వచ్చేస్తోంది ధనాధన్‌

ABN , First Publish Date - 2021-03-30T06:42:31+05:30 IST

ఐపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత క్రికెటర్లు ఆయా ఫ్రాంచైజీలతో చేరిపోతున్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, అతడి సోదరుడు క్రునాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ సోమవారం ముంబై జట్టుతో కలిశారు...

వచ్చేస్తోంది ధనాధన్‌

  • ఐపీఎల్‌ 10 రోజుల్లో


మరో పది రోజుల్లో వేసవి వినోదానికి తెరలేవనుంది..వచ్చేనెల తొమ్మిదినుంచి జరిగే ఐపీఎల్‌కు జట్లన్నీ సన్నాహాలు ప్రారంభించాయి.. ముంబైలోని తమకు కేటాయించిన వివిధ హోటళ్లకు జట్లు ఇప్పటికే చేరుకున్నాయి.. ఇంగ్లండ్‌తో సిరీస్‌ ముగియడంతో టీమిండియా క్రికెటర్లు ఆయా జట్లతో కలుస్తున్నారు..కరోనాతో గత ఐపీఎల్‌ యూఏఈకి తరలగా ఈసారి స్వదేశంలో జరుగుతుండడంతో ఎప్పుడెప్పుడు మెగా టోర్నీకి తెరలేస్తుందా అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు.


ముంబై: ఐపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత క్రికెటర్లు ఆయా ఫ్రాంచైజీలతో చేరిపోతున్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, అతడి సోదరుడు క్రునాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ సోమవారం ముంబై జట్టుతో కలిశారు. పుణెలో ఇంగ్లండ్‌తో చివరి వన్డే ముగిసిన అనంతరం.. సోమవారం వారు ముంబై జట్టులో చేరిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. టీమిండియాకు ఆడాలన్నది నా కల. అది నెరవేరింది. ఇప్పుడిక నా ముంబై ఇండియన్స్‌ జట్టులోకి వచ్చేశా’ అని సూర్యకుమార్‌ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఏప్రిల్‌ 9న చెన్నైలో జరిగే ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. 


ఢిల్లీ కెప్టెన్‌పై త్వరలో నిర్ణయం

తమ జట్టు కెప్టెన్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ చెప్పాడు. రికీ ఆస్ట్రేలియా నుంచి సోమవారం వచ్చాడు. అలాగే అశ్విన్‌, ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌, పేసర్‌ క్రిస్‌ ఓక్స్‌ జట్టు బస చేస్తున్న హోటల్‌లో సమావేశమయ్యారు. ఢిల్లీ సారథి శ్రేయాస్‌ అయ్యర్‌ భుజం గాయంతో ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. జట్టుతో కలిసిన సందర్భంగా పాంటింగ్‌ ‘సురక్షితంగా చేరుకున్నా. ఐపీఎల్‌ సన్నాహకాలను ప్రారంభించాలి’ అని ట్వీట్‌ చేశాడు. పాంటింగ్‌, డీసీ ప్రమోటర్లు సంయుక్తంగా చర్చించి కెప్టెన్‌ విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రిషభ్‌ పంత్‌ సారథ్య రేసులో ముందున్నట్టు సమాచారం. అయితే రహానె, స్టీవ్‌ స్మిత్‌, అశ్విన్‌ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకొనే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. 


Updated Date - 2021-03-30T06:42:31+05:30 IST