కస్సు‘బస్సులు’!

ABN , First Publish Date - 2020-10-23T08:54:39+05:30 IST

ఆంధ్ర, తెలంగాణ మధ్య ప్రజా రవాణా స్తంభించింది. ఆర్టీసీ బస్సుల్లేక, రైళ్లూ లేక... ప్రైవేటు బస్సులు ఎక్కలేక జనం నానా తంటాలు పడుతున్నారు.

కస్సు‘బస్సులు’!

ప్రయాణికులతో రెండు రాష్ట్రాల పరాచికాలు..

ఆర్టీసీ బస్సులు నడపడంపై పీటముడి

లక్ష కిలోమీటర్లు తగ్గించుకునేందుకు ఏపీ ఓకే..

సర్వీసులు పెంచేందుకు తెలంగాణ నో

సీఎంలు తలచుకుంటే సమస్య పరిష్కారం.. కానీ... పట్టనట్లుగానే జగన్‌, కేసీఆర్‌

పండగ సమయంలోనూ అవే పంతాలు..

సొంతూళ్లకు వెళ్లేందుకు జనం కష్టాలు


(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

ఆంధ్ర, తెలంగాణ మధ్య ప్రజా రవాణా స్తంభించింది. ఆర్టీసీ బస్సుల్లేక, రైళ్లూ లేక... ప్రైవేటు బస్సులు ఎక్కలేక జనం నానా తంటాలు పడుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు బాగానే తిరిగాయి. కానీ, లాక్‌డౌన్‌ తర్వాత తెలంగాణ సర్కారు ‘అంతర్రాష్ట్ర ఒప్పందం’ కుదిరాకే బస్సులు తిరగాలని తేల్చి చెప్పింది.  ఏపీఎ్‌సఆర్‌టీసీ బస్సులు తెలంగాణలో 2.60 లక్షల కి.మీ.,తిరుగుతున్నాయి. టీఎ్‌సఆర్‌టీసీబస్సులు 1.60 లక్షల కి.మీ. తిరుగుతున్నాయి. ఇంటర్‌ స్టేట్‌ అగ్రిమెంట్‌ చేసుకుని ఏపీ సర్వీసులు లక్ష కిలోమీటర్లను తగ్గించుకోవాలని టీఎ్‌సఆర్‌టీసీ అధికారులు డిమాండ్‌ చేశారు.


ఏపీ అధికారులు ఇందుకు అంగీకరించారు. ‘సరే... మేం 50 వేలకిలోమీటర్లు తగ్గించుకుంటాం. ఆ మేరకు మీరు పెంచుకోండి’ అని  సూచించారు. అయుతే, తాము ఎక్కువ కిలోమీటర్లు నడిపే పరిస్థితి లేదని, ఏపీ మాత్రం లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవాల్సిందేనని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. దీంతో అనేక తర్జన భర్జనల తర్వాత లక్ష కిలోమీటర్లు తగ్గించుకునేందుకు ఏపీ అంగీకరించింది. ఏపీలో దాదాపు ప్రతి డిపో నుంచి హైదరాబాద్‌కు బస్సులు నడుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాలకు కూడా సర్వీసులు ఉన్నాయి. మొత్తంగా 1009 ఏపీ బస్సులు తెలంగాణకు నడుస్తున్నాయి. లక్ష కిలోమీటర్లు తగ్గించుకుంటే 400 బస్సులను తగ్గించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు తప్పవు. ఈ క్రమంలో ‘రూట్ల’ లెక్క బయటికి వచ్చింది. ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణలో 71 రూట్లకు బస్సులు నడుపుతోంది. తెలంగాణ ఆర్టీసీ ఏపీలోని 21 రూట్లకు సర్వీసులు నడుపుతోంది. లక్ష కిలోమీటర్లు తగ్గించుకునేందుకు అంగీకరించిన ఏపీ అధికారులు... ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రూట్లను పెంచుకోవాలని తెలంగాణను కోరారు. చెరి సమానంగా ఆయా రూట్లలో బస్సులు నడుపుదామని ప్రతిపాదించారు. తెలంగాణ అధికారులు అంగీకరించలేదు. 


ముందుకు పడని అడుగు...

అధికారుల స్థాయిలో విషయం తేలకపోతే, మంత్రులు రంగంలోకి దిగి మాట్లాడుకోవాలి. కానీ, రెండు రాష్ట్రాల రవాణా మంత్రుల స్థాయిలో ఇప్పటిదాకా భేటీ జరగలేదు. పైగా పరస్పరం రెచ్చగొట్టే ప్రకటనలు చేసుకుంటున్నారు.  ఏపీలో ఈ అంశంపై పేర్ని నానితోపాటు ఉమ్మడి రాష్ట్రంలో రవాణా మంత్రిగా పనిచేసిన సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణతో కలిపి ఒక కమిటీ వేశారు. అయితే... ఈ ఇద్దరు మంత్రులు దీనిపై కలిసి కూర్చుని చర్చించిన దాఖలాలు లేవు.


రెండు రాష్ట్ర ప్రభుత్వాల పంతాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే... తొలుత సరిహద్దుల్లోని జగ్గయ్యపేట వరకు ఏపీఎ్‌సఆర్టీసీ బస్సులో వెళ్లి, అక్కడి నుంచి ఎలాగోలా సరిహద్దు దాటి, అక్కడ తెలంగాణ బస్సు ఎక్కాల్సి వస్తోంది. అటు... హైదరాబాద్‌ నుంచి కర్నూలు వైపు వెళ్లాలంటే, అలంపూర్‌ క్రాస్‌ రోడ్స్‌ వరకు తెలంగాణ బస్సులో వెళ్లి, ఆపై సరిహద్దు దాటి, ఏపీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న వారు, గత్యంతరం లేని వారు చార్జీ ఎక్కువైనా ప్రైవేటు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. జనం ఇన్ని కష్టాలు పడుతున్నా... ప్రభుత్వాలు మాత్రం పంతం వీడటంలేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తే.. ఆర్టీసీలను దివాలా తీయించి, ప్రైవేటు ఆపరేటర్లకు మేలు చేయాలనే ఆలోచన ఉన్నట్లుందని విపక్షాలు, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.


లాక్‌డౌన్‌ ముగిసిపోయింది. దసరా పండగ వస్తోంది. కానీ... హైదరాబాద్‌లో స్థిరపడిన వారు ఏపీలోని సొంతూరికి రావాలంటే కారు ఉండాల్సిందే. లేదా... ప్రైవేటు బస్సు ఎక్కి జేబులు ఖాళీ చేసుకోవాలి. పండగ సంగతి పక్కనపెట్టండి... అత్యవసరంగా హైదరాబాద్‌కు రాకపోకలు సాగించాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. అంతర్రాష్ట్ర సర్వీసులు నడపడంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొరవడిన ఏకాభిప్రాయం... రెండు రాష్ట్రాల ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. అధికారుల స్థాయిలో పని కావడంలేదు. మంత్రులు కూర్చున్నా అవుతుందో లేదో తెలియదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకమాట అనుకుంటే తప్ప బస్సులు కదిలే పరిస్థితి కనిపించడంలేదు.


కేసీఆర్‌ జోక్యం చేసుకోవాలి: పేర్ని

మచిలీపట్నం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): పండుగల వేళ తెలుగు ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా తెలంగాణ ఆర్టీసీ అధికారుల తీరు ఉందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. ఈ అంశాన్ని తెలంగాణ సీఎంకేసీఆర్‌ సమర్థించరని తన నమ్మకమన్నారు. గురువారం ఆయన మచిలీపట్నంలో మాట్లాడుతూ పండుగల వేళ బస్సులు తిరగకుంటే ప్రైవేటు ట్రావెల్స్‌ అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయన్నారు. వీలైనంత తొందరగా రెండు రాష్ర్టాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు కేసీఆర్‌ సముచిత నిర్ణయం తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-10-23T08:54:39+05:30 IST