శిథిల రోడ్లు..జనం పాట్లు

ABN , First Publish Date - 2020-10-21T08:40:55+05:30 IST

అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు భారీ వర్షాలకు మరీ అధ్వానంగా తయారయ్యాయి. రహదారులపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి, వాటిలో నీరు నిలిచి వాహనాలు

శిథిల రోడ్లు..జనం పాట్లు

వర్షాలకు మరీ అధ్వానంగా రహదారులు

వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు 

కర్నూలు జిల్లాలో వాగులోకి బస్సు బోల్తా

నలుగురికి గాయాలు..ఆస్పత్రికి తరలింపు

‘తూర్పు’లో ఊడిపోయిన బస్సు చక్రాలు

డ్రైవర్‌ చాకచక్యంతో ప్రయాణికులు క్షేమం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు భారీ వర్షాలకు మరీ అధ్వానంగా తయారయ్యాయి. రహదారులపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి, వాటిలో నీరు నిలిచి వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. పలుచోట్ల గుంతల్లో ఇరుక్కుపోయిన వాహనాల వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె సమీపంలో మంగళవారం ఆర్టీసీ లగ్జరీ బస్సు అదుపుతప్పి పిక్కిలేరు వాగులో బోల్తా పడింది. చిత్తూరు ఒకటో డిపోకు చెందిన ఈ బస్సు కర్నూలు వస్తుండగా అదుపు తప్పి డివైడర్‌ను దాటి పక్కనే ఉన్న పిక్కిలేరు వాగులో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లతో పాటు ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్లను 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి, ప్రయాణికులను కర్నూలుకు తరలించారు. కాగా, డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అంటున్నారు. అలాగే, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో గుంతల్లో కుదుపులకు ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు డిపోకు చెందిన ఈ బస్సు రావులపాలెం మీదుగా సిద్ధాంతం వైపు వెళ్తోంది.


రావులపాలెం మండలం రావులపాడు వంతెన వద్ద డ్రైవర్‌ జాతీయ రహదారిపై గోతులను తప్పించే ప్రయత్నంలో బస్సు వెనుక చక్రాల లింకు విరిగిపోయింది. దీంతో  చక్రాలు ఊడిపోయాయి. బస్సు సుమారు పది అడుగుల మేర రోడ్డును ఈడ్చుకుంటూ వెళ్లి ఆగింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న సుమారు 15మంది ప్రయాణికులు, డ్రైవర్‌, కండక్టర్‌ సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు ఆర్టీసీ కాలంచెల్లిన బస్సులు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు  వాహనాల సామర్థ్యంపై, రోడ్ల నాణ్యతపై దృష్టి సారించి ప్రమాదాలకు తావులేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. 


పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రోడ్డుపై గోతుల వల్ల విరిగిపోయిన లారీ ముందు చక్రం ఇరుసు 


తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వంతెన వద్ద  ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయిన దృశ్యం


Updated Date - 2020-10-21T08:40:55+05:30 IST