రిలయన్స్‌ పునర్‌వ్యవస్థీకరణ

ABN , First Publish Date - 2021-02-24T08:10:22+05:30 IST

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌).. వ్యాపారాన్ని పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు ప్రకటించింది...

రిలయన్స్‌ పునర్‌వ్యవస్థీకరణ

  • ప్రత్యేక సంస్థగా ఓ2సీ విభాగం
  • రూ.1.82 లక్షల కోట్లు రుణంగా సమకూర్చనున్న ఆర్‌ఐఎల్‌ 

న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌).. వ్యాపారాన్ని పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు ప్రకటించింది. ఆయిల్‌ టు కెమికల్స్‌ (ఓ2సీ) విభాగాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ 100 శాతం అనుబంధ కంపెనీకి 2,500 కోట్ల డాలర్లు (రూ.1,82,500 కోట్లు) రుణంగా సమకూర్చనున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ప్రపంచంలో అతిపెద్ద ముడి చమురు ఎగుమతిదారైన సౌదీ అరామ్కో.. ఆర్‌ఐఎల్‌ ఓ2సీ వ్యాపారంలో 20 శాతం వాటా ను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంది. ఈ డీల్‌కు మార్గం సుగమం చేయడంతో పాటు మెరుగైన విలువను రాబట్టుకునేందుకు రిలయన్స్‌ ఓ2సీ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా విభజిస్తోంది. అంతేకాదు, ఈ అనుబంధ కంపెనీని భవిష్యత్‌లో కాలుష్యరహిత ఇంధన దిగ్గజంగా మార్చడంతో పాటు వాటాదారులకు నిలకడగా సంపదను సృష్టించేందుకూ దోహదపడుతుందని ఆర్‌ఐఎల్‌ భావిస్తోంది. 


సెబీ, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు గ్రీన్‌సిగ్నల్‌ : వ్యాపార పునర్‌వ్యవస్థీకరణకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ, స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి ఇప్పటికే ఆమోదం లభించినట్లు రిలయన్స్‌ తెలిపింది. కంపెనీ వాటాదారులు, రుణదాతలు, ఐటీ డిపార్ట్‌మెంట్‌, జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై, అహ్మదాబాద్‌ బ్రాంచ్‌ల నుంచి అనుమతులు ఇంకా రావాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో సెప్టెంబరుతో ముగియనున్న రెండో త్రైమాసికం చివరి నాటికి అన్ని అనుమతులు లభించవచ్చని ఆర్‌ఐఎల్‌ భావిస్తోంది.


Updated Date - 2021-02-24T08:10:22+05:30 IST