Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

నాతో స్నేహాన్ని కేసీఆరే వద్దనుకున్నారు

twitter-iconwatsapp-iconfb-icon
నాతో స్నేహాన్ని కేసీఆరే వద్దనుకున్నారు

చానెల్‌పై నిషేధంపై న్యాయ వ్యవస్థ ద్వారానే పోరాటం

ఉమ్మడిలో తెలంగాణకు నష్టం విభజనతో ఏపీకి కష్టం

మాకు రెండు రాష్ట్రాలూ ఒక్కటే

పార్టీలు మారేవారిని ప్రజలే తిరస్కరించాలి

తానా ‘ఓపెన్‌ హార్ట్‌విత్‌ యూ’లో ఆర్కే


తరచూ పార్టీలు మారే రాజకీయ నేతలను నిలదీసే బాధ్యత మీడియాది మాత్రమే కాదని.. ప్రజలు కూడా నిలదీయాలని ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు, విభజనతో ఏపీకి నష్టం జరిగిందన్నది వాస్తవమని చెప్పారు. తానా ఉత్సవాల్లో భాగంగా డెట్రాయిట్‌లో జరిగిన ప్రత్యేక ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ యూ’’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 6-7-2015న ఏబీఎన్‌లో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు...తానా: ప్రస్తుతం చాలా మంది నేతలు పార్టీలు మారిపోతున్నారు. ఇటువంటివి నివారించడానికి ఏం చేయాలి?

ఆర్కే: ఫిరాయింపులను నిరోధించడానికి ఇప్పటికే దేశంలో చట్టం ఉంది. కానీ అది సరిగ్గా అమలు కానప్పుడు ఏం చేస్తాం. దీనికి సంబంధించి ప్రజలకు కూడా బాధ్యత ఉంటుంది. పార్టీలు మారినవారిని తిరస్కరించడం, గుర్తించకపోవడం వంటివి చేయాలి. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. పార్టీ మారి.. మర్నాడే మంత్రయిపోతున్నారు. జనాలు కూడా వాళ్లకే దండలేస్తున్నారు. దీంతో వారి చర్యలకు ఆమోదం లభించినట్లవుతోంది.


తానా: పార్టీలు మారిన వారిని మంత్రిగా గవర్నర్‌ ఎందుకు ప్రమాణం చేయించారు?

ఆర్కే: ఈ ప్రశ్న గవర్నర్‌ను అడగాలి. గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించడం అనేది అభ్యంతరకరమే. అయితే ప్రమాణ స్వీకారం చేసే సమయానికి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తలసాని శ్రీనివాస యాదవ్‌ ప్రకటించారు. కానీ తర్వాత అది ఆమోదం పొందలేదు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం ఆయన ఇప్పటికీ టీడీపీ సభ్యుడే.


తానా: మీరు గవర్నర్‌తో ఓపెన్‌ హార్ట్‌ నిర్వహించవచ్చుకదా?

ఆర్కే: రమ్మనండి. ఆయన వస్తానంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. ఆయన రారు. ఇంతకుముందే అడిగాం.


తానా: ఇటీవల మీడియాలో అవినీతి పెరిగిపోయింది. ఏమంటారు? ఏపీ రాజధాని కోసం ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చాలా కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ అభివృద్ధి కోసం కూడా కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా?

ఆర్కే: మేం ఏదైనా తప్పుచేస్తే మీరు ధైర్యంగా బయటపెట్టవచ్చు. మాదగ్గర పనిచేసేవాళ్లు తప్పుచేసినా స్టింగ్‌ ఆపరేషన్‌ చేసి మేమే బయటపెట్టాం. ఆ దమ్ము ధైర్యం మాకున్నాయి. ఇక రాష్ట్రం కలిసున్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నది వాస్తవం.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందన్నది కూడా వాస్తవం. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ప్రజల మనోభావాలు, నియామకాలు, ప్రమోషన్లలో తమకు అన్యాయం జరిగిందని ఉద్యోగులు భావించడంలో నిజం ఉంది. అందుకే అప్పుడు వారికి మద్దతుగా నిలిచాం.ఇప్పుడు ఏపీకి రాజధాని లేదు గనుక సహాయం చేయాలనే భావనను పెంపొందించడానికి ప్రయత్నించాం. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రెడీమేడ్‌ స్టేట్‌. ఉన్నదాన్ని చెడగొట్టకుండా ఉంటే అది భారతదేశంలో గొప్పరాష్ట్రమవుతుంది. చెడగొట్టుకుంటే చేసేదేమీలేదు. ఏపీ రాజధానికి విరాళాలను సేకరించడం తప్పన్నట్లు కేసీఆర్‌ అండ్‌ కో చేస్తున్న ప్రచారాన్ని నమ్మాల్సిన పనిలేదు. మాకు రెండు రాష్ట్రాలూ ఒక్కటే.


తానా: ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే అన్నారుకదా? మీ హర్ట్‌ ఓపెన్‌ చేస్తే ఏముంటుంది?

ఆర్కే: ఆంధ్రజ్యోతి ఉంటుంది. తర్వాత ఏబీఎన్‌ ఉంటుంది.

నాతో స్నేహాన్ని కేసీఆరే వద్దనుకున్నారు

కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి బాబ్బాబూ అని అడగను.


తానా: జర్నలిజానికి, రాజకీయానికి తేడా ఏంటో చెబుతారా? జర్నలిస్టులు కూడా డబ్బులు తీసుకుని రాజకీయనాయకులతో సమానమైపోయారన్నది మా భావన. ఏమంటారు?

ఆర్కే: జర్నలిజానికి, రాజకీయానికి సంబంధం ఏముందని సమాధానం చెప్పడానికి! నేను తప్ప అందరూ చెడిపోయారు అనుకోవడం సులభం. కానీ అన్ని రంగాల్లోనూ మంచివాళ్లూ ఉన్నారు. చెడ్డ వాళ్లూ ఉన్నారు. మీలాంటి వాళ్లలో చాలామంది డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారు. ఏమనాలి?


తానా: చంద్రబాబు సీఎం అయినా నిధులు లేక ఏమీ చేయలేకపోతున్నారు అనిపిస్తోంది? ఆయనకు మద్దతుగా ఏం చేయగలం?

ఆర్కే: ఆయన సమస్య గురించి మీరెందుకు ఆలోచిస్తారు?? ఆయన తిప్పలు ఆయన పడతారు. ఆయనను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. ఆయనను వదిలేయండి. ఒక వేళ పని చేయకపోతే ఐదేళ్ల తర్వాత జనం దింపేస్తారు కదా!


తానా: జగన్‌తో ఓపెన్‌ హార్ట్‌ ఎప్పుడు చేస్తారు?

ఆర్కే: చాలా కాలంనుంచి పిలుస్తున్నా ఆయన రావడం లేదు. మీరు పిలిపిస్తే రేపే చేస్తా.


తానా: మీడియా చాలా వివక్షతో పనిచేస్తోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ఏం చేయగలం?

ఆర్కే: ఎదుటివాడిని విమర్శించేటప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒకరో ఇద్దరో రాజకీయ నేతలు మీడియా సంస్థలు పెట్టుకున్నంత మాత్రాన మీడియా మొత్తం పాడైపోయిందనుకోవడం సరికాదు. అన్నింటిలోనూ మంచి చెడూఉన్నట్లే మీడియాలోనూ ఉంది. కేసీఆర్‌ నమస్తే తెలంగాణ, జగన్‌ సాక్షితోపాటు ఆంధ్రజ్యోతిని కూడా కలిపి ఒకేలా చూస్తే నేనేం చేయలేను. మొత్తం వ్యవస్థ పాడైపోయింది, ఎవరైనా ఏదైనా చేయొచ్చుకదా అని మీరంటున్నారు.... మీరే జనాలను చైతన్యం చేయడానికి ప్రయత్నించవచ్చుకదా. దేశపౌరులుగా మీకా బాధ్యత లేదా?


తానా: రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఆదాయాన్ని కనీసం రెండు రాష్ట్రాలకుసమానంగా పంచాలి కదా? అలా ఎందుకు జరగలేదు?

ఆర్కే: ఎవరు అడిగారు? ‘రాష్ట్ర విభజన తప్పదు మీకు ఏం కావాలో చెప్పండి’ అని కేంద్రం అడిగినప్పుడు వినకుండా సమైక్యమంటూ ఉద్యమాలు చేశారు. దీంతో వాళ్లకు నచ్చినట్లు చేశారు. ఒకవేళ అడిగి ఉంటే కొన్నాళ్లపాటైనా ఇచ్చేవారేమో.


తానా: మీ ఆత్మస్థైర్యానికి కారణమేమిటి?

ఆర్కే: నాకు పెద్దగా ఆస్తులు లేవు. అందుకే అలా ఉండగలుగుతున్నానేమో! ఎందుకంటే ఆస్తులుంటే మళ్లీ భయం వచ్చేస్తుంది.


తానా: మీడియాలో కూడా గ్రూపులుగా ఎందుకువస్తున్నాయి?

ఆర్కే: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నన్ని చానళ్లు ఎక్కడా ఉండవు. ఇది మంచికొచ్చిందా చెడుకొచ్చిందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.


తానా: కేసీఆర్‌తో మీకు ఇప్పటికీ స్నేహం ఉందా? ఏబీఎన్‌పై నిషేధంపై ఏం చర్యలు తీసుకున్నారు?

ఆర్కే: నాతో స్నేహాన్ని కేసీఆరే వద్దనుకున్నారు. ఇక ఏబీఎన్‌పై నిషేధం విషయంలో న్యాయవ్యవస్థ ద్వారా పోరాడుతున్నాం. ప్రస్తుతం ఆ విషయం సుప్రీం కోర్టులో ఉంది. కోర్టుదే తుది నిర్ణయం. అంతేకానీ నేను కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి బాబ్బాబూ అని మాత్రం అడగను.


తానా: కేసీఆర్‌ను ఎక్స్‌పోజ్‌ చేస్తున్నందుకు మీకేమైనా బెదిరింపులు వచ్చాయా?

ఆర్కే: ఇప్పటికే తెలంగాణ ద్రోహి అనే టైటిల్‌ ఇచ్చారుకదా. అలా ఏదో ఒకటి నాలుగు రోజులు అనుకుంటారు అనుకోనివ్వండి.


తానా: తెలంగాణ రాష్ట్రం రావడంలో మీడియా పాత్ర ఏమిటి?

ఆర్కే: కేసీఆర్‌ డౌన్‌ అయినప్పుడు కూడా మీడియా ఉద్యమానికి అండగా నిలిచింది. 2009 ఎన్నికల్లో పది సీట్లే రావడంతో కేసీఆర్‌ చాలా బాధపడ్డారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవినుంచి దిగిపోతానన్నారు. ఆ తర్వాత అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి టీఆర్‌ఎ్‌సను వైండప్‌ చేయడానికి ప్రణాళికలు వేశారు. ఈలోపుగానే ఆయన మరణించడంతో పరిస్థితులు మారాయి. ప్రజలు కోరుకుంటున్నారు, వారిలో భావన బలంగా ఉంది అన్న కారణంతో మీడియా ఉద్యమానికి అండగా నిలిచింది. అప్పటికి కేసీఆర్‌కు సొంత మీడియా కూడా లేదు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.