రైతుబంధు సొమ్ము.. పాత బాకీలకు!

ABN , First Publish Date - 2022-07-07T08:12:22+05:30 IST

పంటల సాగు సమయంలో రైతులు పెట్టుబడి కోసంఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుబంధు పథకం లక్ష్యానికి బ్యాంకర్లు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు.

రైతుబంధు సొమ్ము.. పాత బాకీలకు!

  • ఖాతాలో జమ కాగానే రికవరీ చేస్తున్న బ్యాంకర్లు..
  • పెట్టుబడులకు రైతుల ఇక్కట్లు
  • పాతబాకీలు తీర్చేందుకు గడువు ఉన్నా రికవరీ
  • మళ్లీ ప్రారంభమైన రైతుబంధు డబ్బుల జమ
  • ఒక్కరోజే 4.45 లక్షల ఖాతాల్లోకి 855.29 కోట్లు


హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పంటల సాగు సమయంలో రైతులు పెట్టుబడి కోసంఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుబంధు పథకం లక్ష్యానికి బ్యాంకర్లు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. పెట్టుబడి ఖర్చుల కోసం రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు సొమ్మును పాత బకాయిలకు మళ్లిస్తున్నారు. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలు చెల్లించలేదని, రెన్యువల్‌ కూడా చేయడంలేదనే కారణంతో.. రైతుబంధు సొమ్మును బ్యాంకర్లు రికవరీ చేసుకుంటున్నారు. దీంతో రైతులు పంటల సాగుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పెట్టుబడి కోసం ఇచ్చే సొమ్మును బ్యాంకువారు తమ చేతికి అందనివ్వడంలేదని, క్లిష్ట పరిస్థితుల్లో పాత బాకీల కిందికి మళ్లించడమేంటని వాపోతున్నారు. వాస్తవానికి బ్యాంకుల్లో పంటరుణం తీసుకుంటే ఏడాది వరకు ఎప్పుడైనా చెల్లించవచ్చనే నిబంధన ఉంది. ఒకవేళ నిర్ణీత గడువు దాటిపోతే వడ్డీరేటు పెరుగుతుంది. ఉదాహరణకు 2021 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారనుకుంటే.. ప్రస్తుతం వాటిని తిరిగి చెల్లించటానికి ఇంకా రెండు, మూడు నెలల సమయం ఉంది. అయినా.. రైతుల ఖాతాల్లో పడిన డబ్బును వెంటనే బ్యాంకర్లు ఖాతాలకు మళ్లిస్తున్నారు. 


గతేడాది మాత్రమే కాకుండా 2018 నాటికి ఉన్న పంటరుణాలను కూడా రికవరీ చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదు. రూ.50 వేల వరకు మాఫీ చేస్తామని ప్రకటించినా.. రూ.34 వేల వరకే మాఫీ చేసింది. ఇంకా రెండు మూడు విడతలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవికాకుండా లక్షలాది మంది రైతుల బ్యాంకు అకౌంట్లను డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు. ఈ జాబితాలో పేరున్న రైతులకు మరో మరో సేవింగ్‌ అకౌంట్‌ ఉంటే, దానిని స్తంభింపజేసి పాత బకాయులు ఉన్న బ్యాంకు ఖాతాలోకి రైతుబంధు నిధులను మళ్లిస్తున్నారు. ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే.. తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని, ఎలాగైనా డబ్బులు రికవరీ చేయాలనే ఆదేశాల మేరకే పాత బకాయిలకు రైతుబంధు సొమ్మును మళ్లించాల్సి వస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, బ్యాంకు నుంచి రైతుబంధు సొమ్ము ఖాతాలో నమోదైనట్లు మొబైల్‌ ఫోన్‌కు సంక్షిప్త సందేశం రాగానే.. రైతులు బ్యాంకులకు వెళ్తున్నారు. డబ్బు డ్రా చేద్దామంటే బ్యాలెన్స్‌ లేదని బ్యాక్‌ సిబ్బంది చెబుతున్నారు. 


ఈ వానాకాలంలో ఇప్పటివరకు రైతుబంధు ఆర్థిక సహాయం పొందిన వారంతా చిన్న, సన్నకారు రైతులే కావడం గమనార్హం. రూ.లక్షలు, కోట్ల బకాయిలు ఉన్నవారిని వదిలేసి... పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం ఇచ్చిన రూ.5 వేలు, రూ.10వేలు కూడా రికవరీ చేసుకోవడాన్ని రైతులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయని, ప్రైవేటు అప్పు చేస్తే వడ్డీ రేటు ఎక్కువవుతుందని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే కొద్దో, గొప్పో సాయాన్ని కూడా బ్యాంకర్లే రికవరీ చేసుకుంటే ఏంచేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. గతేడాది కూడా ఇదే తరహాలో బ్యాంకర్లు రైతుబంధు నిధులను పాత బకాయిల కింద జమ చేసుకుంటుంటే.. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పాత బకాయిలకు రైతుబంధు సొమ్మును మళ్లించవద్దని, పెట్టుబడి సాయం కింద ఇచ్చే సొమ్మును రైతులకు నేరుగా ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకర్లు ఎవరినైనా ఇబ్బందులకు గురిచేస్తే కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని మంత్రి ప్రకటించారు. అయినా బ్యాంకర్ల తీరులో మార్పు రావడంలేదు. 


రైతుబంఽధు నిధుల విడుదల పునఃప్రారంభం

నాలుగైదు రోజులుగా నిలిచిపోయిన రైతుబంధు నిధుల పంపిణీ బుధవారం పునఃప్రారంభమైంది. ఖజానాలో నిధుల కొరత కారణంగా మూడెకరాల వరకు భూమి ఉన్న రైతులకు చెల్లింపులు చేసి ఆ తర్వాత నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే రిజర్వు బ్యాంకు నుంచి రెండో త్రైమాసికానికి సంబంధించి ప్రభుత్వం రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. నిధులు సర్దుబాటు కావటంతో బుధవారం రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను జమ చేశారు. 4, 5 ఎకరాల వరకు భూమి ఉన్న 4.45లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.855.29 కోట్లు బుధవారం జమబచేశారు. 


ఆ సొమ్ము రైతులకే ఇవ్వాలి: పల్లా 

రైతుబంధు సొమ్మును రైతులకు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు సమస్యలు సృష్టించవద్దని రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.  రైతులకు పెట్టుబడి ఖర్చుల కోసం ప్రభుత్వం నగదు బదిలీ చేస్తోందని తెలిపారు. పాత బాకీలు ఉంటే తర్వాత రికవరీ చేసుకోవాలని, ఇప్పుడు సమయం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బ్యాంకర్లు తప్పకుండా పాటించాలని, ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతులకు చెల్లించాలని సూచించారు.

Updated Date - 2022-07-07T08:12:22+05:30 IST