Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెక్కలు విరిగిన నిద్ర

ఆ రాత్రి

ఉండీ ఉండీ కదులుతున్న

మామిడిపండురంగు చంద్రుడు

ఏట్లో రెండు చేపలు

సరసమాడుతూ గీసిన బొమ్మ

ఇప్పుడే చెదరిపోయింది


ఎక్కడి నుండో వచ్చిన గాలి

ఒక్కసారి చెట్లమీద పెత్తనం చేసింది

పాత ఆకులు తృప్తిగా మట్టిని చేరుతున్నాయ్‌

కొత్త ఆకులు పుడుతున్నాయి

కొత్త మొగ్గలు మొలుస్తున్నాయి

చెట్లకింద నీడలు

ఎర కోసం పొంచి ఉన్న

మృగంలా పాకుతున్నాయ్‌


సూర్యుడు

అటువైపు ఆటలో ఉన్నాడు

ఇక్కడ నక్షత్రాలు చమ్కీ పూల్లా పూస్తున్నాయ్‌

తూనీగలు గూట్లో ఉన్నాయి

తేనెటీగలు మాగన్నుగా ఉన్నాయ్‌

కునుకు తీసే గుడ్లగూబ


పెద్దాసుపత్రి ముందు

రోగుల బంధువుల కంటి మీదకి

రాలేక రాలేక

దిగులుపడుతున్న నిద్ర

రెక్కలు విరిగి రోదిస్తూ ఉంది


మార్చురీ గదిలో

శవం మీద కప్పిన గుడ్డలా ఉంది వెన్నెల


భూమ్మీద ఎక్కడో ఒకచోట వర్షం కురుస్తుంది

నేల మీద నుండి

ఇసుక జారిపోతుంది

ఎప్పుడో ఒకప్పుడు

తుఫాను తీరం దాటుతుంది


ప్రశాంతంగా ఉన్న నది మీద

ఒక్క పిట్ట అలజడి లేపుతుంది

సుంకర గోపాలయ్య

94926 38547


Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...