పటికి ఎయిర్‌పోర్టులో ఫుల్‌ సెక్యూరిటీ ఉంది. ఏంటీ విషయం అని అడిగితే తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉందని చెప్పారు. ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు మా ద్రాక్షతోటను నరికేశారు. ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను. తరువాత పది, పదిహేను రోజులకు మా ఇల్లు  తగలబెట్టారు. ఆ సంఘటనతో బాగా డిస్టర్బ్‌ అయ్యాను. పిల్లలను ఎక్కడ చదివించాలో అర్థం కాలేదు. ఆ సమయంలోనే ఓల్డ్‌ ప్రొఫెసర్‌ని కలిశాను. ఆయన సహాయంతో భార్యా పిల్లలను తీసుకుని అమెరికా వెళ్లిపోయాను. 


ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక అమెరికా నుంచి తిరిగొచ్చారా?

అవును. ఎన్టీఆర్‌గారు అమెరికాలో ఆపరేషన్‌ చేయించుకున్నాక కళ్లు తెరిచి చూస్తే పక్కన అందరూ ఇండియన్సే. ఎనస్తీషియన్‌ ఇండియనే. సర్జన్‌ ఇండియనే. ‘మీరంత ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ అవసరం అక్కడ చాలా ఉంది. మీరు వెంటనే  వచ్చేయండి’ అన్నారు ఎన్టీఆర్‌. ‘హాస్పిటల్స్‌ కట్టిస్తాను తప్పక  రావాల్సిందే’ అని చెప్పి ఒక యాభై మంది డాక్టర్లను సమకూర్చుకున్నారు. తరువాత చికాగో వెళ్లారు. అక్కడొక వంద మంది డాక్టర్లను ఒప్పించారు. మీరు సీనియర్‌ తప్పకుండా రావాలని నన్ను కూడా పిలిచారు. ఆయన మాటతో వచ్చాం. ‘హాస్పిటల్‌ కట్టుకుంటాం’ అని స్థలం అడిగితే సంగారెడ్డి దగ్గర చూపించారు. కేబీఆర్‌ పార్కు దగ్గర స్థలం అడిగితే అది ఇవ్వడానికి కుదరదు అన్నారు. దాంతో మళ్లీ అమెరికా వెళ్లిపోయాను. మరుసటి ఏడాది తానా సభలకు హెల్త్‌ మినిస్టర్‌ వచ్చారు. మీరు తప్పకుండా హైదరాబాద్‌ రావాలని మళ్లీ నన్ను ఆహ్వానించారు. నాకు అప్పుడు ఏడాది లీవ్‌ మంజూరయి ఉంది. దాంతో సరే అని వచ్చా. మూడు నాలుగు నెలలు ఖాళీగా ఉన్నా. సెక్రటేరియట్‌కి తిరిగీ తిరిగీ విసిగిపోయా. అందరూ జోకులేసే వారు. ఇలాకాదు నేను వెళ్లిపోతానని ఎన్టీఆర్‌కి చెప్పా. అప్పుడాయన అందరినీ పిలిపించి మాట్లాడి నిమ్స్‌ హాస్పిటల్‌ను చేతుల్లో పెట్టారు. 


బొక్కల దవాఖానాగా పేరున్న నిమ్స్‌ను కార్పొరేట్‌ హాస్సిటల్‌ స్థాయికి తీసుకెళ్లారు. ఎలాంటి కష్టాలు పడ్డారు?

మా కష్టం ఏమిటంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. అడ్వాన్స్‌డ్‌ మిషన్‌ కొనడానికి నానా అవస్థలు పడ్డాం. ఒకసారి సీటీ స్కాన్‌ కొనడానికి డబ్బులు కావాలని ఎన్టీఆర్‌ని అడిగాను. ‘డబ్బు ఉంటే నువ్వేం కావాలి’ అని అందరు ముందు అన్నారు. చాలా ఇన్‌సల్ట్‌గా ఫీలయ్యాను. 


చివరి వరకు ఎన్టీఆర్‌తో అనుబంధం అలాగే కొనసాగిందా?

పదవి పోయాక ఎన్టీఆర్‌తో చెప్పాను. రిజైన్‌ చేస్తానండీ అని. అయితే ‘లేదు లేదు మీరు చేయాల్సిన అవసరం లేదు’ అన్నారు. 


నిమ్స్‌ విషయంలో మీ మీద ఆరోపణలు చేసిన వారు తరువాత కలిసి మాట్లాడారా?

ఒకసారి పీజేఆర్‌ (పి.జనార్ధన్‌రెడ్డి) మెడ్విన్‌లో కలిశాడు. బాగా  మాట్లాడాడు. 


పిల్లలందరూ డాక్టర్‌లేనా..

నా మొత్తం కుటుంబం 21 మంది. అందులో 11 మంది డాక్టర్లు. కాకపోతే యావరేజ్‌ డాక్టర్స్‌. టాప్‌ పొజిషన్‌కు చేరుకోలేదు. మా మనుమరాలొక్కతే ఆ స్థాయికి వెళ్లే దిశగా కృషి చేస్తోంది.

Advertisement
Advertisement
Advertisement