వ్యక్తిగత ఇమేజ్‌కు చెక్‌!

ABN , First Publish Date - 2022-04-11T08:43:25+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌లో వ్యక్తి ప్రాధాన్యం ఏర్పడకుండా అధిష్ఠానం ఎక్కడికక్కడ ముడులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

వ్యక్తిగత ఇమేజ్‌కు చెక్‌!

రేవంత్‌కు సమాంతరంగా కోమటిరెడ్డికి బాధ్యతలు!


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్‌లో వ్యక్తి ప్రాధాన్యం ఏర్పడకుండా అధిష్ఠానం ఎక్కడికక్కడ ముడులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమించడం దీనినే సూచిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్‌ క్యాంపెయినర్‌ను సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రకటిస్తారు. కానీ, అధిష్ఠానం ఇప్పుడే ప్రకటించడం, ప్రజాకర్షక నేతగా గుర్తింపు పొందిన రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో.. మరో నాయకుడికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేలా వీలు కల్పించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీలో వ్యక్తి ప్రాధాన్యం లేకుండా తీసుకునే చర్యల్లో భాగంగానే ఈ తరహాలో నియామకాలు చేపడుతారని అంటున్నారు. ఇటీవల ముఖ్యనేతలతో రాహుల్‌గాంధీ సమావేశం సందర్భంగా జరిగిన పరిణామాల వల్లే తెలంగాణ కాంగ్రె్‌సను తన అదుపులో పెట్టుకునే దిశగా అధిష్ఠానం చర్యలు చేపట్టిందన్న విశ్లేషణలు వెలువడు తున్నాయి. టీపీసీసీ అధ్యక్ష పదవినుంచి రేవంత్‌ను మార్చే ప్రసక్తే లేదన్న సంకేతాన్ని ఇటీవల రాహుల్‌ ఇచ్చారు. అయితే రేవంత్‌పై అసంతృప్తితో ఉన్న నేతలకూ రాహుల్‌ సమయాన్ని కేటాయించి గౌరవం ఇచ్చారు.  


అభ్యర్థుల ఎంపిక సైతం..

ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక కూడా వ్యూహకర్త సునీల్‌ కొనగాల చేసే సర్వేల ఆధారంగానే జరుగుతుందని పార్టీ నేతలకు రాహుల్‌ చెప్పారు. తద్వారా అభ్యర్థుల ఎంపికను అధిష్ఠానం పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందనే సంకేతాలిచ్చారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా పెద్దపల్లి అభ్యర్థిని రేవంత్‌రెడ్డి ప్రకటించేశారంటూ ముఖ్యనేతల సమావేశంలో రాహుల్‌గాంధీకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేరుగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు రేవంత్‌ చేపట్టిన పలు ఆందోళన కార్యక్రమాలపై కోమటిరెడ్డి అసంతృప్తితోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టార్‌ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి నియామకం.. వ్యక్తిగతంగా నేతల ప్రాధాన్యం పెరగకుండా అధిష్ఠానం ముందస్తు చర్యలు తీసుకుంటోందన్న అభిప్రాయాలను కలిగిస్తోంది. అయితే స్టార్‌ క్యాంపెయినర్‌ హోదాను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే పరిమితం చేస్తుందా.. మరి కొందరి పేర్లనూ ప్రకటిస్తుందా? అన్నదీ చర్చనీయాంశమైంది. స్టార్‌ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డిని నియమించినందున ఆయనకు ఏఐసీసీలో పదవిదక్కే అవకాశంలేదని తెలుస్తోంది.

Updated Date - 2022-04-11T08:43:25+05:30 IST