పంత్‌ ఫటాఫట్‌

ABN , First Publish Date - 2022-07-02T09:56:55+05:30 IST

పొట్టి ఫార్మాట్‌లో ఫామ్‌ లేమితో విమర్శలు ఎదుర్కొన్న రిషభ్‌ పంత్‌ (111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 146) టెస్టు మ్యాచ్‌లో మాత్రం ధనాధన్‌ ఆటతీరును ప్రదర్శించాడు.

పంత్‌ ఫటాఫట్‌

రిషభ్‌ పంత్‌ 146 (111 బంతుల్లో )

బర్మింగ్‌హామ్‌: పొట్టి ఫార్మాట్‌లో ఫామ్‌ లేమితో విమర్శలు ఎదుర్కొన్న రిషభ్‌ పంత్‌ (111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 146) టెస్టు మ్యాచ్‌లో మాత్రం ధనాధన్‌ ఆటతీరును ప్రదర్శించాడు. ఇటీవలి కాలంలో ఇంగ్లండ్‌ అనుసరిస్తున్న దూకుడు తరహాలోనే అతడి ఆట సాగింది. బౌలర్‌ ఎవరైనా బౌండరీలే లక్ష్యంగా పంత్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో 98/5 స్కోరు నుంచి భారత్‌ అద్వితీయంగా కోలుకుంది.


అంతేనా.. జడేజా (83 బ్యాటింగ్‌) తో కలిసి ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 222 పరుగులను అందించాడు. విదేశాల్లో ఈ వికెట్‌కు భారత్‌కిదే అత్యుత్తమం. గతంలోనూ సచిన్‌-అజరుద్దీన్‌ జోడీ ఇన్నే పరుగులు అందించింది. దీంతో ఐదో టెస్టులో తొలి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో 7 వికెట్లకు 338 పరుగులు చేసింది. అండర్సన్‌కు మూడు, పాట్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. క్రీజులో జడ్డూతో కలిసి షమి పరుగులేమీ చేయకుండా ఉన్నాడు.


టాపార్డర్‌ విఫలం:

కొత్త బంతి చక్కగా స్వింగ్‌ కావడంతో పాటు మబ్బులు పట్టిన వాతావరణం కూడా తోడవడంతో భారత టాపార్డర్‌ తెగ ఇబ్బందిపడింది. వెటరన్‌ జేమ్స్‌ అండర్సన్‌ తన పదునైన పేస్‌తో ఓపెనర్లు గిల్‌ (17), పుజార (13)లను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ సిరీ్‌సలో పుజార ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో 31 పరుగులే చేయడం గమనార్హం. ఇక 21వ ఓవర్‌లో వర్షం కురవడంతో రెండు గంటలపాటు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో అంపైర్లు లంచ్‌ బ్రేక్‌నిచ్చారు. 


ఆదుకున్న పంత్‌, జడేజా:

ఫామ్‌లో ఉన్న కేఎస్‌ భరత్‌ను కాదని ఈ మ్యాచ్‌లో విహారి (20)కి అవకాశం ఇవ్వగా అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలం ఒక్క ఫోర్‌ మాత్రమే రాబట్టి రెండో సెషన్‌ ఆరంభంలోనే వెనుదిరిగాడు. అటు కోహ్లీ (11) పేలవ ఫామ్‌ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. మ్యాటీ పాట్స్‌ తన వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చి భారత్‌కు షాక్‌ ఇచ్చాడు. ఇక వచ్చీ రాగానే ఫోర్లతో ఆకట్టుకున్న శ్రేయాస్‌ (15) కూడా స్వల్ప వ్యవధిలోనే వెనుదిరగ్గా భారత్‌ 98/5 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో పంత్‌, జడేజా జోడీ జట్టును ఆదుకుంది.


మబ్బులు తొలిగి కాస్త ఎండ కాయడంతో 33వ ఓవర్‌ నుంచి భారత్‌ పుంజుకుంది. ఇద్దరూ అడపాదడపా ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా పంత్‌ తన సహజశైలిలో బ్యాట్‌ ఝుళిపిస్తూ స్పిన్నర్‌ లీచ్‌ ఓవర్‌లో వరుసగా 4,4,6తో 14 రన్స్‌ రాబట్టాడు. అదే ఊపులో తను హాఫ్‌ సెంచరీ కూడా పూర్తి చేశాడు. ఆరో వికెట్‌కు అజేయంగా 76 పరుగులు సమకూరాక ఈ జోడీ టీ విరామానికి వెళ్లింది.


పరుగుల వరద:

ఆఖరి సెషన్‌లో భారత్‌ టీ20 తరహాలో చెలరేగి 164 పరుగులను సాధించడం విశేషం. ఆకాశం మరోసారి మేఘావృతం కావడంతో వీలైనంత వేగంగా ఆడేందుకు పంత్‌ ప్రయత్నించాడు. ఈక్రమంలో బౌలర్‌ ఎవరైనా బాదుడే లక్ష్యంగా సాగాడు. బ్రేక్‌ తర్వాత తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు కొట్టిన తను ఆ తర్వాత కూడా జోరు ఆపలేదు. పాట్స్‌, లీచ్‌ ఓవర్లలో ఎక్కువగా పరుగులు రాబట్టాడు. దీంతో 88 బంతుల్లోనే కెరీర్‌లో ఐదో సెంచరీ పూర్తి చేశాడు. లీచ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 61వ ఓవర్‌లోనైతే  4,6,4,6తో 22 రన్స్‌ రావడం విశేషం. అటు అద్భుత సహకారం అందించిన జడేజా కూడా అర్ధసెంచరీ సాధించాడు. ఎట్టకేలకు పంత్‌ దూకుడును 67వ ఓవర్‌లో జో రూట్‌ అడ్డుకోగలిగాడు. మరో ఓవర్‌ వ్యవధిలోనే శార్దూల్‌ (1)ను స్టోక్స్‌ అవుట్‌ చేసినా.. షమితో కలిసి జడ్డూ ఓపిగ్గా ఆడి తొలి రోజును ముగించాడు.


స్కోరుబోర్డు

భారత్‌:

గిల్‌ (సి) క్రాలే (బి) అండర్సన్‌ 17, పుజార (సి) క్రాలే (బి) అండర్సన్‌ 13, విహారి (ఎల్బీ) పాట్స్‌ 20, కోహ్లీ (బి) పాట్స్‌ 11, పంత్‌ (సి) క్రాలే (బి) రూట్‌ 146, అయ్యర్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) అండర్సన్‌ 15, జడేజా (బ్యాటింగ్‌) 83, శార్దూల్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) స్టోక్స్‌ 1, షమి (బ్యాటింగ్‌) 0, ఎక్స్‌ట్రాలు 32, మొత్తం 73 ఓవర్లలో 338/7 వికెట్లపతనం: 1/27, 2/46, 3/64, 4/71, 5/98, 6/320, 7/323 బౌలింగ్‌: అండర్సన్‌ 19-4-52-3, బ్రాడ్‌ 15-2-53-0, మాథ్యూ పాట్స్‌ 17-1-85-2, లీచ్‌ 9-0-71-0, స్టోక్స్‌ 10-0-34-1, రూట్‌ 3-0-23-1.


కెప్టెన్‌గా బుమ్రా  ఎందుకు : మాజీల విమర్శ

బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బాధ్యతలు అతడిని అయోమయంలోకి నెట్టేస్తాయని ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు ఆష్లే గైల్స్‌ అన్నాడు. ‘జట్టులో అత్యంత కీలకమైన బౌలర్‌ బుమ్రాను కెప్టెన్‌గా నియమించడం ఆసక్తికరమే. నిజానికి తాము ఎప్పు డు బౌలింగ్‌కు దిగాలి. దిగితే ఎన్ని ఓవర్లు బౌల్‌ చేయాలి...లాంటి సందేహాలు వారిని చికాకు పరుస్తా యి’ అని చెప్పాడు. మరోవైపు పుజారకు సారథ్యం ఇస్తే బాగుండేదని వసీం జాఫర్‌ అన్నాడు.

ఆసియాకు ఆవల నాలుగు సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌. అలాగే విదేశాల్లో వేగవంతమైన సెంచరీ (89 బంతుల్లో) బాదిన మూడో భారత బ్యాటర్‌. ఓ క్యాలెండర్‌ ఏడాదిలో రెండు శతకాలు సాధించిన నాలుగో భారత వికెట్‌ కీపర్‌ అయ్యాడు.

Updated Date - 2022-07-02T09:56:55+05:30 IST