Abn logo
Mar 5 2021 @ 04:21AM

జంగిల్‌ రాజ్‌!

ఏ-బీ-సీ-డీ పాలసీతో జగన్‌ పాలన

దాడులు, బాదుడు, అవినీతి, దోపిడీ!

మున్సిపోల్స్‌లో టీడీపీ ఓడితే

వైసీపీకి ఊడిగం చేయాల్సిందే

బాధ్యత గుర్తుచేయడానికొచ్చా

మరోసారి నమ్మి మోసపోకండి

మున్సిపోల్స్‌ లెక్కింపు పగలే

ఈసారి చూసుకుందాం

ఎన్నికలవగానే పన్ను బాదుడు

ఓట్ల కోసం తిరిగిన చెల్లెలిని రోడ్ల మీద వదిలేశారు

రోజులన్నీ ఇలాగే ఉండవు

ప్రతి ఒక్కరికీ వడ్డీతో చెల్లిస్తాం

కర్నూలు రోడ్‌షోలో బాబు


రాష్ట్రంలో ఏ-బీ-సీ-డీ అనే కొత్త పాలసీతో జగన్‌ పాలన చేస్తున్నారు. ఏ అంటే అట్రాసిటీ, అటాక్‌ చేయడం, బీ అంటే బాదుడు, సీ అంటే కరప్షన్‌, డీ అంటే దోపిడీ.

  చంద్రబాబు


కర్నూలు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌లా జగన్‌ పాలిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏ-బీ-సీ-డీ అనే కొత్త పాలసీతో పాలన చేస్తున్నారని  ధ్వజమెత్తారు. రూ.లక్ష కోట్ల విలువైన అమరావతిని సర్వనాశనం చేయడమేగాక విశాఖ ఉక్కు కర్మాగారాన్నీ ముంచేశారని మండిపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం కర్నూలులో రోడ్‌షో నిర్వహించారు. కింగ్‌ మార్కెట్‌ మీదుగా పర్యటించిన ఆయన చెన్నమ్మ సర్కిల్‌ వద్ద ముగింపు ప్రసంగం చేశారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ప్రజలు వైసీపీకి ఊడిగం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘మీ బాధ్యత గుర్తు చేయడానికొచ్చా. శిరసు వంచి నమస్కరిస్తున్నా, మరోసారి నమ్మి మోసపోకండి. అంబేడ్కర్‌ రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగం తెస్తున్నారు. ఓట్ల కోసం రోడ్లపై తిప్పిన చెల్లెల్నే రోడ్డు మీద వదిలేసిన జగన్‌.. ప్రజలకేం చేస్తారు’ అని ప్రశ్నించారు.


పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి కౌంటింగ్‌లో టీడీపీ గెలిచిన స్థానాలను వైసీపీ గెలుపుగా చెప్పుకొంటున్నారని ఎద్దేవాచేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పగటిపూటే ఉంటుందని, చూసుకుందామని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాగల దమ్ముంటే గెలుపంటే ఎలా ఉంటుందో చూపిస్తానని సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. ఇంకా ఏమన్నారంటే.. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే వారసత్వంగా వచ్చే ఆస్తులపై ఏటా 15% పెంపుదలతో ప్రజలపై జగన్‌ పన్నుల భారం మోపబోతున్నారు. నీటి చార్జీల పెంపునకూ రంగం సిద్ధమవుతోంది. ఇంటింటికీ రేషన్‌ వ్యాన్లు అని చెప్పి ఎక్కడో వీధి చివర్లో వాహనాలు ఆపుతున్నారు. రేషన్‌ కోసం వచ్చిన మహిళలను పోకిరీలు వేధిస్తున్నా పట్టించుకోవడం లేదు.


ఏమిటీ ఏకగ్రీవాలు?

చిత్తూరులో బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయని తెలిసి వెళ్తుంటే నన్ను ఎయిర్‌పోర్టులోనే ఆపేశారు. 10 గంటలపాటు కదలకుండా అక్కడే కూర్చున్నాను. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు వచ్చి, ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని హామీ ఇచ్చాకే వెనుదిరిగాను. కానీ 49కిగాను 37 డివిజన్లను బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకుంటే ఆ అధికారులు ఏం చేశారో చెప్పాలి. చిత్తూరు జిల్లాలో నాకు పరపతి లేదని అంటున్న వాళ్లకు త్వరలోనే నా పరపతేంటో చూపిస్తా. ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం. అన్నీ మైండ్‌లో గుర్తున్నాయి. 2014 ఎన్నికల ముందు ఓట్ల కోసం సొంత చెల్లెలిని రోడ్ల మీద తిప్పిన జగన్‌.. 2019 వచ్చే సరికి ఆమెను అదే రోడ్లపై వదిలేశారు. చివరకు ఆమె తెలంగాణలో రోడ్లపై తిరుగుతోంది. తన బాబాయి వివేకానందరెడ్డిది హత్యేనని వాదించిన జగన్‌ సీఎం అయ్యాక పట్టించుకోవడంలేదు. సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదనడం వెనుక మర్మమేంటి?


పిట్టకథల మంత్రి.. పేకాట మంత్రి..

జిల్లాలో పిట్ట కథలు చెప్పుకొనే ఫైనాన్స్‌ మంత్రితో పాటు బెంజ్‌-పేకాట మంత్రి ఉన్నారు. ఆ మంత్రి నా హయాంలో జడ్పీటీసీగా పనిచేశారు. డోన్‌లో అయితే ఏకంగా 32 వార్డులకు 25 ఏకగ్రీవాలని ఆర్థిక మంత్రి ప్రకటించుకున్నారు. ఆ నియోజకవర్గంలో ఏం పీకారని ఏకగ్రీవాలుగా ఓట్లు వచ్చాయో చెప్పాలి. బుల్లెట్‌ దిగిందా లేదా అంటూ చాలామంది పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. వారందరినీ బజార్లో నిలబెడతాం. పుంగనూరులోనూ ఓ పనికిమాలిన మంత్రి అన్ని వార్డులూ ఏకగ్రీవం చేసుకున్నామని మాట్లాడుతున్నారు. అధికారంలో ఉండగా నేనూ ఇలాగే ప్రవర్తించి ఉంటే ఈ మంత్రులంతా తిరగ్గలిగేవారా? ఈ సీఎం పదవి నాకేం కొత్త కాదు. అలిపిరిలో బాంబు దాడులు చేస్తేనే భయపడని నేను..నా అనుభవమంత వయసు లేని జగన్‌, మంత్రులు బెదిరిస్తే భయపడతానా?


పోలీసు వ్యవస్థ నిర్వీర్యం..

పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. పోలీసుల్లో కొందరు వ్యక్తులు మంచి వాళ్లే ఉన్నా.. ఎక్కువ మంది పదవుల కోసం పాకులాడుతున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి పోలీసులు వెళ్లకూడదని నిబంధనలున్నా.. వెళ్తున్నారు. ఏజెంట్లను భయపెట్టి బయటకు పంపుతూ, అధికార పార్టీ అభ్యర్థుల విజయానికి సహకరిస్తున్నారు. ఇళ్లలో నిద్రపోతున్న కార్యకర్తలపైనా అక్రమ కేసులు పెట్టి ఇరికిస్తున్న పోలీసులను గుర్తు పెట్టుకుంటున్నాం. ప్రశ్నిస్తే హత్యా ప్రయత్నం, రేప్‌ కేసులు.. ఇలా ఎన్నో పెడుతున్నారు. రాబోయేది నూటికి నూరు శాతం టీడీపీ ప్రభుత్వమే. ఒకటికి నాలుగు రెట్లు సమాధానం చెబుతాం. అరెస్టులు చేస్తే అందరం కలిసే జైలుకు వెళ్దాం. మహా అయితే ఏమవుతుంది.. మీరు కూడా ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు అవుతారు. అప్పుడైనా ఈ పోలీసులు ఆనందపడతారేమో!


కార్యకర్తలకు పూర్తి అండ..

రోడ్‌షో అనంతరం మౌర్య ఇన్‌ హోటల్లో కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వారికి పూర్తి అండగా ఉంటానని, భయపడాల్సిన పనిలేదన్నారు. పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని, కలిసికట్టుగా పనిచేస్తే విజయం సొంతం చేసుకోవచ్చన్నారు. కర్నూలు కార్పొరేషన్లో టీడీపీ జెండా ఎగురుతుందని.. గెలిచిన కార్పొరేటర్లను అభినందించడానికి మళ్లీ కర్నూలు వస్తానని చెప్పి ఆయన హైదరాబాద్‌ బయల్దేరారు.

సీఎం సొంత బ్రాండ్లు

మద్యం కంపెనీలను 20 ఏళ్లపాటు అనుకూల సంస్థలకు 40-50 వేల కోట్లకు తాకట్టు పెట్టారు. దీనిపై జగన్‌ సమాధానం చెప్పాలి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక సీఎం సొంత బ్రాండ్లతో మద్యం తయారుచేస్తున్నారు. నాసిరకం మద్యం తయారుచేస్తున్న జగన్‌పైనే తొలుత పోలీసులు కేసులు నమోదు చేయాలి. అంతేతప్ప నిజాయితీగా వ్యవహరిస్తున్న మా కార్యకర్తలపై కాదు. ఎవరికీ తెలియని ఆ మద్యం బ్రాండ్లు దేశంలో ఎక్కడా లేవు. 

Advertisement
Advertisement
Advertisement