Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

గ్రామీణ వైద్య సేవల్లో మేలుమలుపు

twitter-iconwatsapp-iconfb-icon
గ్రామీణ వైద్య సేవల్లో మేలుమలుపు

గ్రామీణ ప్రజలకు వివిధ వైద్యసేవలు అందించిన 104 నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలు ఇకపై నిలిచిపోనున్నాయి! దాదాపు 12 ఏళ్ల పాటు సేవలు అందించిన 104 వాహనాలను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయని వార్తలొచ్చాయి. ప్రస్తుతం 104 వ్యవస్థలో సేవలు అందిస్తున్న సిబ్బందిని ఇతర ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నది. ‘జీవనశైలి వ్యాధుల నివారణ’ పథకం అందుబాటులోకి రావడంతో 104 సేవలకు పెద్దగా పనిలేకుండా పోయిందని, రానున్న రోజుల్లో పల్లె దవాఖానాలు కూడా తెరుస్తుండడంతో ఇకపై 104 సేవలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని అర్థమవుతున్నది. ఈ నేపథ్యంలో ఒక్కసారి 104 సేవల చరిత్రను సింహావలోకనం చేయడం సముచితంగా ఉంటుంది. ఈ సేవలు ఎలా ప్రారంభమయ్యాయి, ఎప్పుడు ప్రారంభమయ్యాయి, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎంత గొప్ప సేవలను గ్రామీణ ప్రజలకు అందించాయి, క్రమేణా ప్రభుత్వ–ప్రయివేట్ భాగస్వామ్యం నిర్వహణ నుంచి అవి ఏ విధంగా పూర్తిగా ప్రభుత్వ పరమయ్యాయి అనే విషయాలు చాలా ఆసక్తికరమైనవి.


ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు మూడు కిలోమీటర్ల ఆవల ఉండే గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఈ సేవలను ఉద్దేశించారు. ప్రసూతి, మాతా శిశు సంరక్షణ, దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, హృద్రోగం, రక్తపోటు, మూర్ఛ వంటి వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ కోసం నిర్ధారిత తేదీల్లో ఆయా గ్రామాల్లోకి వెళ్లేందుకు 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘104 సంచార వాహన సేవలు’ ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతను ‘ఆరోగ్య నిర్వహణ–పరిశోధనా సంస్థ’ (హెచ్ఎమ్ఆర్ఐ)కు అప్పచెప్పింది. ఈ సేవల రూపశిల్పి స్వర్గీయ డాక్టర్ ఎపి రంగారావు. డాక్టర్ ఊట్ల బాలాజీ వ్యవస్థాపక ముఖ్య కార్యనిర్వహణాధికారి. తొలుత ఆర్థిక సహాయం చేసింది బి రామలింగరాజు.


అవిభక్త అంధ్రప్రదేశ్‌లోని సుమారు 1600కు పైగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12,000కు పైగా ఉన్న ఉప కేంద్రాలు వివిధ కారణాల వల్ల అనుకున్న రీతిలో వైద్య సేవలు అందించే స్థితిలో ఉండేవి కావు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు మూడు కిలోమీటర్ల ఆవల ఉన్న సుమారు 24,000కు పైగా గ్రామాల ప్రజలకు కనీస వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేవి కావు. ఈ నగ్న సత్యాన్ని ఆరోగ్య నిర్వహణ–పరిశోధనా సంస్థ (హెచ్‍‍ఎమ్ఆర్‍ఐ) గుర్తించి ‘నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల’ పథకం నమూనాను రూపొందించింది. ఈ పథకాన్ని ఎలా అమలుపరచాలి అన్న విషయమై ఉన్నత స్థాయిలో పెద్దచర్చ జరిగింది. ముఖ్యంగా సంచార వైద్య వాహనాలలో డాక్టర్లు ఉండాలా–వద్దా అనే విషయమై తర్జన భర్జనలు జరిగాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నియమితులయిన డాక్టర్లలో చాలా మంది అసలు డ్యూటీలో చేరకపోవడం జరిగేది. చేరిన వారు సైతం ఆ గ్రామాల్లో ఉండకపోవడమో, ఉన్న కొద్ది మంది వీలైనంత త్వరలో పట్టణాలకు బదిలీ చేయించుకుని వెళ్లడమో తప్పక సంభవించేది. సమాజం బాగోగులు, ప్రజారోగ్యం విషయంలో విశాల దృక్పథంతో ఆలోచించే యువ డాక్టర్లు ఎవరైనా ఉంటే వారు స్థిమితంగా పనిచేసేందుకు దోహదం చేసే కనీస మౌలిక సదుపాయాలు ఆసుపత్రులలో ఉండేవి కావు! నివాస సంబంధిత వసతులు విషయమూ అంతే. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఇక ఉప కేంద్రాల గురించి చెప్పేదేముంది? అవి కేవలం నామ మాత్రంగానే పనిచేసేవి.


ఉన్న 1600 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసేందుకే వైద్యులు కరువైనప్పుడు సంచార వాహనాల్లో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రారనే సత్యాన్ని అందరూ గుర్తించారు. వాహనాల్లో వైద్యులు లేకపోయినా, హైదరాబాద్‌లోని 104 కాల్ సెంటర్‌కు అనుబంధంగా పనిచేస్తున్న డాక్టర్ల తోడ్పాటుతో, సుశిక్షితులైన సిబ్బందిని వాహనాల్లో పంపి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన మందులు ఫార్మసిస్టు ద్వారా పంపిణీ జరగాలని నిర్ణయం జరిగింది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు శాయశక్తులా మారుమూల గ్రామాల్లో నివసించే పేదవారికి ఆరోగ్య పరీక్షల నిర్వహణ, మందుల పంపిణీని ఒక సామాజిక బాధ్యతగా హెచ్ఎమ్ఆర్ఐ తీసుకుంది. అందరికీ ఆరోగ్యం అన్న మహత్తర ఆశయంతో, చిత్త శుద్ధితో, అంకితభావంతో 104 సంచార వాహన సేవలు నిరంతరాయంగా అందించింది. ఈ విధ్యుక్త ధర్మ నిర్వహణలో హెచ్‍ఎమ్ఆర్‍ఐ ఏనాడూ అలసత్వం చూపలేదు.


నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల పరిధిలోకి సుమారు నాలుగు కోట్ల మంది గ్రామీణులను తీసుకురావాలనే లక్ష్యాన్ని హెచ్‍ఎమ్ఆర్‍ఐ పూర్తి స్థాయిలో సాధించింది. హైదరాబాద్ మినహా మిగతా 22 జిల్లాల్లో 475 సంచార వాహనాల ద్వారా, 22,500 సర్వీస్ పాయింట్లలో, అన్ని రోజుల్లోను నిరంతరాయంగా సేవలందించింది. ఏ మాత్రం రహదారి సౌకర్యాలు లేని మారుమూల కుగ్రామాలకు, తండాలకు, గిరిజన ప్రాంతాలకు వాహనాలు పోయి సేవలందించాయి. గోదావరి పాపికొండలు పరిసర ప్రాంతాలలో పడవలోనే ఆరోగ్య సేవలందించడం జరిగింది. అసంఖ్యాక గ్రామీణులు ఈ సేవల ద్వారా లబ్ధిపొందారు. కాలం ఎప్పుడూ ఒకేలా నడుస్తుందా? ప్రభుత్వ–ప్రయివేట్ భాగస్వామ్యంలో హెచ్‍‍ఎమ్ఆర్‍ఐ సమకూరుస్తున్న ‘104 సంచార వాహన సేవల’ (నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలు) నిర్వహణ బాధ్యతలను నాటి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు బదలాయించింది.


మాతా శిశు ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడం, పౌష్టికాహార లోపాలను అధిగమించడం ప్రధాన ధ్యేయంగా ఆరోగ్య భద్రతా రంగంలో సంస్కరణలకు ప్రభుత్వం పూనుకున్నది. అందులో భాగంగా ‘సాముదాయిక ఆరోగ్య పౌష్టికాహార క్షేత్రాల’ (కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్ క్లస్టర్లు–సిహెచ్‍ఎన్‍సి)ను గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పాలని నిర్ణయించారు. 2011 సంవత్సరానికల్లా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇరవై నాలుగు గంటలు పనిచేసేదిగాను, దాని చుట్టు పక్కల ఉన్న ప్రతి ఉప కేంద్రానికి నెలకు రెండు పర్యాయాలు వెళ్ళి ఆరోగ్య సేవలందించేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కూడా నాటి ప్రభుత్వం చెప్పింది. ఈ నిర్ణయానికి హెచ్‍ఎమ్ఆర్‍ఐ యాజమాన్యం తన సంపూర్ణ సహకారాన్ని ప్రకటించింది. అయితే సంస్కరణలలో రానున్న మార్పుల విషయంలో పెద్దగా చర్చ జరగలేదు. క్షేత్ర స్థాయి సిబ్బందిలో పెరుగుతున్న అసహనాన్ని గమనించిన హెచ్‍ఎమ్ఆర్‍ఐ యాజమాన్యం, సరైన సమాచారం అధికారికంగా పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విస్తృత స్థాయిలో సంస్కరణల విషయంలో చర్చ జరిగితే బాగుంటుందని భావించిన హెచ్‍ఎమ్ఆర్‍ఐ యాజమాన్యం ఈ విషయాన్ని పలువురు విజ్ఞుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.


ఇదలా ఉంచితే 104 సంచార వాహన సేవల అమలులో హెచ్‍ఎమ్ఆర్‍ఐ సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందానికి అనుగుణంగా సంస్థకు అందాల్సిన బకాయీలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పాక్షికంగా మాత్రమే విడుదల చేశారు. మూడు నెలల నిర్వహణ వ్యయాన్ని ఒకేసారి ముందస్తుగా విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఆ నిబంధనకు కట్టుబడలేదు. మందులు సకాలంలో సరఫరా కాలేదు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వాహన సిబ్బంది గ్రామాల్లోకి పోయినప్పుడు ప్రజల నుంచి నిరసన ఎదుర్కోవాల్సివచ్చింది. ఈ పరిస్థితులలో హెచ్‍‍ఎమ్ఆర్‍ఐ యాజమాన్యం ద్వారా ప్రభుత్వ–ప్రయివేట్ భాగస్వామ్యంలో నడుస్తున్న సంచార వైద్య సేవలు పూర్తిగా ప్రభుత్వ పరమయ్యాయి.


అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా గ్రామీణ–గిరిజన ప్రాంతాలలో పనిచేయడానికి వైద్యులు అవసరమైన సంఖ్యలో ముందుకు రాలేదు. సామాన్యుడికి వైద్య సేవలు అందించడం కోసం ప్రయివేట్ సామర్థ్యాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిన అగత్యం ప్రభుత్వానికి ఏర్పడింది. దరిమిలా సంస్కరణలకు నాంది పలికారు. ఇంతలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ప్రారంభించనున్నది. దీంతో 104 సేవలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఒక మహదాశయంతో ఆవిర్భవించిన ఈ సేవలు మరో మహత్తర ఆశయ సాధన దిశగా అంతర్ధానం కాబోతున్నాయి. ఇంతకాలం పనిచేసిన 104 సిబ్బందికి, రూపశిల్పులకు అభినందనలు.

వనం జ్వాలా నరసింహారావు

మాజీ కన్సల్టెంటు, 104 సంచార వాహన సేవలు

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.