రిజిస్ర్టేషన్‌ చార్జీల వాత

ABN , First Publish Date - 2020-08-10T09:45:08+05:30 IST

రాష్ట్రంలో రిజిస్ర్టేషన్‌ చార్జీలు ప్రజలకు చుక్కలు చూపించనున్నాయి. బహిరంగ మార్కెట్‌లో గత ఏడాది కాలంలో భూములు, అపార్ట్‌మెంట్లు, స్థలాల విలువ దాదాపుగా

రిజిస్ర్టేషన్‌ చార్జీల వాత

  • పలుచోట్ల 20-30 శాతం పెంపు
  • కొన్నిచోట్ల 50 శాతం కూడా
  • సీఎం ఆమోదం.. నేటి నుంచి అమల్లోకి 


అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రిజిస్ర్టేషన్‌ చార్జీలు ప్రజలకు చుక్కలు చూపించనున్నాయి. బహిరంగ మార్కెట్‌లో గత ఏడాది కాలంలో భూములు, అపార్ట్‌మెంట్లు, స్థలాల విలువ దాదాపుగా ఎక్కడా పెరగకున్నా... రిజిస్ర్టేషన్‌ విలువలను మాత్రం భారీ స్థాయిలో పెంచబోతున్నారు. అసలే  కరోనా కాలం... అందులోనూ బహిరంగ మార్కెట్‌లో గత ఏడాదికాలంగా ధరలు పెరగని నేపథ్యంలో రిజిస్ర్టేషన్‌ చార్జీల పెంపే సరికాదన్న అభిప్రాయం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం పెంచడం కాదు... ఏకంగా వాతలే అన్నరీతిలో రిజిస్ర్టేషన్‌ ధరల పెంపునకు సిద్ధపడింది. ఏకంగా 20శాతం, ఎక్కువచోట్ల 30శాతం, ఇంకొన్నిచోట్ల 50శాతం... ఇలా పెంచేశారు! రిజిస్ర్టేషన్‌ ధరలపై మంత్రి ధర్మాన కృష్ణదాసు సమీక్షించి... ఆమోదం కోసం సీఎం జగన్‌కు ఇటీవల పంపించారు. సీఎం కూడా ఆమోదం తెలపడంతో రిజిస్ర్టేషన్‌ చార్జీల వాతకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచే పెరిగిన ధరలు ఆమల్లోకి రానున్నాయి. సాధారణంగా రిజిస్ర్టేషన్‌ చార్జీలను గ్రామాల్లో రెండేళ్లకు ఒకసారి, పట్టణాల్లో ఏటా ఒకసారి సవరిస్తారు. బహిరంగ మార్కెట్‌లో పెరిగిన ధరలను బట్టి వీటిని పెంచుతారు. గత ప్రభుత్వం 2018-19లో రిజిస్ర్టేషన్‌ విలువలను పెంచలేదు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాదిలో రాష్ట్రంలో ఎక్కడా భూములు, స్థలాలు, అపార్ట్‌మెంట్ల విలువలు పెరిగింది లేదనేది బహిరంగ రహస్యం. వైసీపీ పాలనలో తొలి 10నెలల్లో ఒడిదుడుకులు, రాజధాని మార్పు, ఇసుక కొరత, ఇతరత్రా ఇబ్బందులు, అనంతరం కరోనా ప్రభావంతో ధరల పెరుగుదల లేదు. ఒకటి, రెండు చోట్ల మినహా మిగతా రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. అంటే వాస్తవ విలువలు ఏమాత్రమూ పెరగకపోయినా రిజిస్ర్టేషన్‌ ధరలను మాత్రం పెంచాలని నిర్ణయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.


‘ఆంధ్రజ్యోతి’ కథనంతో 10రోజుల తర్వాత

వాస్తవానికి ఆగస్టు 1నుంచే నూతన రిజిస్ర్టేషన్‌ ధరలు అమల్లోకి రావాలి. అందుకు సంబంధించిన కసరత్తు కూడా ప్రభుత్వం చేసేసింది! అయితే ముందు ఆయా విలువల పెంపును వెబ్‌సైట్‌లో ప్రజలకు తెలపాలి. ప్రజలు పెద్దగా వీటిని చూడకున్నా అది కచ్చితంగా చేయాలి. పెంపు ప్రతిపాదనల పట్ల అభ్యంతరాలుంటే ప్రజలు దానిపై సంబంధిత సబ్‌రిజిస్ర్టారుకు ఫిర్యాదులు చేస్తారు. వాటిని పరిశీలించి పెంపుపై తుది నిర్ణయం తీసుకోవాలి. ఈ పద్ధతిని ప్రభుత్వం విస్మరించి ఆగస్టు 1నుంచే రిజిస్ర్టేషన్‌ చార్జీలు పెంచాలని నిర్ణయించింది. దీంతో ప్రజల నుంచి ఫిర్యాదులు, అభిప్రాయాలు స్వీకరించకుండానే విలువలు పెంచేయడం సరికాదంటూ ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో  ఫిర్యాదులు స్వీకరించేందుకు సమయం ఇచ్చి.. 10 నుంచి విలువల పెంపును అమలుచేయనున్నారు. అయితే చార్జీల పెంపు విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడలేదు.

Updated Date - 2020-08-10T09:45:08+05:30 IST