కోరిక తీరిస్తేనే ఉద్యోగం రెన్యూవల్‌

ABN , First Publish Date - 2022-05-15T09:00:53+05:30 IST

తన పైఅధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళా సంక్షేమ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగిని ఆరోపించారు.

కోరిక తీరిస్తేనే ఉద్యోగం రెన్యూవల్‌

కాంట్రాక్టు ఉద్యోగినిపై అధికారి లైంగిక వేధింపులు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, మే 14: తన పైఅధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళా సంక్షేమ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగిని ఆరోపించారు. కాంట్రాక్టు గడువు ముగియడంతో రెన్యూవల్‌ చేయాలని విజ్ఞప్తి చేసినప్పుడు తన కోరిక తీర్చాలని, అప్పుడే ఫైల్‌పై సంతకం పెడతానని, తాను చెప్పినట్టు వింటే ఉద్యోగంలో ఏ ఇబ్బంది ఉండదంటూ అసభ్యంగా మాట్లాడారని శనివారం మీడియా ఎదుట ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. మార్చి 30న జిల్లా సంక్షేమ అధికారి జయరాం నాయక్‌ను కలిసి ఉద్యోగాన్ని రెన్యూవల్‌ చేయాలని తాను కోరానని.. అందుకు ఆయన ‘మీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చెప్పు.. వస్తాను’ అని ఇబ్బందికరంగా మాట్లాడారని వాపోయారు. తండ్రిలాంటి మీరు ఇలా మాట్లాడటం పద్ధతి కాదని చెప్పానని, అయినా. ‘ఉద్యోగంలో ఇలాంటివన్నీ మాములే’నంటూ మాట్లాడారని తెలిపింది. జయరాం నాయక్‌ లైంగిక వేధింపుల ఘటనపై తాను హైదరాబాద్‌ వెళ్లి సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే విచారణ కమిటీ వేసి నెలన్నర కావస్తున్నా... తనకు న్యాయం జరగడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 

Updated Date - 2022-05-15T09:00:53+05:30 IST