డీజిల్‌ ఖర్చులు కూడా రావట్లేదు!

ABN , First Publish Date - 2020-05-27T07:31:37+05:30 IST

‘లాక్‌డౌన్‌ సమయంలో బస్సులు నడిపితే కనీసం డీజిల్‌ ఖర్చులు కూడా రావడం లేదు. ఇక సిబ్బందికి జీతాల సంగతి దేవుడెరుగు’ అని ఆర్టీసీ అధికారులు...

డీజిల్‌ ఖర్చులు కూడా రావట్లేదు!

  • ఆర్టీసీకి  అత్తెసరు ఆదాయమే
  • రోజుకు 2 కోట్లకు దాటని రాబడి 

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘లాక్‌డౌన్‌ సమయంలో బస్సులు నడిపితే కనీసం డీజిల్‌ ఖర్చులు కూడా రావడం లేదు. ఇక సిబ్బందికి జీతాల సంగతి దేవుడెరుగు’ అని ఆర్టీసీ అధికారులు వాపోతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థమే బస్సులను నడుపుతున్నామని చెబుతున్నా నష్టాలను కొనితెచ్చుకోక తప్పడం లేదు. లాక్‌డౌన్‌కు ముందున్న రాబడిని పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటివరకు దాదాపు రూ.24 కోట్ల వరకు నష్టం వచ్చి ఉంటుందని ఆర్టీసీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీలో ఉన్న మొత్తం 10,460 బస్సుల్లో లాక్‌డౌన్‌కు ముందు 9,700 వరకు బస్సులు నడిచేవి. కానీ లాక్‌డౌన్‌ దీర్ఘకాలికంగా కొనసాగుతుండడంతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందన్న కారణంతో ఈనెల 19 నుంచి బస్సులను నడుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిం దే. 19న 2900 బస్సులు నడిచినా ఆ తర్వాత నుంచి 3800 వరకు బస్సులను నడుపుతూ వస్తున్నారు. అయితే 19 నుంచి ఈనెల 26 వరకు బస్సుల గమనాన్ని పరిశీలిస్తే.. పెద్దగా ప్రయోజనాలు లేవని ఆర్టీసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


రోజూ రూ.2 కోట్లకు మించి రాబడి రావడం లేదు. లాక్‌డౌన్‌కు ముందు ఆర్టీసీకి టికెట్ల అమ్మకాల ద్వారా రోజుకు రూ.13 కోట్ల మేర ఆదాయం వచ్చేది. ఇప్పుడు మొత్తం బస్సులు నడవకపోయినా 3,800 బస్సులకు కనీసం రోజుకు సగటున రూ.5 కోట్ల మేర రాబడి రావాలి. బస్సులు ప్రారంభమైన మొద టి రోజు రూ.63 లక్షల రాబడి మాత్రమే వచ్చింది. ఆ తర్వాతి రోజు నుంచి రాబడి పెరిగింది. ఈ వారం రోజుల్లో సగటున రోజుకు రూ.2 కోట్ల మేర మొత్తం రూ.15 కోట్ల వరకే రాబడి వచ్చింది. అయితే ఇది ఆర్టీసీకి నష్టదాయకంగా మారింది. సాధారణంగా రోజుకు రూ.5 కోట్ల మేర వచ్చినట్లయితే.. కొంత ఉపశమనం కలిగేది. అయితే.. బస్సుల్లో భౌతికదూరం నిబంధన పెద్దగా అమలు కావడం లేదు. బస్సు ప్రయాణం పెద్దగా సురక్షితం కాదన్న భావనలో ప్రజలున్నారు.  దీనికితోడు రాష్ట్రంలో ఎండలు మండిపోవడంతో ప్రయా ణికులు ఆర్టీసీ బస్సులు ఎక్కడంలేదు. 


Updated Date - 2020-05-27T07:31:37+05:30 IST