భూ మార్కెట్‌ ఇక.. స్కై రాకెట్‌

ABN , First Publish Date - 2021-06-30T09:33:09+05:30 IST

రాష్ట్రంలో భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువలు పెరగనున్నాయి. ఏడేళ్లుగా పెరగకపోవడంతో ఈ సారి భారీగా పెరిగే అవకాశం ఉంది.

భూ మార్కెట్‌ ఇక.. స్కై రాకెట్‌

  • వ్యవసాయ భూములకు ఎకరాల వారీగా..
  • ఇళ్ల స్థలాలకు గజాల లెక్కన విలువల పెంపు
  • ఫ్లాట్లకు చదరపు అడుగుల ఆధారంగా..
  • రిజిస్ట్రేషన్‌ చార్జీలూ పెరగనున్నాయ్‌
  • మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు..
  • హరీశ్‌రావు నేతృత్వంలోని సబ్‌ కమిటీ భేటీ
  • ఏడేళ్లుగా పెరగని మార్కెట్‌ విలువ.. 
  • త్వరలో సీఎంకు నివేదిక.. 
  • ఆయన సూచనల ఆధారంగా పెంపు!


రిజస్ట్రేషన్‌ చార్జీలనూ పెంచాలంటూ మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆస్తుల మార్కెట్‌ విలువపై 6 శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇందులో 4ు స్టాంపు డ్యూటీ, 1.5ు ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, 0.5ు రిజిస్ట్రేషన్‌ రుసుము ఉంటాయి. దీన్ని పెంచాలని ఇదివరకే స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ఫైలు సీఎంవోలో పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని 7.5 శాతానికి పెంచారు. తమిళనాడులో 7.5 శాతం, మహారాష్ట్రలో 7 శాతం వరకు ఉన్నాయంటూ అధికారులు వివరించారు. ఈ అంశంపై కూడా మంత్రివర్గ ఉపసంఘం సీఎంకు నివేదిక ఇవ్వనుంది. అనంతరం ఆయన ఇచ్చే సూచనల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చార్జీలను ఖరారు చేయనున్నారు.


హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువలు పెరగనున్నాయి. ఏడేళ్లుగా పెరగకపోవడంతో ఈ సారి భారీగా పెరిగే అవకాశం ఉంది. వీటితో పాటు రిజిస్ట్రేషన్ల చార్జీలు కూడా పెరగనున్నాయి. ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజోపయోగ భూములు కాకుండా నగరాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్న భూములను విక్రయించడానికి ఇప్పటికే కసరత్తు చేస్తోంది. భూముల విక్రయాల ద్వారా రూ.20 వేల కోట్లు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇదేసమయంలో భూముల మార్కెట్‌ విలువ (రిజిస్ట్రేషన్‌ వాల్యూ)ను కూడా పెంచడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం.. భూముల విలువలను పెంచాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రిజిస్ట్రేషన్‌ చార్జీలను కూడా పెంచాలని సూచించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం మంగళవారమిక్కడ సమావేశమైంది. ఇందులో మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల కమిషనర్‌, ఐజీ వి.శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


సమావేశంలో ప్రధానంగా మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపుపైనే చర్చ జరిగింది. ప్రజలపై అధిక భారం పడకుండా భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువలను పెంచాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువలను పెంచలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2013లో పెంచిన మార్కెట్‌ విలువలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రెండేళ్లకోసారి మార్కెట్‌ విలువలను పెంచుతున్నారు. స్టాంపు డ్యూటీ చట్టం-1899 ప్రకారం రెండేళ్లకోసారి భూముల విలువలను మదింపు చేసి, మార్కెట్‌ విలువలను నిర్ధారించాలి. కానీ, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మార్కెట్‌ విలువలను పెంచడానికి సీఎం కేసీఆర్‌ అంగీకరించలేదు. మరోవైపు బహిరంగ మా ర్కెట్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌, వరంగల్‌ వంటి నగరాలు, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోని భూములు, ఆస్తుల బహిరంగ మార్కెట్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బంజారాహిల్స్‌ లాంటి ప్రాంతాల్లో గజం ధర రూ.1.50 లక్షలకు పైనే పలుకుతోంది. మణికొండలో రూ.70-80 వేలు, ఉప్పల్‌ భగాయత్‌లో రూ.77 వేల వరకు ధరలున్నాయి. ఉప్పల్‌, బోడుప్పల్‌ వంటి ప్రాంతాల్లోనూ రూ.50 వేలకు పైగానే ఉన్నాయి.   


రాబడి మాత్రం పెరగలేదు..

భూముల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నా స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ రాబడులు మాత్రం పెరగడం లేదు. ఏటా 10-20ు పెరుగుదల నమోదవుతుందే తప్ప.. రాబడులు ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. దీనికి కారణం ప్రభుత్వ మార్కెట్‌ విలువలు తక్కువగా ఉండడమే. సాధారణంగా మార్కెట్‌ విలువలు ఎక్కువగా ఉంటే.. వాటి ఆధారంగా బ్యాంకులు ఎక్కువ మొత్తంలో రుణాలు అందిస్తాయి. కానీ, 2013 నాటి మార్కెట్‌ విలువలే ఉండడంతో రుణాల పరిమితి కూడా తక్కువగా ఉంటోంది. దీనికి తోడు ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లోని భూముల విలువలూ భారీగా పెరిగాయి. రాష్ట్రానికి తరలివచ్చిన భారీ పెట్టుబడులు, పరిశ్రమలు, హైదరాబాద్‌ నగర విస్తరణ కారణంగా చుట్టుపక్కల భూముల ధరలూ పెరిగిపోయాయి. ఈ అంశాలన్నింటినీ రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కేబినెట్‌ సబ్‌ కమిటీకి వివరించారు. భూముల ధరలను పెంచితే అదే స్థాయిలో రిజిస్ట్రేషన్ల రాబడి కూడా పెరుగుతుందని చెప్పారు. 


ప్రస్తుతం రోజుకు సగటున జరుగుతున్న రిజిస్ట్రేషన్లు ఎన్ని? స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీల ద్వారా వస్తున్న ఆదాయం ఎంత? అన్న వివరాలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. వనరుల సమీకరణలో భాగంగా మార్కెట్‌ విలువలను పెంచాల్సిన అవసరం ఉందని కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే ఎంత శాతం పెంచాలన్నదానిపై స్పష్టత రాలేదని సమాచారం. సాధారణంగా బహిరంగ మార్కెట్‌లోని ధరల్లో 60ు వరకు మార్కెట్‌ విలువలను పెంచుతుంటారు. రెండేళ్లకోసారి జరిగే మదింపు ప్రక్రియలో ఈ సూత్రాన్ని అమలు చేస్తారు. కానీ, ఏడేళ్లుగా మార్కెట్‌ విలువలు పెరగడం లేదు. ఏడేళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ శాతాన్ని నిర్ణయించే అవకాశముంది. ఎంత శాతమన్నది నిర్ధారణ అయితే, దానికనుగుణంగా మార్కెట్‌ విలువలు పెరుగుతాయి. వ్యవసాయ భూములకు ఎకరాల వారీగా, ఇళ్ల స్థలాలకు గజాలవారీగా, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లకు చదరపు అడుగుల ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. ఈ వివరాలన్నింటితో కలిపి మంత్రివర్గ ఉప సంఘం త్వరలోనే ముఖ్యమంత్రికి నివేదికను అందజేయనుంది. దీని ఆధారంగా సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. 

Updated Date - 2021-06-30T09:33:09+05:30 IST