IND vs ENG: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. కారణం వాళ్లిద్దరే..

ABN , First Publish Date - 2022-07-18T04:25:39+05:30 IST

ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా దుమ్మురేపింది. రిషబ్ పంత్ ‘వన్ మ్యాన్ షో’తో టీమిండియాను..

IND vs ENG: కుర్రాళ్లు కుమ్మేశారు.. ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. కారణం వాళ్లిద్దరే..

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా దుమ్మురేపింది. రిషబ్ పంత్ ‘వన్ మ్యాన్ షో’తో టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. 113 బంతుల్లో 125 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పంత్ విధ్వంసర బ్యాటింగ్‌తో టీమిండియా ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. హార్థిక్ పాండ్యా కూడా 55 బంతుల్లో 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇద్దరి అద్భుతమైన బ్యాటింగ్‌తో ఫైనల్ వన్డేలో టీమిండియా ఇంగ్లండ్‌పై సునాయాసంగా గెలిచింది. 42.1 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసి టీమిండియా సిరీస్‌ను దక్కించుకుంది. 3 వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా గెలుచుకుంది.



టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టును టీమిండియా బౌలర్ సిరాజ్ ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు. బెయిర్ స్టో, రూట్ సిరాజ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగారు. అయితే.. జాసన్ రాయ్ 41 పరుగులతో కాస్త నిలదొక్కుకున్నప్పటికీ హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌గా చిక్కడంతో రాయ్ కూడా పెవిలియన్‌కు వెళ్లక తప్పలేదు. అయితే.. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జాస్ బట్లర్ 80 బంతుల్లో రెండు సిక్స్‌లు, 3 ఫోర్లు కొట్టి 60 పరుగులు చేశాడు.



హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి రవీంద్ర జడేజాకు క్యాచ్‌గా చిక్కి బట్లర్ కూడా వెనుదిరిగాడు. బెన్ స్టోక్స్ 27, మొయిన్ అలీ 34, లివింగ్‌స్టోన్ 27, విల్లీ 18, ఓవర్‌టన్ 32 పరుగులు చేశారు. ఇంగ్లండ్ జట్టు 45.5 ఓవర్లలో 259 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో హార్థిక్ పాండ్యా ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి 3 ఓవర్లు మేడిన్ చేసి 4 వికెట్లు తీసి అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. చాహల్ 3, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్‌ తీశారు. షమీకి ఫైనల్ వన్డేలో ఒక్క వికెట్ కూడా దక్కలేదు. 260 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఇంగ్లండ్ బౌలర్ టోప్లే షాకిచ్చాడు. ఒక్క పరుగు మాత్రమే చేసిన శిఖర్ ధావన్ టోప్లే బౌలింగ్‌లో రాయ్‌కు క్యాచ్‌గా దొరికిపోయాడు.



రోహిత్ శర్మ కూడా 17 పరుగులకే టోప్లే బౌలింగ్‌లోనే రూట్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్‌కు చేరాడు. దీంతో.. 21 పరుగులకే టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లీ 17, సూర్య కుమార్ యాదవ్ 16 పరుగులు  మాత్రమే చేయడంతో 72 పరుగులకే టీమిండియా నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. అయితే.. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐదో వికెట్‌కు 127 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 71 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హార్థిక్ పాండ్యా.. కార్స్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. ఆ తర్వాత పంత్ విధ్వంసకర బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్లకు ఆ జట్టు గెలుపుపై ఆశలు సన్నగిల్లేలా చేశాడు. సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగి 106 బంతుల్లో సెంచరీ చేశాడు. సెంచరీ తర్వాత పంత్ మరింత దూకుడు పెంచి విల్లీ బౌలింగ్‌లో ఐదు బంతులకు ఐదు ఫోర్లు కొట్టాడు. దీంతో.. విజయం ఏకపక్షమైంది. రిషబ్ పంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. హార్థిక్ పాండ్యా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.

Updated Date - 2022-07-18T04:25:39+05:30 IST