రిలయన్స్‌ @రూ.15 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2020-09-11T06:34:11+05:30 IST

అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మరో రికార్డును సొంతం చేసుకుంది. గురువారం స్టాక్‌ మార్కెట్లో కంపెనీ షేరు దూసుకు పోవటంతో ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ తొలిసారిగా 20,000 కోట్ల డాలర్ల మైలురాయిని దాటేసింది...

రిలయన్స్‌ @రూ.15 లక్షల కోట్లు

  • ఈ ఘనత సాధించిన తొలి భారత లిస్టెడ్‌ కంపెనీ 


ముంబై: అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మరో రికార్డును సొంతం చేసుకుంది. గురువారం స్టాక్‌ మార్కెట్లో కంపెనీ షేరు దూసుకు పోవటంతో ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ తొలిసారిగా 20,000 కోట్ల డాలర్ల మైలురాయిని దాటేసింది. మన కరెన్సీలో ఈ విలువ రూ.15 లక్షల కోట్లు. భారత్‌లో ఈ ఘనత సాధించిన తొలి కంపెనీ రిలయన్సే. రిలయన్స్‌ రిటైల్‌లో 40 శాతం వాటాను అమెజాన్‌కు విక్రయించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ షేర్లు దూసుకెళ్లాయి. బీఎ్‌సఈ ఇం ట్రాడే ట్రేడింగ్‌లో షేరు ధర ఏకంగా 8.45 శాతం పుంజుకొని రూ.2,343.90 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. దాంతో కంపెనీ మార్కెట్‌ విలువ 21,575 కోట్ల డాలర్లకు (రూ.15,84,908 కోట్లు) ఎగబాకింది.


ట్రేడింగ్‌ ముగిసేసరికి ఆర్‌ఐఎల్‌ షేరు ధర 7.10 శాతం లాభంతో రూ.2,314.65 వద్ద స్థిరపడింది. దాంతో మార్కెట్‌ విలువ 19,974 కోట్ల డాలర్లకు (రూ.14,67,350 కోట్లు) పరిమితమైంది. అయితే, కంపెనీ రైట్స్‌ ఇష్యూలో జారీ చేసిన పార్ట్‌ పెయిడ్‌ షేర్ల ధర సైతం 10 శాతం ఎగబాకి రూ.1,394.55 వద్ద ముగిశాయి. వీటితో కలిపి కంపెనీ మొత్తం మార్కెట్‌ విలువ రూ.15.3 లక్షల కోట్లుగా నమోదైంది. ఇక ఎన్‌ఎ్‌సఈలో ఆర్‌ఐఎల్‌ షేరు  8.49 శాతం ఎగబాకి రూ.2,344.95 వద్దకు చేరుకున్నప్పటికీ, చివరికి 7.29 శాతం లాభంతో రూ. 2,319 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 24.50 లక్షల షేర్లు ట్రేడవగా.. ఎన్‌ఎ్‌సఈలో 6.47 కోట్ల షేర్లు చేతులు మారాయి. 

  1. మార్కెట్‌ విలువపరంగా రిలయన్స్‌ దేశంలోనే అతిపెద్ద కంపెనీ. రెండో స్థానంలో ఉన్న టీసీఎస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.8.75 లక్షల కోట్లుగా ఉంది. 
  2. కరోనా సంక్షోభం దెబ్బకు మార్చి 23 నాటికి రిలయన్స్‌ షేర్లు రూ.867.82 వద్ద 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లో వరుస పెట్టుబడులు, తాజాగా రిలయన్స్‌ రిటైల్‌లో వాటా విక్రయం ఈ 5 నెలలకు పైగా కాలంలో కంపెనీ షేరును సరికొత్త ఉన్నత శిఖరాలకు చేర్చాయి. మార్చి నాటి కనిష్ఠ స్థాయితో పోలిస్తే ప్రస్తుతం షేరు ధర రెట్టింపునకు పైగా పెరిగింది. 


సెన్సెక్స్‌ 646 పాయింట్లు అప్‌ 

రిలయన్స్‌ షేర్ల అనూహ్య ర్యాలీతో స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలూ భారీ గా పుంజుకున్నాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఏకం గా 646.40 పాయింట్లు లాభపడి 38,840.32 వద్ద క్లోజైంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 171.25 పాయింట్లు పెరిగి 11,449.25 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 21 లాభాల్లో ముగియగా.. మిగతా 9 మాత్రం నష్టాలు చవిచూశాయి.


Updated Date - 2020-09-11T06:34:11+05:30 IST