కోవిడ్‌ 19పై సమరానికి సిద్ధం!

ABN , First Publish Date - 2020-03-04T06:39:41+05:30 IST

రోనా (కోవిడ్‌-19) వైరస్‌ వ్యాప్తిపై ఫైనాన్షియల్‌ మార్కె ట్‌ వర్గాల్లో నెలకొన్న ఆందోళనలు తగ్గించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రంగంలోకి దిగింది. అంతర్జాతీయ, దేశీ...

కోవిడ్‌ 19పై సమరానికి సిద్ధం!

దేశీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తున్నాం

భారత రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటన


ముంబై: కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ వ్యాప్తిపై ఫైనాన్షియల్‌ మార్కె ట్‌ వర్గాల్లో నెలకొన్న ఆందోళనలు తగ్గించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రంగంలోకి దిగింది. అంతర్జాతీయ, దేశీ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా, నిరంతరం గమనిస్తున్నామని పేర్కొంది. ఆర్థిక మార్కెట్‌ కార్యకలాపాలను మళ్లీ గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమంటోంది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలకు లోనవుతున్నాయని మం గళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్‌బీఐ పేర్కొంది. దాంతో ఇన్వెస్టర్లు రిస్క్‌ తగ్గించుకునే పనిలో ఉన్నారని, తత్ఫలితంగా పెట్టుబడులు భద్రమైన సాధనాల్లోకి మళ్లు తు న్నాయంటోంది. ‘‘భారత ఆర్థిక మార్కెట్లపై కరోనా ప్రభావాన్ని  చాలా వరకు కట్టడి చేయడం జరిగింది. సమన్విత విధానపరమైన చర్యలపై ఆశలతో నేడు మార్కెట్లో సెంటిమెంట్‌ మెరుగుపడింద’’ని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. 


బ్యాంకులు సిద్ధంగా ఉండాలి: దాస్‌ 

కరోనా వైర్‌సతో పుట్టుకొచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సూచించారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి కుంటుపడటంతో భారత కంపెనీల వ్యాపారాలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందన్నారు. గత నెల 24న జరిగిన బ్యాంకింగ్‌ సదస్సులో దాస్‌ ప్రసంగిస్తూ..‘‘ప్రపంచ ఆర్థిక వృద్ధిపై కరోనా ప్రభావాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) విశ్లేషిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వృద్ధి రేటు మందకొడిగా సాగుతోంది. కరోనా ప్రభావంతో మరింత క్షీణిస్తే బ్యాంకుల ఆస్తుల నాణ్యతపై ప్రభావం పడవచ్చు. ఎందుకంటే, వృద్ధి మరింత తగ్గితే కార్పొరేట్ల వ్యాపారాలపై ఒత్తిడి పెరగనుంది. ప్రస్తుత వాతావరణం లో బ్యాంకులు రు ణాలిచ్చే విషయం లో చాలా జాగ్రత్తగా ఉండాల’’ని  దాస్‌ అన్నారు.


కరోనాకు కవరేజీ ఉందా? 

బీమా ధీమా కోరుతున్న భారతీయులు 

ఇన్సూరెన్స్‌ కంపెనీలకు పెరిగిన ఎంక్వైరీలు  


భారతీయులను కరోనా కలవరపెడుతోంది. దేశంలో మరిన్ని కరోనా కేసులు నమోదు కావడంతో మనోళ్లలో గుబులు మరింత పెరిగింది. ఒకవేళ మాకూ ఈ వైరస్‌ సోకితే పరిస్థితేంటని బెంగ పెరిగింది. దీంతో కరోనాకు బీమా ధీమా కోరుకునే వారు పెరిగారని, గడిచిన కొన్ని నెలల్లో ఈ వైర్‌సకు కవరేజీ కల్పించే పాలసీల గురించి ఎంక్వైరీలు పెరిగాయని ఇన్సూరెన్స్‌ రంగ ప్రతినిధులు తెలిపారు. సాధారణంగానే, ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో బీమా పథకాలు, ముఖ్యంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల విక్రయాలు గణనీయంగా పెరుగుతాయి. ఐటీ చట్టం, సెక్షన్‌ 80సీ ప్రకారంగా ఆదా య పన్ను  మినహాయుంపుల కోసం వేతన జీవులు ఈ కాలంలో, మరీ ముఖ్యంగా మార్చిలో  బీమా పాలసీలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. కరోనా ముప్పుతో ఈ ఏడాది పాలసీలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందట. కరోనాకూ కవరేజీ కల్పించే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కొనుగోలు చేయడం లేదా ప్రస్తుతమున్న పాలసీ ఈ వైర్‌సకు కవరేజీ కల్పిస్తుందా అని తెలుసుకునేందుకు వస్తున్న కస్టమర్లు పెరిగారని హెచ్‌డీఎ్‌ఫసీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ అండర్‌రైటింగ్‌ ఆఫీసర్‌ అనురాగ్‌ రస్తోగీ తెలిపారు. 


షామీ, రియల్‌మీ కొత్త మొబైళ్ల విడుదల రద్దు 

కొత్త స్మార్ట్‌ఫోన్ల విడుదలపైనా కరోనా ప్రభావం చూపుతోంది. భారత్‌లో కరోనా భయాలు పెరిగిన నేపథ్యంలో చైనా మొబైల్‌ కంపెనీలైన షామీ, రియల్‌మీ కొత్త మోడళ్ల విడుదల కార్యక్రమాలను రద్దు చేసుకున్నాయి. ఈనెల 5న రియల్‌మీ 6సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ను, 12న షామీ రెడ్‌మీ నోట్‌ సిరీస్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయాలనుకున్నాయి. ఈనెల 16న మోటో రేజర్‌ను ఇండియాలో విడుదల చేయనున్నట్లు మోటరోలా ప్రకటించింది. మరి ఈ కంపెనీ కూడా కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటుందా..? అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

Updated Date - 2020-03-04T06:39:41+05:30 IST