ఆర్టీసీ బస్సుల్లో 12 ఏళ్లలోపు వారికి ఉచితం

ABN , First Publish Date - 2022-01-02T07:49:50+05:30 IST

ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచే ప్రయత్నాల్లో భాగంగా 12 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు టీఎ్‌సఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు.

ఆర్టీసీ బస్సుల్లో 12 ఏళ్లలోపు వారికి ఉచితం

  • తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే పిల్లలకు..
  •  ఆక్యుపెన్సీ పెంచుకునేందుకు సంస్థ ప్రయత్నం
  • సంక్రాంతి ప్రత్యేక బస్సులకూ సాధారణ చార్జీలే.. 
  • త్వరలో రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిల చెల్లింపు 
  • టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ వెల్లడి 
  • తార్నాక ఆస్పత్రిలో సూపర్‌ స్పెషాలిటీ సేవలు
  • అన్ని రకాల వైద్యసేవలకు ఏర్పాట్లు: సజ్జనార్‌


హైదరాబాద్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచే ప్రయత్నాల్లో భాగంగా 12 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు టీఎ్‌సఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణం చేసే పిల్లలకు ఈ అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా తల్లిదండ్రులు బస్సుల్లో ప్రయాణిస్తారని, ఈ రూపంలో సంస్థకు ఆదాయం వస్తుందని అన్నారు. శనివారం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాజిరెడ్డి మాట్లాడారు. ఆర్టీసీలో ఆర్ధిక సమస్యలను క్రమక్రమంగా పరిష్కరించుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే అంశంపై దృష్టి పెట్టామన్నారు. పండుగల వేళ రద్దీ సమయాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సుల్లో అదనంగా చార్జీలు వసూలు చేసే విధానానికి స్వస్తి పలికామని, దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని గుర్తు చేశారు. దీంతో ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. సంక్రాంతి పడుంగ సందర్భంగా కూడా ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలను మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ సాధించడం ద్వారా చార్జీల ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇక రిటైరయిన ఉద్యోగులకు బకాయిలను తక్షణమే చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చైర్మన్‌ తెలిపారు. విధి నిర్వహణలో మృత్యువాత పడిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాల విషయంపై ప్రభుత్వ అనుమతి తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. గడిచిన నాలుగు నెలలుగా ఆర్టీసీ ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. ఇదే తీరులో పని చేస్తూ ఉద్యోగులు పునరంకింతం కావాలని పిలుపునిచ్చారు. 


ఎంజీబీఎ్‌సలో వృద్ధులు, వికలాంగుల కోసం ఉచిత బగ్గీ

మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ ప్రధాన ద్వారం నుంచి ఆయా ఫ్లాట్‌ఫారాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడుతున్న వికలాంగులు, వృద్ధుల కోసం ఆర్టీసీ ఉచితంగా బ్యాటరీతో కూడిన బగ్గీని ఏర్పాటు చేసింది. శనివారం నూతన సంవత్సరం సందర్భంగా సంస్థ ఎండీ సజ్జనార్‌ దీనిని ప్రారంభించారు. అంతకుముందు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మునిశేఖర్‌తో కలిసి ఎంజీబీఎ్‌సలో ఆయన కేక్‌ కట్‌ చేశారు. అనంతరం తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిని సజ్జనార్‌ సందర్శించారు. ఈ ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలతో స్వయం పోషక సంస్థగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఇతర ఆస్పత్రులను ఆశ్రయించే అవసరం లేకుండా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకూ వైద్య నిపుణులను, వైద్య సాంకేతిక సహాయకులను నియమించనున్నట్టు తెలిపారు. అవసరమైతే ఆర్టీసీ ఉద్యోగులతోపాటు ఇతరులకు కూడా సేవలందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ యాదగిరి, మెడికల్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ వీఎస్‌ రెడ్డి, సీఎంఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-02T07:49:50+05:30 IST