కరోనా ఎఫెక్ట్: అమెరికాలో టెకీలు విలవిల!

ABN , First Publish Date - 2020-04-03T00:46:16+05:30 IST

అమెరికాలో కరోనా మహమ్మారి విళయతాండవం ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదవడం గమనార్హం. కరోనా ప్రభావం

కరోనా ఎఫెక్ట్: అమెరికాలో టెకీలు విలవిల!

వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి విళయతాండవం ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదవడం గమనార్హం. ఇక్కడ రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం కనిపించడం లేదు. ఈ ప్రభావం అమెరికాలో పనిచేస్తున్న టెకీలపై ఎక్కువగా పడుతోంది. వివిధ టెక్నాలజీ కంపెనీలలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలలో సింహభాగం భారతీయులే ఉన్నారు. ఇప్పుడు వీరి పరిస్థితి సందిగ్దంలో పడింది. ముఖ్యంగా రవాణా, ట్రావెలింగ్ రంగాలు ప్రపంచవ్యాప్తంగా స్తంభించడంతో ఈ రంగాలకు చెందిన కంపెనీలు తమ ప్రాజెక్టుల నుంచి ఉద్యోగులను తీసేస్తున్నాయి. దీంతో ఉద్యోగులు వెంటనే మరో ప్రాజెక్టులో చేరలేని పరిస్థితి ఏర్పడింది. టీమ్ లీడ్స్, మేనేజర్స్ పరిస్థితి కొంచెం నిలకడగా ఉన్నప్పటికి.. డెవలపర్స్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని వివిధ టెక్నాలజీ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆవేదన వెల్లగక్కుతున్నారు. 


అమెరికాలో ఉన్న టెకీలే కాకుండా.. భారత్‌లో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలానే ఉన్నట్టు కనపడుతోంది. భారత్‌లోని టెక్ కంపెనీల క్లైంట్లు ఎక్కువగా అమెరికాకు చెందిన వారే కావడం.. వీరంతా కరోనా కారణంగా తమ ప్రాజెక్టులను ముందుకు నడపే స్థితిలో లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. దీంతో భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేయాల్సి వస్తోంది. భారత్‌కు చెందిన అనేక టెక్నాలజీ కంపెనీలు ప్రాజెక్టులు లేకపోయినా ఉద్యోగులను నడుపుకుంటూ వచ్చే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇదిలా ఉండగా.. అమెరికాలో ఆర్థికమాంద్యం తలెత్తితే లక్ష ఉద్యోగాలు పోవడం తథ్యమని నిపుణులు అంచ నా వేస్తున్నారు. దీని ప్రభావం విదేశీ ఉద్యోగులపై ముఖ్యంగా భారతీయులపై  ఎక్కువగా ఉండవచ్చంటున్నారు. అమెరికాలో హెచ్‌1బీ వీసాపై సింహ భాగం భారతీయులే పనిచేస్తుండటమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో హెచ్‌1బీ వీసాపై పనిచేస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-04-03T00:46:16+05:30 IST