దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కరోనా సహాయ కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-04-08T00:56:35+05:30 IST

దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కరోనా సహాయ కార్యక్రమాలు చేపట్టిందని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత కార్యావాహా కాచం రమేశ్ తెలిపారు.

దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కరోనా సహాయ కార్యక్రమాలు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కరోనా సహాయ కార్యక్రమాలు చేపట్టిందని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత కార్యావాహా కాచం రమేశ్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలకు ఆర్ఎస్ఎస్ సహకారం అందిస్తోందన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు దేశవ్యాప్తంగా బాధితులకు అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత కార్యావాహా  కాచం రమేశ్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా విపత్తు, ప్రమాదం సంభవించినప్పుడు బాధితులకు సహాయం అందించడానికి స్వయంసేవకులు సహజంగానే ముందుకు వస్తారన్నారు. స్వయంసేవకుల ఈ స్వచ్ఛంద సేవాభావం చూసి అనేకమంది ప్రముఖులు ఆర్‌ఎస్ఎస్‌ను రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్ అని అంటూ ఉంటారని కాచం రమేశ్ గుర్తుచేశారు.


కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్ మూలంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి తగిన సహాయం అందించడానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్వయంసేవకులు పనిచేస్తున్నారని ఆయన తెలియజేశారు. దేశవ్యాప్తంగా 26 వేల ప్రాంతాల్లో 2 లక్షల మంది స్వయంసేవకులు 25 లక్షల కుటుంబాలకు సహాయం అందజేశారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 369 ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమాల ద్వారా 2678 మంది స్వయసేవకులు 25 వేల కుటుంబాలను ఆదుకున్నారని కాచం రమేశ్ చెప్పారు.


ఆర్‌ఎస్‌ఎస్ సేవావిభాగమైన సేవాభారతితోపాటు అనేక ఇతర సంస్థలతో కూడా కలిసి స్వయంసేవకులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పేదలకు భోజన సదుపాయం కల్పించడం, ఉప్పు, నూనె, పప్పు, మొదలైన నిత్యావసర వస్తువులతో కూడిన కిరాణాకిట్‌ను ఇంటింటికి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు స్వయంసేవకులు చేస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా ప్రజలకు తెలియజేస్తున్నారని కాచం రమేశ్ వెల్లడించారు. రేషన్ షాపులు మొదలైన రద్దీ ప్రదేశాల్లో సామాజిక దూరాన్ని పాటించేవిధంగా చూడటం, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు సహకరించడం వంటివి కూడా స్వయంసేవకులు చేస్తున్నారని కాచం రమేశ్ తెలిపారు.


Updated Date - 2020-04-08T00:56:35+05:30 IST