Rishi Sunak: కీలక పరిణామం.. రిషికి మద్దతుగా నిలిచిన బ్రిటన్ మాజీ మంత్రి..!

ABN , First Publish Date - 2022-08-21T01:41:13+05:30 IST

బ్రిటన్ ప్రధాని రేసులో వెనుకంజలో ఉన్న రిషి సునాక్‌కు(Rishi Sunak) తాజాగా ఓ కీలక నేత మద్దతు లభించింది.

Rishi Sunak: కీలక పరిణామం.. రిషికి మద్దతుగా నిలిచిన బ్రిటన్ మాజీ మంత్రి..!

ఎన్నారై డెస్క్: బ్రిటన్ ప్రధాని రేసులో వెనుకంజలో ఉన్న రిషి సునాక్‌కు(Rishi Sunak) తాజాగా కన్సర్వేటివ్ పార్టీకి చెందిన ఓ కీలక నేత మద్దతు లభించింది.  బ్రిటన్ ప్రధాని పదవికి రిషియే తగినవారంటూ ఎంపీ, బ్రిటన్ మాజీ మంత్రి మైఖేల్ గోవ్(Michael Gove) శనివారం ప్రకటించారు. రిషి అభ్యర్థిత్వాన్ని సమర్ధిస్తున్నానంటూ విస్ఫష్టమైన ప్రకటన చేశారు. కొద్ది నెలల క్రితమే మైఖేల్‌ను ప్రధాని బోరిస్ జాన్సన్.. మంత్రివర్గం నుంచి తప్పించారు. పాలనలో విఫలమైన బోరిస్ గద్దె దిగాలంటూ మైఖేల్ డిమాండ్ చేయడంతో.. బోరిస్ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్‌కు మైఖేల్ మద్దతు లభించడం కీలక పరిణామమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


ప్రధాని పదవి చేపట్టాల్సిన వ్యక్తిలో ఉండాల్సిన నైపుణ్యాలన్నీ రిషిలో ఉన్నాయని మైఖేల్ గోవ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో రిషి ప్రత్యర్థి, బ్రిటన్ ఫారిన్ సెక్రెటరీ అయిన లిజ్‌ ట్రస్‌పై(Lizz Truss) పలు విమర్శలు చేశారు. పన్నుల్లో కోత విధించాలన్న ఆమె ప్రతిపాదన.. వాస్తవ స్థితిగతులకు తగినది కాదన్నారు. దీన్ని అమలు చేయడమంటే.. వాస్తవం నుంచి సెలవు తీసుకోవడమేనని అభివర్ణించారు. రిషి ప్రజలకు వాస్తవాలు చెబుతున్నారని అన్నారు.  ‘‘తదుపరి ప్రధాని ఎవరన్న విషయంలో చర్చ మొత్తం వాస్తవ స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా జరుగుతోంది. జీవన వ్యయాలు తగ్గించేందుకు పన్నుల్లో కోత, ప్రజలకు నగదు రూపంలో ప్రభుత్వ సాయం పెంచడం మాత్రమే కాదు. ఈ విషయంలో రిషి చేస్తున్న ఆర్థిక ప్రతిపాదనలే సరైనవి. అంతేకాకుండా.. ఇప్పటివరకూ ఆర్థిక అంశాలకు సంబంధించి ఆయన ప్రజలకు వాస్తవాలనే చెప్పారు. అన్నిటికంటే ఇది ముఖ్యం. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే వరకూ పన్నుల్లో కోత విధించడం సరికాదు’’ అని ఆయన అన్నారు. 


2016లో తొలిసారిగా మైఖేల్ గోవ్ ప్రధాని పదవి కోసం ప్రయత్నించారు. అప్పట్లో బోరిస్ జాన్సన్‌కు మద్దతు పలకాల్సిన ఆయన అందరినీ ఆశ్చర్యపరుస్తూ తానే పోటీలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత రేసులో వెనుకబడి చివరకు పోటీ నుంచి తప్పుకొన్నారు. ఇక 2019లో కూడా బోరిస్‌కు ఏకగ్రీవ మద్దతు లభించడంతో ఆయన ప్రధాని పదవిపై ఆశలను వదులుకోవాల్సి వచ్చింది. మరోవైపు.. తనకు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నా కూడా పోటీలో కొనసాగుతానని రిషి ఇటీవలే ప్రకటించారు. 

Updated Date - 2022-08-21T01:41:13+05:30 IST