జగమంతా శివపదం... Rushipeetham ఆధ్వర్యంలో ఘనంగా శివపదాల అంతర్జాతీయ పాటల పోటీ

ABN , First Publish Date - 2022-05-18T00:27:40+05:30 IST

ఋషీపీఠం ఆధ్వర్యంలో రెండవ శివపదాల అంతర్జాతీయ పాటల పోటీ ఈ నెల మే 13,14,15, న యూట్యూబ్ మాధ్యమంగా జరిగింది.

జగమంతా శివపదం... Rushipeetham ఆధ్వర్యంలో ఘనంగా  శివపదాల అంతర్జాతీయ పాటల పోటీ

పూజ్య గురువుగారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు దాదాపు 1000 పైగా శివపద గీతాలు అత్యద్భుతంగా  రచించారు. ఋషీపీఠం ఆధ్వర్యంలో రెండవ శివపదాల అంతర్జాతీయ పాటల పోటీ ఈ నెల మే 13,14,15, న యూట్యూబ్ మాధ్యమంగా జరిగింది. వాణీ, రవి గుండ్లాపల్లి గార్లు , మేఘన , నాగ సంపత వారణాసి , హరి డొక్కగార్లు విజయ, శ్రీ కాంత్ వడ్లమాని  బృందం జరిపించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 


ఇందులో..  4 ఖండాలలోని 14దేశాలనుంచి చిన్నపిల్లలనించి, పెద్దవాళ్లవరకూ 300 మంది  ఔత్సాహికులు ఈ పాటల పోటీల్లో పాల్గున్నారు. అభ్యర్థులను వయసువారీగా 5 విభాగాలుగా విభజించి, ఆయా విభాగాలకు ప్రశస్త శివభక్తుల పేర్లయిన "ఉపమన్యు ", "మార్కండేయ", "భక్త కన్నప్ప", "నత్కీర","పుష్పదంత " గా నిర్ణయించారు. US, భారత్ ,ఆస్ట్రేలియా, సింగపూర్  నుంచి 16 మంది ప్రఖ్యాత  సంగీతగురువులు  న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వీరిలో..  భారతదేశం నుండి తులసి విశ్వనాథ్, పద్మ త్యాగరాజన్, శారదా సుబ్రమణియన్, కౌశిక్ కల్యాణ్, జీవీ ప్రభాకర్,  ఎమ్‌వీ మెహన్ , పెద్దాడ సూర్యకుమారి,   ఆర్‌వీ లక్ష్మి  మూర్తి,  విష్ణుప్రియ భరధ్వాజ్, అమెరికా నుండి శ్రీ కాంత్ మల్లాజ్యోస్యుల, లక్ష్మి కొలవెన్ను, సుధా దూసి, అనీల కుమార్ గరిమెళ్ళ, లలిత రాంపల్లి, సింగపూర్ నుండి శేషు కుమారి యడవల్లి, ఆస్ట్రేలియా నుండి Dr.పద్మా మల్లెల న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. 


షణ్ముఖుని  శివుని ఆరు విభాగాలతో తలపిస్తు ఈ కార్యక్రమం ఆరు పూటల జరిగింది. ప్రతిపూటా కంచి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి, పూజ్య గురువు గారి దివ్య ఆశీస్సులతో, పరిచయవ్యాఖ్యలతో మొదలయ్యింది. అందరి పాటలనూ విన్న శ్రీ షణ్ముఖ శర్మ, శివపదం తనకోసం, తన జీవితపరమావధిగా,  సార్ధకతగా రాసుకున్నపాటలుగా అభివర్ణిస్తూ, ఇంత మంది వాటిని చక్కగా పాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని శివాశీస్సులు అందించారు.  ముఖ్యంగా ఎక్కువ మంది చిన్నపిల్లలు ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రవాసులయిన ఎందరో పిల్లలు కూడా సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో, స్పష్టమైన ఉఛ్చారణతో శృతి, లయ బద్ధంగా అద్భుతంగా ఆలపించారు. చిన్మయ జ్యోతిర్మయలింగం, పాలవన్నెవాడు, శివుడు ధరించిన, సకలమంత్రముల సంభవమూలం, సభాపతి పాహిపాహిమామ్ శివపద కల్యాణ గీతాలు, మొదలుకుని దాదాపు 200 పైగా శివపదాలను అద్భుతంగా, వీనులవిందుగా పాడారు. పోటీలో పాల్గున్నవాళ్ళు, న్యాయనిర్ణేతలు తగు సూచనలు ఇస్తూ, ఉత్సాహవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. 


"ఆత్మాత్వం గిరిజా మతిః "అని శివ మానసపూజలో శ్రీ శంకర భగవత్పాదులు అన్నట్లుగా, పాడే వారూ, వేలాదిగా విన్నవారూ, అందరూ తన్మయత్వంతో తమలో, అంతటిలోనూ శివుణ్ణి ఎరుకగాంచే విధంగా ఆద్యంతం రసరమ్యంగా జరిగిన ఈ కార్యక్రమం భారతదేశ కాలమానం ప్రకారం శుక్రవారం మొదలయ్యి, ఆదివారం నాడు ముగిసింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని, ఇంతటి బృహత్కార్యక్రమాన్ని ఎంతో శ్రమకోర్చి, ఇంత అత్యుత్తమం గా నిర్వహించిన వాణి , రవి గుండ్లపల్లిను శివపద బృందం వీక్షకులంతా  కూడా అభినందించారు.  



Updated Date - 2022-05-18T00:27:40+05:30 IST