తెలంగాణ సరిహద్దులో ఆర్కే అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-10-16T20:36:58+05:30 IST

తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ నేత ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను మావోయిస్టు

తెలంగాణ సరిహద్దులో ఆర్కే అంత్యక్రియలు

హైదరాబాద్: తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ నేత ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించనట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్కే అంత్యక్రియలు పూర్తి అయినట్లు చెబుతున్నారు. అంత్యక్రియలకు మావోయిస్టులు భారీగా హాజరైనట్లు సమాచారం. మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా కప్పి మావోయిస్టులు నివాళులు అర్పించారు.


శుక్రవారం మధ్యాహ్నం ఆర్కే మరణంపై మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కిడ్నీల సమస్యతో ఈనెల 14న ఆర్కే మరణించారని మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. పార్టీ శ్రేణుల సమక్షంలో అంత్యక్రియలు కూడా పూర్తిచేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. కామ్రేడ్ అమరత్వం పార్టీకి తీరని లోటని మావోయిస్ట్ పార్టీ పేర్కొంది. ఆర్కే కుమారుడు మున్నా 2016లో ఏఓబీ పరిధిలోని రామ్‌గూడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆర్కే భార్య శిరీష ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో ఉంటున్నారు. ఓ కేసులో అరెస్ట్‌ అయిన తర్వాత ఆమె బెయిలుపై విడుదలయి బహిరంగ జీవితాన్ని గడుపుతున్నారు.

Updated Date - 2021-10-16T20:36:58+05:30 IST