Abn logo
Feb 22 2020 @ 02:29AM

భూపరిపాలనకు దిక్కేదీ!

41 నెలలుగా ఖాళీగా సీసీఎల్‌ఏ పోస్టు .. 

రెవెన్యూ శాఖకు మంత్రి కూడా లేరు

స్పెషల్‌ సీఎ్‌సలు ఉన్నా భర్తీ చేయని ప్రభుత్వం

పరిష్కారానికి నోచుకోని భూ వివాదాలు


హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూపరిపాలన దైవాధీనంగా మారింది.  దాదాపు 41 నెలలుగా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) పోస్టు ఖాళీగా ఉంది. ప్రభుత్వం ఏ పాలసీ రూపొందించినా.. అది కార్యరూపం దాల్చేలా అమలు మార్గదర్శకాలు జారీ చేయడం, నిరంతరం పర్యవేక్షిండం సీసీఎల్‌ఏ ప్రధాన విధి. ప్రధానంగా క్షేత్రస్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల) నుంచి కలెక్టర్‌ దాకా ప్రతి ఒక్కరినీ గాడిలో పెడుతూనే.. భూవివాదాల పరిష్కారానికి ఆదేశాలివ్వడం, ప్రభుత్వ పథకాల అమలు, సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలపై దిశానిర్దేశం చేయాల్సిందీ సీసీఎల్‌ఏనే. కానీ, 2016 సెప్టెంబరు నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో భూ వివాదాలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. 2016 ఆగస్టులో సీసీఎల్‌ఏగా ఉన్న రేమండ్‌ పీటర్‌ పదవీ విరమణ చేశాక.. ఆ పోస్టును ప్రభుత్వం మరిచిపోయింది. తొలి టర్మ్‌లో రె వెన్యూశాఖకు మంత్రిని నియమించినా.. మలి టర్మ్‌లో ఏ మంత్రికీ ఈ శాఖను అప్పగించలేదు. శాఖ బాధ్యతలు సీఎం వద్దే ఉండగా, సీసీఎల్‌ఏ లేకపోవడం, రెండు నెలలుగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా లేకపోవడం శాఖ దుస్థితికి అద్దంపడుతోంది. 2017 సెప్టెంబరు 15వ తేదీ నుంచి భూరికార్డుల నవీకరణను అదరా బాదరగా చేయడంతో వివాదాలన్నీ బయటపడ్డాయి. కానీ, ఏ వివాదాన్ని పరిష్కరించేందుకూ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టలేదు. సీసీఎల్‌ఏ స్థాయిలో అమలు కావాల్సిన నిర్ణయాలన్నీ ప్రస్తుతం సీఎం నిర్ణయాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. రేమండ్‌ పీటర్‌గా సీసీఎల్‌ఏగా ఉన్న 11 నెలల కాలమే ఐదున్నరేళ్లలో రెవెన్యూకు స్వర్ణయుగంగా చెబుతుంటారు. అప్పటిదాకా గోప్యంగా ఉన్న భూరికార్డులన్నింటినీ ‘మాభూమి’ పేరుతో వెబ్‌పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత ప్రతి వారం రెవెన్యూ సమస్యలపై, రికార్డుల నవీకరణపై 11 నెలలపాటు ఒక వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి.. కలెక్టర్లను కూడా దడదడలాడించారు.


ఆయన పదవీ విరమణ చేశాక.. భూవివాదాలపై, ప్రభుత్వ పథకాలపై ప్రత్యేకంగా ఒక్క వీడియో కాన్ఫరెన్స్‌ కూడా ఉన్నతస్థాయిలో నిర్వహించలేదు. కీలకమైన భూరికార్డుల నవీకరణ జరుగుతున్నప్పుడు కూడా పలు సమస్యలు ఉత్పన్నమైనా.. వాటి పరిష్కారానికి క్షేత్రస్థాయి యంత్రాంగానికి దిశానిర్దేశం చేసే కీలక బాధ్యులు లేకుండాపోయారు. సీసీఎల్‌ఏలో ఉన్న అధికారులకన్నా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులే సీనియర్‌. దాంతో కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దీంతో రైతుబంధు అమలు అనంతరం రెవెన్యూశాఖ బద్నాం అయినంతగా మరే శాఖ కూడా కాలేదు. 


భూముల అవినీతికి  బేక్‌ ఏదీ?

భూరికార్డులతో ముడిపడి ఉన్న అవినీతిని నిర్మూలించాలంటే భూమికి, రికార్డులకు మధ్య లింకు కలవాలని, దీనికోసం భూముల రీసర్వేకు అనుమతిస్తే కేవలం 16 నెలల్లో పూర్తిచేస్తామని రేమండ్‌పీటర్‌ పదే పదే ప్రభుత్వ అనుమతి కోరారు. దీనికోసం వీఆర్వోలందరికీ ట్యాబ్‌లు కూడా ఇచ్చారు. భూముల సర్వేకు అవసరమైన ప్రాథమిక పనులన్నీ చేసి సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం విముఖత చూపడంతో భూవివాదాలు, భూములతో ముడిపడిన ఉన్న అవినీతి తారస్థాయికి చేరాయి. వాస్తవానికి 2014 జూన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే అప్పటి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న బీఆర్‌ మీనా.. కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భూముల రీ సర్వేకు అనుమతి తీసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం భూరికార్డుల నవీకరణలో అవినీతి ఆరోపణలకు కారణమైందన్న విమర్శలు వస్తున్నాయి. ఇది పూర్తిగా ప్రభుత్వ తప్పిదమే తప్ప.. యంత్రాంగానిది కాదని గుర్తు చేస్తున్నారు. ఆ రోజు సర్వేకు అనుమతి ఇచ్చి ఉంటే.. ఈరోజు రికార్డులు ఇలా ఉండేవి కావని అంటున్నారు. 590 మండలాలు, 71 రెవెన్యూ డివిజన్లు, 32 వేల మంది దాకా ఉద్యోగులు, నిరంతరం కోట్ల మందితో ముడిపడి ఉన్న శాఖ పర్యవేక్షణను గాలికి వదిలేయడమేంటని పలువురు విశ్రాంత అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్పెషల్‌ సీఎస్‌ కేడర్‌లో కీలక అధికారులు ఎవరైనా ఖాళీగా ఉంటే, వారి సామర్థ్యానికి తగ్గ పనులు లేకపోతే.. వారిలో ఒకరిని సీసీఎల్‌ఏగా నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. 

Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement
Advertisement