‘మునుగోడు’ అభివృద్ధి కోసమే రాజీనామా!
ABN , First Publish Date - 2022-07-27T09:42:48+05:30 IST
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, ఇందుకు అభిప్రాయం తెలియజేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్కు చెందిన కీలక నేతలను కోరారు.
పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి భేటీ
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నాయకులు
నల్లగొండ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, ఇందుకు అభిప్రాయం తెలియజేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్కు చెందిన కీలక నేతలను కోరారు. మంగళవారం హైదరాబాద్లోని తన స్వగృహంలో నియోజకవర్గంలోని మర్రిగూడ, నాంపల్లి మండలాలకు చెందిన పలువురు నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ముందు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే ముందుకు వెళ్తానని రాజగోపాల్రెడ్డి ప్రకటించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు, కార్యకర్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం రాజీనామా చేయడాన్ని కొందరు సమర్థిస్తూ స్వాగతించారు. మరికొందరు మాత్రం అభివృద్ధి లేకున్నా పర్వాలేదని, ఎమ్మెల్యేగా కొనసాగాలంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.