నదీజలాలపై..కేంద్రం పెత్తనమేంటి?
ABN , First Publish Date - 2021-07-31T08:23:46+05:30 IST
జల వనరుల శాఖ సిబ్బందికి జీత భత్యాలను చెల్లించే బాధ్యత రాష్ట్రానిదైనప్పుడు.. వారిపై అజమాయిషీ చేసే అధికారం కృష్ణా, గోదావరి బోర్డులకు ఎలా ఇస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని నవ్యాంధ్ర రిటైర్డ్
అవి రాష్ట్ర జాబితాలోవి కదా!
ఖర్చు రాష్ట్రానిది.. పెత్తనం బోర్డులదా?
బోర్డుల పరిధుల్లోని తప్పులను తక్షణమే సవరించాలని కోరండి
సీఎంకు రిటైర్డ్ ఇంజనీర్ల సూచన
మనం జీతాలిస్తే.. అవి పర్యవేక్షిస్తాయా?
ఉమ్మడి జలాశయాలపైనే..బోర్డులకు అజమాయిషీ ఉండాలి
మున్నేరు వాగు భారీ ప్రాజెక్టా?
మధ్య తరహా జాబితాలోనూ చోటు
పోలవరం కుడి కాలువ ఉభయ రాష్ట్రాలకూ ఎలా చెందుతుంది ?
అమరావతి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జల వనరుల శాఖ సిబ్బందికి జీత భత్యాలను చెల్లించే బాధ్యత రాష్ట్రానిదైనప్పుడు.. వారిపై అజమాయిషీ చేసే అధికారం కృష్ణా, గోదావరి బోర్డులకు ఎలా ఇస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని నవ్యాంధ్ర రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రశ్నించింది. నదీ జలాలు రాష్ట్ర జాబితాలోని అంశమని.. వాటిపై కేంద్రానికి పెత్తనమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ ఈ నెల 15వ తేదీన విడుదల చేసిన గెజిట్‌లో చాలా లోపాలున్నాయని.. వాటిని తక్షణమే సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని సూచించింది. మున్నేరు వాగును భారీ ప్రాజెక్టుగా షెడ్యూల్-1లోనూ.. మధ్యతరహా ప్రాజెక్టుగా షెడ్యూల్ -2లో పేర్కొన్నారని.. దీనిని సవరించాలని స్పష్టం చేసింది అదేవిధంగా పోలవరం కుడి ప్రధాన కాలువ ఉభయ రాష్ట్రాలకు చెందుతుందని గెజిట్‌లో పేర్కొనడాన్ని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం తప్పుబట్టింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎం.విశ్వేశ్వరరావు సీఎంకు శుక్రవారం లేఖ రాశారు. ‘నదీ జలాలపై రాష్ట్రానికే పూర్తి హక్కులూ.. అధికారం ఉన్నాయి. వాటిపై కేంద్రం అజమాయిషీ ఏమిటి? పైగా.. జల వనరుల శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం జీత భత్యాలు చెల్లిస్తున్నప్పుడు.. వారిపై బోర్డులదే అజమాయిషీ అని, వారు బోర్డుల పరిధిలో బాధ్యతలు నిర్వర్తించాలని కోరడం ఏమిటి? బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ విడుదల చేసిన గెజిట్‌లో లోపాలపై రెండు తెలుగు రాష్ట్రాలూ చర్చించి ఏకాభిప్రాయానికి రావాలి.
అది కుదరకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించాలి’ అని సూచించారు. గోదావరి నదిపై ఉమ్మడి ప్రాజెక్టులు లేనందున.. నదీ జలాల యాజమాన్య విధానాన్ని జీఆర్‌ఎంబీ చేపట్టాలే తప్ప.. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుని అజమాయిషీ చేయడం సరికాదన్నారు. దీనివల్ల బోర్డు విశేషాధికారాలను ప్రదర్శించే వీలుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డు పరిధిని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకే పరిమితం చేయాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సీఎంకు విజ్ఞప్తిచేశారు.