Abn logo
Jun 20 2021 @ 03:33AM

తిరిగొచ్చిన ‘రక్తచరిత్ర’

సీమలో తెగుతున్న తలలు.. గత ప్రభుత్వంలో ఫ్యాక్షన్‌ కట్టడి

రెండేళ్లుగా గ్రామాల్లో తిరిగి తిష్ట

రెండురోజుల్లోనే నలుగురి హత్య

అనంతలో మామాఅల్లుళ్ల హత్య

కర్నూలులో అన్నదమ్ముల వథ

ప్రత్యర్థి సొంత పార్టీలో ఉన్నా చంపేదాకా చల్లారని పగలు


(అమరావతి- ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రత్యర్థులను మట్టుబెట్టే సంస్కృతి రాయలసీమలో ఒకనాడు ఉండేది. సీమలోనూ చదువులు పెరిగి, చెరువు నీరు చేలకు చేరే దారులు పెరిగిన తర్వాత.. బతుకుపై కత్తినీడ చాలావరకు తగ్గిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో మళ్లీ పగలు రగులుతున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రెండురోజుల వ్యవధిలోనే నలుగురిని ఫ్యాక్షన్‌ బలిగొంది. పొలం గొడవలు, ఆస్తి వివాదాల నుంచి పంచాయతీ ఎన్నికల పగల దాకా.. కారణం ఏదైనా గాల్లోకి కత్తులు లేస్తున్నాయి. గత ఐదారేళ్లుగా ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలతో పంటలు సాగు చేసుకుని కంకులు కోసిన చేతులు.. ఇప్పుడు మళ్లీ వాటితో పీకలు కోస్తున్నాయి. సీఎం జగన్‌ సొంత జిల్లా కడప పేరు చెబితేనే మొదట గుర్తుకొచ్చేది ఫ్యాక్షన్‌. బాంబులు, తుపాకులు, కత్తులు, ప్రతీకార దాడులు, హత్యలు ఇక్కడ ఒకప్పుడు సర్వ సాధారణం. సీఎం సొంత చిన్నాన్న వివేకానందరెడ్డిని అర్ధరాత్రి ఇంటిలోకి దూరి గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపితే రెండేళ్లయినా సీబీఐ సైతం నిందితులను పసిగట్టలేక పోతోంది. వివేకా కుమార్తె సైతం ప్రాణభయంతో కోర్టును ఆశ్రయించి రక్షణ కోరారంటే రాయలసీమలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం అవుతోంది. ఇదే జిల్లా పొద్దుటూరులో అధికార ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద రెడ్డికి ఒకప్పుడు అనుచరుడుగా ఉన్న సుబ్బయ్య ఆ తర్వాత టీడీపీలో చేరారు. అప్పటినుంచి అధికార పార్టీ అక్రమాలను ఎత్తిచూపుతూ.. ఆ క్రమంలో పట్టపగలే దారుణ హత్యకు గురయ్యారు.  కర్నూలు జిల్లా పాణ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన వడ్డు నాగేశ్వరరెడ్డి, వడ్డు ప్రతాప రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వడ్డు బ్రదర్స్‌గా పేరుపడిన వీరిని ప్రత్యర్థులు జీపుతో ఢీ కొట్టి వెంటాడి కత్తులతో నరికేశారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాటసానిపై టీడీపీ ఆరోపణ చేయగా,  తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ఖండించారు.


చిన్న బోరు గొడవతో...

చిన్న బోరు గొడవలో అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు రాజగోపాల్‌, నారాయణప్ప హత్యకు గురయ్యారు. వీరిద్దరు మామా అల్లుళ్లు. కర్నూల్‌ జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఎకరం పొలం కోసం అన్నదమ్ముల మధ్య ఏర్పడిన వివాదంతో తమ్ముడు చిన నాగేశ్వరరావు చేతిలో ఏడాది క్రితం అన్న పెద్ద నాగేశ్వరరావు హత్యకు గురయ్యాడు. జైలు నుంచి విడుదలై అదే పొలంలో వ్యవసాయం చేసుకొంటున్న చిన్నాన్నను మృతుడి ఇద్దరు కుమారులు నరికి చంపారు. అన్న ప్రాణం కన్నా ఎకరం పొలం ఎక్కువ అని ఒకరు అనుకుంటే... తండ్రి ప్రాణం తీసినోడు చిన్నాన్న అయినా సరే వదలబోమని మరో ఇద్దరు పగబట్టారు. ఫలితంగా ఆ కుటుంబంలో పెద్దలిద్దరూ ప్రాణాలు కోల్పోగా.. కుమారులిద్దరూ జైలు పాలయ్యారు. 


ప్రాణమంటే విలువలేదు...

కడప జిల్లా పులివెందులలో ఇటీవల జరిగిన తుపాకీ ఫైరింగ్‌ ఇద్దరిని బలికొంది. పులివెందులకు సమీపంలో నల్లపురెడ్డిపల్లెలో రెండు కుటుంబాల మధ్య వివాదం ఉంది. ఎదురింట్లో ఉండే పార్థసారథి రెడ్డితో తరచూ గొడవ జరుగుతుండటంతో వైసీపీ నేత శివప్రసాదరెడ్డి తుపాకీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. ఇటీవల ఓ రోజు ఉదయాన్నే వివాదం రేగడంతో తనపైకి కత్తితో వస్తున్న పార్థసారథిరెడ్డిపై శిశ ప్రసాద రెడ్డి కాల్పులు జరిపారు. అక్కడికక్కడే ఎదుటి వ్యక్తి కుప్పకూలడంతో తానూ అదే తుపాకీతో కాల్చుకుని శివప్రసాద్‌ రెడ్డి ప్రాణాలు వదిలారు. ఎదుటి వ్యక్తిని చంపడానికి ఏ మాత్రం వెనుకాడని ఈ ఇద్దరు వ్యక్తులు చివరికి ఆయుధాలతో ప్రాణాలు కోల్పోయారు.