రక్తమోడిన రహదారులు

ABN , First Publish Date - 2022-02-01T13:37:19+05:30 IST

రాష్ట్రంలో సోమవారం రోడ్లు రక్తమోడాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. తిరుప్పూర్‌ జిల్లాలో ముగ్గురు, తాంబరం వద్ద ముగ్గురు మృతిచెందారు.

రక్తమోడిన రహదారులు

- రెండు ఘటనల్లో ఆరుగురి దుర్మరణం

- తిరుప్పూర్‌ జిల్లాలో ముగ్గురు

- తాంబరం వద్ద మరో ముగ్గురు


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో సోమవారం రోడ్లు రక్తమోడాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. తిరుప్పూర్‌ జిల్లాలో ముగ్గురు, తాంబరం వద్ద ముగ్గురు మృతిచెందారు. 


తిరుప్పూర్‌ జిల్లాలో...

తిరుప్పూర్‌ జిల్లా తారాపురం-ఒట్టాన్‌సత్రం బైపాస్‌ రోడ్డు సాల్కడై ప్రాంతంలో కారు డివైఢర్‌ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. తేని జిల్లా బోడినాయకునూరుకు చెందిన నాగరాజ్‌ (23), ప్రేమలత (43), కల్యాణసుందరం (61), సుమిత్ర ఆదివారం కోవై వెళ్లి కారులో వెనుదిరిగారు. సోమవారం ఉదయం వేకువ జామున సాల్కడై వద్ద వీరి వాహనం అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో నాగరాజ్‌ (23), ప్రేమలత (43) ఘటనా స్థలంలోనే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన కల్యాణసుందరం, సుమిత్రలను కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ కల్యాణసుందరం కన్నుమూయగా, సుమిత్ర మృత్యువుతో పోరాడుతోంది. 


తాంబరం వద్ద.. 

స్థానిక తాంబరం మన్నివాక్కం ప్రాంతంలో రోడ్డు పక్కన నిలిపిన లారీని వెనుక నుంచి వచ్చిన బైక్‌ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. నాగల్‌కేనికి చెందిన గోపినాథ్‌ (37), తన కుమారుడు గిరి (9), కుమార్తె మోనిక (7)తో కలసి సోమవారం ఉదయం మోటార్‌సైకిల్‌పై కోవలం బీచ్‌కు వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా చెంగల్పట్టు జిల్లా వండలూరు-పూందమల్లి బైపాస్‌ రోడ్డు మన్నివాక్కం ప్రాంతంలో ఆగివున్న లారీని బైక్‌ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు పరారైన లారీ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-02-01T13:37:19+05:30 IST