వరి ధాన్యం కొనుగోళ్లలో రివర్స్‌ గేర్‌!

ABN , First Publish Date - 2020-02-22T07:32:52+05:30 IST

వరి సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడి ఏటేటా పెరుగుతుంటే.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రం లక్ష్యాలకు అనుగుణంగా సేకరణ జరగటం లేదు. ధాన్యం సేకరణలో అరుదైన రికార్డులు...

వరి ధాన్యం కొనుగోళ్లలో రివర్స్‌ గేర్‌!

ఖరీఫ్‌లో దిగుబడి 94.43 లక్షల టన్నులు

లక్ష్యం 60 లక్షల టన్నులు.. కొన్నది 47.11 లక్షలే 

కొనుగోలు కేంద్రాల్లో సమస్యలతో టార్గెట్‌కు దూరం

పొరుగు రాష్ట్రాలకు భారీగా తరలిపోయిన ధాన్యం


హైదరాబాద్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): వరి సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడి ఏటేటా పెరుగుతుంటే.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రం లక్ష్యాలకు అనుగుణంగా సేకరణ జరగటం లేదు. ధాన్యం సేకరణలో అరుదైన రికార్డులు సాధిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం.. గత ఖరీ్‌ఫలో 60 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అందుకనుగుణంగా 3,670 కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినప్పటికీ, నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. రాష్ట్రంలో 94.43 లక్షల టన్నుల దిగుబడి లభిస్తే.. అందులో సగం(47.11 లక్షల టన్నులు) మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసి, సెంటర్లు మూసేసింది. రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌ సీజన్‌ మొత్తంలో 94.43 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. కానీ 47.11 లక్షల టన్నులే కొన్నారు. కేంద్రం ప్రకటించిన ప్రకారం ఏ-గ్రేడు రకానికి క్వింటాలుకు రూ.1,835, సాధారణ రకానికి రూ.1,815 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ.. కేంద్రాల నిర్వహణ లోపం రైతులకు శాపంగా మారింది. సెంటర్ల నిర్వాహకులు, రైస్‌ మిల్లర్లు కుమ్మక్కై రైతులను ముప్పుతిప్పలు పెట్టారు.  15 నుంచి 20 రోజులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా పెట్టకుండా రైతులను వెయిటింగ్‌లో పెట్టడంతో విసిగిపోయారు. వీటికి తోడు పట్టాదారు పాస్‌బుక్‌, బ్యాంకు ఖాతా, సాగు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, గ్రామ రైతు సమితి, ఏఈవోలతో ధ్రువపత్రం, 50 క్వింటాళ్లకు మించితే మండల వ్యవసాయ అధికారి ఽధ్రువపత్రాన్ని తీసుకురావాలని లింకులు పెట్టారు. ఇన్నిరకాల డాక్యుమెంట్లు తీసుకెళ్లటం సాఽధ్యం కాని రైతులు, కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు చూసి విసిగిపోయిన రైతులంతా.. రైస్‌మిల్లర్లు, దళారులు, వ్యాపారులను ఆశ్రయించారు. రూ.100, రూ. 200 తక్కువొచ్చినా సరే.. అని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. దీంతో రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ఽ94.43 లక్షల టన్నుల ధాన్యంలో.. సగానికంటే ఎక్కువ(47.32 లక్షల టన్నుల) ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రాకుండా పోయింది.


పొరుగు రాష్ట్రాలకు 8 లక్షల టన్నులు

రాష్ట్రం నుంచి వరి ధాన్యం కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎక్కువగా తరలివెళ్లింది. రైస్‌మిల్లర్లు చెబుతున్న లెక్కల ప్రకారం 8 లక్షల టన్నుల ధాన్యం ఇతర రాష్ట్రాలకు వెళ్లింది. ఉత్తర తెలంగాణ ధాన్యాగారంగా పిలవబడే నిజామాబాద్‌ జిల్లా నుంచే 2 లక్షల టన్నులను దళారులు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లారు. 

Updated Date - 2020-02-22T07:32:52+05:30 IST