ఉక్రెయిన్‌ చర్చలకు సిద్ధమన్న రష్యా

ABN , First Publish Date - 2022-02-16T07:08:50+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధానికి కాలుదువ్వుతున్న రష్యా కొంత

ఉక్రెయిన్‌ చర్చలకు సిద్ధమన్న రష్యా

  • నమ్మేది లేదన్న ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి
  • పరిస్థితిని గమనిస్తున్న యూరోపియన్‌ దేశాలు
  • ఉక్రెయిన్‌లో ఉండొద్దు.. వచ్చేయండి: భారత్‌ ప్రకటన
  • ఉక్రెయిన్‌ నుంచి బలగాలను వెనక్కి మళ్లించినట్టు వెల్లడి.. చర్చలకు సిద్ధమన్న పుతిన్‌

 

మాస్కో/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఉక్రెయిన్‌పై యుద్ధానికి కాలుదువ్వుతున్న రష్యా కొంత మెత్తబడింది. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడితో రష్యా వెనక్కి తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. రష్యా తాజా ప్రకటనలో ఉక్రెయిన్‌ సరిహద్దుల వెంబడి మోహరించిన బలగాల్లో కొన్నింటిని వెనక్కి రప్పిస్తున్నట్టు తెలిపింది. అయితే.. ఎక్కడి నుంచి ఎన్ని బలగాలను వెనక్కి రప్పిస్తున్నదీ వివరించలేదు. ఉక్రెయిన్‌తో వివాదాలకు సంబంధించిన అంశాలు సహా భద్రతా పరమైన అన్ని విషయాలపై చర్చించేందుకు తాము సిద్ధమేనని రష్యా విదేశాంగ మంత్రి ప్రకటించిన తదుపరిరోజే బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించడంతో యుద్ధం లేనట్టేనని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. అంతేకాదు, ఉక్రెయిన్‌పై యుద్ధం కేవలం ప్రచారమేనని రష్యా పేర్కొంది.


అయితే.. ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా మాత్రం రష్యా ప్రకటనను తోసిపుచ్చారు. ఇప్పటికే రష్యా ఇలాంటి ప్రకటనలు ఎన్నో చేసిందని.. కంటితో చూస్తే తప్ప తాము నమ్మలేమని వాఖ్యానించారు. మరోవైపు ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ చీఫ్‌ ఒలెక్సీ డేనిలోవ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి తగ్గుముఖం పట్టిందని.. అయినా సరిహద్దుల వెంట అప్రమత్తంగా ఉంటామని అన్నారు. యుద్ధం మాట అటుంచితే.. ‘అంతర్గత అస్థిరత’ ప్రమాదం పొంచి ఉందనే సందేహం వ్యక్తం చేశారు. కాగా, రష్యా ఇప్పటి వరకు 1.3 లక్షల మంది జవాన్లను ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మోహరించింది. దీంతో ఇరు దేశాల ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. 


చర్చలకు సిద్ధం: పుతిన్‌

అమెరికా సహా నాటోతో చర్చలకు తాము సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మంగళవారం ప్రకటించారు. ఉక్రెయిన్‌ నేతలతో చర్చలు జరిపిన జర్మన్‌ చాన్సలర్‌ ఓల్ఫ్‌ స్కాల్జ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపారు. అనంతరం పుతిన్‌ మాట్లాడుతూ.. చర్చలకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అయితే, తమ వాదనను అమెరికా సహా నాటో పెడచెవిన పెడుతున్నాయని చెప్పారు. రష్యా సరిహద్దుల వెంబడి ఆయుధాల మోహరింపును నిలిపివేయాలని, తూర్పు యూరప్‌ దేశాల నుంచి భద్రతా బలగాలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌, పుతిన్‌ సంభాషణల తాలూకు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.


ఓ టీవీ చానెల్‌లో సందేశం ఇచ్చేందుకు ఇరువురు నేతలు చర్చించుకున్నారు. సెర్గీ మాట్లాడుతూ.. పశ్చిమ దేశాలు తమ డిమాండ్లను తోసిపుచ్చుతున్నాయని, అయినప్పటికీ.. చర్చలకు రష్యా సంసిద్ధంగానే ఉందని చెప్పారు. చర్చలను నిరవధికంగా కొనసాగించలేక పోయినా.. ప్రస్తుత దశలో అవి అత్యంత కీలకమని తెలిపారు. ఇక, ఉక్రెయిన్‌ సరిహద్దుల వెంబడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న యూరోపియన్‌ నాయకులు.. పరిస్థితి సానుకూలంగా ఉండడంతో చర్చలకు సిద్ధమయ్యారు. మరోవైపు, దూకుడు తగ్గించుకోకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని రష్యాను అమెరికా మరోసారి హెచ్చరించింది.


అదేసమయంలో రష్యా నిర్మాణాత్మక పద్ధతిని ఎంచుకుంటే చర్చలకు ఎప్పుడూ అవకాశం ఉంటుందని వైట్‌హౌస్‌ డిప్యూటీ మీడియా అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, ఉక్రెయిన్‌ రాజధాని కివీలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరాన్ని కాపాడాలంటూ.. మేయర్‌ బహిరంగ లేఖ రాశారు. మరోవైపు, ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెబ్‌సైట్‌తో పాటు కొన్ని బ్యాంక్‌లపై సైబర్‌ దాడి జరిగింది. ఉక్రెయిన్‌ భద్రతా కేంద్రం ఈ విషయం వెల్లడించింది. 



Updated Date - 2022-02-16T07:08:50+05:30 IST