రాజధానిలో రోడ్లు ధ్వంసం

ABN , First Publish Date - 2021-07-26T08:17:22+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన చోట.. ఒక ఎంపీ నివాసం ఉండే గ్రామంలో..

రాజధానిలో రోడ్లు ధ్వంసం

  • మోదీ శంకుస్థాపన చేసిన సమీపంలోనే..  
  • ఎన్‌-10 రోడ్డును తవ్వేసిన దుండగులు
  • లారీలలో మెటీరియల్‌ తరలింపు
  • దళిత జేఏసీ వచ్చేసరికి యంత్రాలతో పరారీ  
  • వైసీపీ నేతల అనుచరుల నిర్వాకమని ఆరోపణ


తుళ్లూరు, జూలై 25: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన చోట.. ఒక ఎంపీ నివాసం ఉండే గ్రామంలో.. నిరంతరం పోలీసుల పహరా ఉన్న ఉద్దండరాయునిపాలెం దగ్గర దుండగులు యథేచ్ఛగా రోడ్లను ధ్వంసం చేస్తున్నారు. జేసీబీలతో రోడ్లను తవ్వేసి లారీలలో కంకర, మెటల్‌ను తరలించుకుపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల అనుచరుల నిర్వాకమిదని రాజధాని దళిత జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెంలో శనివారం అర్ధరాత్రి ఎన్‌-10 రోడ్డును దుండగులు ధ్వంసం చేశారు. రోడ్డును తవ్వి మెటల్‌ను తరలించే దృశ్యాలను కొందరు వీడియో తీసి రాజధాని రైతుల వాట్సప్‌ గ్రూపులో పెట్టారు. ఆదివారం రాజధాని దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌ నేతృత్వంలో సభ్యులు మీడియాతో కలసి తవ్విన ప్రదేశానికి వెళ్లారు. ఆ సమయంలో రోడ్డును తవ్వుతున్న అక్రమార్కులు జేసీబీ, లారీతో పలాయనం చిత్తగించారు. 


ఉద్దండరాయునిపాలెం గ్రామానికి ఆనుకొని 165 అడుగుల వెడల్పుతో ఎన్‌-10 రోడ్డును గత టీడీపీ ప్రభుత్వం కొంత మేర నిర్మాణం చేసింది. దానికి వాడిన కంకరును అక్రమార్కులు తరలిస్తున్నారు. గతంలో దొండపాడు-అనంతవరం మధ్యలో సీడ్‌ రోడ్డును ధ్వంసం చేసి మెటిరీయల్‌ను తరలించుకుపోయారు. అయినా అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. అక్రమార్కులు మెటీరియల్‌ను తరలించటానికి పోలీసులు సహకరిస్తున్నారని దళిత జేఏసీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులను ప్రోత్సహిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. వారి ఆగడాలు సహించేది లేదని, నిఘా పెట్టి తామే అక్రమ తరలింపును అడ్డుకుంటామని హెచ్చరించారు.  అక్రమార్కులను పోలీసులకు పట్టిస్తామని చెప్పారు. మెటీరియల్‌ను దొంగిలించుకుపోయిన వారిని 24 గంటల్లో పట్టుకొని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఒక ఎంపీ ఉండే గ్రామంలో, నిరంతరం పోలీసుల పహరా ఉన్న ఉద్దండరాయునిపాలెంలో రోడ్డు తవ్వి మెటీరియల్‌ను అక్రమంగా తరలిస్తుంటే పోలీసులు నిస్సహాయంగా చూస్తున్నారని విమర్శించారు. 


టీడీపీ హయాంలో నిర్మాణం 

టీడీపీ హయాంలో సచివాలయం, అసెంబ్లీ భవనాలు, హైకోర్టు, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ టవర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎన్‌జీవో, గెజిటెడ్‌ ఉద్యోగుల ఇళ్ల టవర్స్‌ దాదాపుగా పూర్తి కావచ్చాయి. అమరావతిలో జనాభా పెరిగినా ఎటువంటి ట్రాఫిక్‌ సమస్య లేకుండా రోడ్ల నిర్మాణం చేశారు. ఆరు వరుసల సీడ్‌ రోడ్డు నిర్మాణ పనులు 80 శాతం పూర్తి అయ్యాయి. మిగిలిన రోడ్లు వివిధ దశలలో ఆగిపోయాయి. రాజధానిలో ఏ మూల నుంచి ఏ మూలకు వెళ్లటానికైనా 32 రోడ్ల నిర్మాణాలను ప్రారంభించారు. కాగా వైసీపీ సర్కారు రాగానే రాజధాని అమరావతి ‘ఆశ’ ఆవిరైంది. నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిర్మాణ కంపెనీలూ రాజధాని నుంచి తరలిపోయాయి. దాదాపు పది వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు శిథిలాలను తలపిస్తున్నాయి. ఇప్పుడు రోడ్లు అక్రమార్కుల చెరలో చిక్కుకున్నాయి. 

Updated Date - 2021-07-26T08:17:22+05:30 IST