మా భూమే కావాలా... మేమెలా బతకాలి?

ABN , First Publish Date - 2020-07-01T07:53:20+05:30 IST

‘మా కుటుంబానికి 92 సెంట్ల భూమే ఆధారం. 32 ఏళ్లుగా అదే భూమిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఇప్పుడు అధికారులు ఆ భూమిని ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు...

మా భూమే కావాలా... మేమెలా బతకాలి?

92 సెంట్ల భూమిని ఇళ్ల స్థలాలకు తీసుకున్న రెవెన్యూ అధికారులు

యజమాని ఆత్మహత్యాయత్నం


జంగారెడ్డిగూడెం, జూన్‌ 30: ‘మా కుటుంబానికి  92 సెంట్ల భూమే ఆధారం. 32 ఏళ్లుగా అదే భూమిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఇప్పుడు అధికారులు ఆ భూమిని ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ ఆధారం కూడా లేకపోతే మేమెలా బతకాలి?’ అంటూ భూమి యజమాని అయిన 62ఏళ్ల మహిళ ఆ భూమిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో గోళ్ల సుబ్బలక్ష్మికి 92సెంట్ల అసైన్డ్‌ భూమి ఉంది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సుబ్బలక్ష్మికి చెందిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఫిబ్రవరి 19నే అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో అప్పుడే బాధితురాలు పురుగుల మందు తాగేందుకు యత్నించింది. అయితే స్థానికులు అడ్డుకున్నారు. ఆ తరువాత ఎన్నికలు, కరోనా తదితర కారణాలతో భూసేకరణ నిలిచిపోయింది. తిరిగి మంగళవారం లక్కవరం వీఆర్వో బాజీ, సిబ్బంది సుబ్బలక్ష్మి భూమిలో ప్లాట్లు వేసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న సుబ్బలక్ష్మి.. అధికారులను వేడుకుంది. అయినా వినకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో 48గంటలు సుబ్బలక్ష్మిని పరిశీలనలో ఉంచాలని వైద్యులు చెప్పినట్టు ఆమె కుమారుడు బాలగంగాధర్‌ తెలిపారు. భూమిని అధికారులు తీసుకోడానికి తొలిసారి యత్నించినప్పుడే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నామన్నారు. 

Updated Date - 2020-07-01T07:53:20+05:30 IST