బాదుడే బాదుడుకు ఆర్టీసీ రెడీ!

ABN , First Publish Date - 2022-04-13T08:12:43+05:30 IST

ఆర్టీసీ బాదుడుకు రంగం సిద్ధమైంది.

బాదుడే బాదుడుకు ఆర్టీసీ రెడీ!

  • రేపో మాపో భారీగా పెరగనున్న చార్జీలు
  • ఇకపై ‘పల్లె వెలుగు’ కనీస చార్జీ రూ.10
  • సూపర్‌ లగ్జరీ మినిమమ్‌ చార్జీ రూ.60
  • ఏసీ బస్సు ఎక్కితే వంద చెల్లించుకోవాల్సిందే
  • మూడేళ్లలో రెండోసారి ఆర్టీసీ బాదుడు
  • సర్కారుకు ప్రతినెలా రూ.200 కోట్లు కప్పం
  • కట్టలేము మహాప్రభో అన్నా వినని జగన్‌
  • మరోవైపు.. పెరుగుతున్న డీజిల్‌ ధరలు
  • ఆర్టీసీకి కూడా రాయితీ ఇవ్వని సర్కారు
  • పెంపు తప్పదని అధికారుల నిర్ణయం


‘బాదుడే బాదుడు’ పరంపర కొనసాగుతోంది. ఈ సారి ప్రజా రవాణా వ్యవస్థ (ఆర్టీసీ) వంతు! ప్రతి నెలా రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందేనని జగనన్న ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడం, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో.... ఆ భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఒకటిరెండు రోజుల్లోనే టికెట్ల ధరలు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బాదుడుకు రంగం సిద్ధమైంది. అసలే కష్టాల్లో ఉన్నామని... ప్రతినెలా రూ.200 కోట్లు ఇవ్వలేమని, రూ.109 కోట్లతో సరిపెట్టాలని ఆర్టీసీ కోరినా ప్రభుత్వం ససేమిరా అంది. దాంతో ఇక... ప్రయాణికులను బాదడమే పరిష్కారమని ఆర్టీసీ నిర్ణయించుకుంది. చార్జీల పెంపుపై ఉన్నతాధికారులు వారం రోజులపాటు అన్ని కోణాల్లో చర్చించారు. మంగళవారం సాయంత్రం వరకు విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో సుదీర్ఘంగా చర్చించారు. రోజురోజుకూ పెరుగుతోన్న డీజిల్‌ భారం, కొవిడ్‌ సమయంలో ఎదుర్కొన్న నష్టం, తెలంగాణలోనూ పెరిగిన చార్జీలు, ఏపీఎస్‌ఆర్టీసీకి ఉన్న అప్పులు -  వడ్డీలు, నిర్వహణ ఖర్చులు తదితర అంశాలపై సమీక్షించారు. చివరికి... ‘పల్లె వెలుగు’ నుంచి ఏసీ బస్సుల వరకూ అన్ని సర్వీసులపై చార్జీలు పది నుంచి 25శాతం పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ‘పెరగనున్న చార్జీల అమలుకు సిద్ధంగా ఉండండి’ అని మంగళవారం సాయంత్రం డిపోస్థాయి  అధికారులకు సమాచారం వెళ్లింది. అనధికారిక సమాచారం ప్రకారం... పల్లె వెలుగు సర్వీసులో కనీస టికెట్‌ ధర రూ.5 ఉండగా, దీనిని రెట్టింపు చేయనున్నారు. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ఉన్న కనీస చార్జీ రూ.15 నుంచి రూ.20కి  పెరగనుంది. సూపర్‌ లగ్జరీ బస్సులో టికెట్‌ కనీస ధర రూ.45. ఇది... రూ.60కి చేరే అవకాశముంది. ఏసీ బస్సులో కనీస టికెట్‌ ధర రూ.వందకు చేరే  అవకాశమున్నట్లు చెబుతున్నారు. పెరగనున్న టికెట్‌ ధరలపై బుధవారం అధికారిక ప్రకటన వెలువడవచ్చు.  


ఇది రెండోసారి...

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఆర్టీసీ చార్జీలు పెంచడం ఇది రెండోసారి.  అధికారంలోకి వచ్చిన కొత్తలోనే... 2019 డిసెంబరులో పల్లె వెలుగు బస్సుల నుంచి ఏసీ స్లీపర్‌ వరకూ అన్ని సర్వీసులపైనా చార్జీలు పెంచారు. డీజిల్‌ ధరల పెరుగుదల, పల్లె వెలుగు వల్ల నష్టాలు, మోటారు వాహన పన్ను భారం, అప్పులకు వడ్డీలు.... తదితర అంశాలు ఆర్టీసీని కుంగదీస్తున్నాయని అధికారులు వివరిస్తున్నారు. ఆర్టీసీకి డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించుకుంటే... ఎంతో ఉపశమనం కలుగుతుందని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-04-13T08:12:43+05:30 IST