Abn logo
May 11 2021 @ 15:01PM

రుయా మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం

అమరావతి: రుయా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులతో చర్చించిన సీఎం జగన్ తాజా ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే, ముగ్గురు సీనియర్ అధికారులు మూడు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. వారికి ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలకు ముగ్గురు అధికారులు వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే, ప్రతిపక్షాల విమర్శలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. 22 నెలల్లో పేదలకు 87వేల కోట్ల రూపాయలను ఇవ్వగా.. వ్యాక్సిన్‌కు రూ.1600 కోట్లు ఇవ్వలేరా అంటూ విమర్శిస్తుండటాన్ని జగన్ తప్పుబట్టారు. ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును జీర్ణించుకోలేక చేస్తున్న దుష్ప్రచారంగా సీఎం దీన్ని అభివర్ణించారు. 


తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ 19, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లు, వైఎస్ఆర్ జలకళ, వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్‌లు, నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పురోగతి, స్పందన గ్రీవెన్స్ తదితర అంశాలపై సమీక్షించారు. 

Advertisement