పట్టు బిగిస్తోంది

ABN , First Publish Date - 2021-09-05T08:26:27+05:30 IST

నాలుగో టెస్టులో టీమిండియా తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తోంది. మూడో రోజు శనివారం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తి ఆధిపత్యం చూపింది.

పట్టు  బిగిస్తోంది

రోహిత్‌ శర్మ శతకం

171 పరుగుల ఆధిక్యంలో భారత్‌

 రెండో ఇన్నింగ్స్‌ 270/3

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు

లండన్‌: నాలుగో టెస్టులో టీమిండియా తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తోంది. మూడో రోజు శనివారం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తి ఆధిపత్యం చూపింది. అద్భుత డిఫెన్స్‌ను కనబరిచిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (256 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 127) విదేశీ గడ్డపై తొలి శతకం సాధించాడు. అలాగే చటేశ్వర్‌ పుజార (127 బంతుల్లో 9 ఫోర్లతో 61) అండతో రెండో వికెట్‌కు 153 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో భారత్‌కు 171 పరుగుల ఆధిక్యం లభించింది. క్రీజులో కోహ్లీ (22 బ్యాటింగ్‌), జడేజా (9 బ్యాటింగ్‌) ఉండగా.. వెలుతురు లేమితో మ్యాచ్‌ను అర్ధగంట ముందే ముగించారు. దీంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం 92 ఓవర్లలో 3 వికెట్లకు 270 పరుగులు చేసింది. 


శుభారంభం:

మూడో రోజు ఆటలో భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ శుభారంభం అందించారు. వికెట్‌ కాపాడుకునే క్రమంలో జాగ్రత్తగా ఆడడంతో ఈ సెషన్‌లో 65 పరుగులే వచ్చాయి. పేసర్ల త్రయం అండర్సన్‌, వోక్స్‌, రాబిన్సన్‌ల ప్రమాదకర బంతులను వదిలేస్తూ నెమ్మదిగా పరుగులు సాధించారు. వీలు చిక్కినప్పుడల్లా కవర్‌ డ్రైవ్స్‌తో ఫోర్లు సాధిస్తూ జట్టును ఆధిక్యం వైపు తీసుకెళ్లారు. అయితే చక్కగా కుదురుకున్న దశలో.. అండర్సన్‌ ఫుల్‌ లెంగ్త్‌ డెలివరీకి రాహుల్‌ క్యాచ్‌ అవుటయ్యాడు. దీనిపై రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే తొలి వికెట్‌కు 83 పరుగులు వచ్చాయి. తర్వాత ఓవర్‌ పిచ్‌ బంతులతో అండర్సన్‌ ఇబ్బందిపెట్టినా రోహిత్‌ ఫోర్‌తో సమాధానమిచ్చాడు. అటు పుజార కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో 9 పరుగుల ఆధిక్యంతో జట్టు లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది.


రోహిత్‌ సెంచరీ:

రెండో సెషన్‌లో భారత్‌ ఆధిపత్యం కనిపించింది. రోహిత్‌, పుజార ఇంగ్లండ్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. రోహిత్‌ నెమ్మదిగానే ఆడినా పుజార మాత్రం కట్‌ షాట్స్‌, ర్యాంప్‌ షాట్లతో అలరించాడు. తొలి ఫిఫ్టీని 145 బంతుల్లో సాధించిన రోహిత్‌ ఆ తర్వాత ఒక్కసారిగా గేరు మార్చాడు. దీంతో మరో 60 బంతుల్లోనే మిగతా 50 పరుగులు పూర్తి చేసి కెరీర్‌లో ఎనిమిదో శతకాన్ని అందుకున్నాడు. సూపర్‌ సిక్సర్‌తో అతడు ఈ ఫీట్‌ సాధించాడు. టీ బ్రేక్‌ సమయానికి జట్టుకు 100 పరుగుల ఆధిక్యం లభించింది.


ఒకే ఓవర్‌లో ఇద్దరూ..:

ఆఖరి సెషన్‌లో పుజార కూడా అర్ధసెంచరీ చేశాడు. అయితే రెండో కొత్త బంతి భారత్‌ను గట్టిగానే దెబ్బతీసింది. 81వ ఓవర్‌లో రోహిత్‌, పుజార ఇద్దరినీ రాబిన్సన్‌ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో తీవ్ర ఒత్తిడిలో కోహ్లీ, జడేజా బ్యాటింగ్‌కు దిగారు. బౌలర్లు కోహ్లీని లక్ష్యంగా చేసుకున్నా చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ క్రీజులో కుదురుకున్నాడు. ఈక్రమంలో 92 ఓవర్ల తర్వాత వెలుతురు మందగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 191

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 290

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) వోక్స్‌ (బి) రాబిన్సన్‌ 127; రాహుల్‌ (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్‌ 46; పుజార (సి) మొయిన్‌ అలీ (బి) రాబిన్సన్‌ 61; కోహ్లీ (బ్యాటింగ్‌) 22; జడేజా (బ్యాటింగ్‌) 9; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 92 ఓవర్లలో 270/3. వికెట్ల పతనం: 1-83, 2-236, 3-237.  బౌలింగ్‌: అండర్సన్‌ 23-8-49-1; రాబిన్సన్‌ 21-4-67-2; వోక్స్‌ 19-5-43-0; ఒవర్టన్‌ 10-0-38-0; మొయిన్‌ అలీ 15-0-63-0; రూట్‌ 4-1-7-0. 

Updated Date - 2021-09-05T08:26:27+05:30 IST