పెండింగ్‌ కేసుల భారాన్ని తగ్గిస్తా

ABN , First Publish Date - 2021-10-19T08:42:13+05:30 IST

తాను తెలంగాణ హైకోర్టుకు చీఫ్‌ జస్టి్‌సగా వచ్చే ముందు ఇక్కడ కేసులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయంటూ కొంతమంది తనను భయపెట్టారని హైకోర్టు సీజే సతీశ్‌ చంద్ర శర్మ వ్యాఖ్యానించారు.

పెండింగ్‌ కేసుల భారాన్ని తగ్గిస్తా

  • జడ్జిలతో కలిసి పనిచేస్తా.. హైకోర్టు సీజే సతీశ్‌ చంద్ర శర్మ 
  • సీజేకు బార్‌ అసోసియేషన్‌ సన్మానం


హైదరాబాద్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): తాను తెలంగాణ హైకోర్టుకు చీఫ్‌ జస్టి్‌సగా వచ్చే ముందు ఇక్కడ కేసులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయంటూ కొంతమంది తనను భయపెట్టారని హైకోర్టు సీజే సతీశ్‌ చంద్ర శర్మ వ్యాఖ్యానించారు. తన తోటి న్యాయమూర్తుల సమన్వయంతో భారీగా పేరుకుపోయిన కేసుల భారాన్ని తగ్గిస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా నియమితులైన చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీసుధ, జస్టిస్‌ సుమలత, జస్టిస్‌ రాధారాణి, జస్టిస్‌ లక్ష్మణ్‌, జస్టిస్‌ తుకారాంజీ, జస్టిస్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, జస్టిస్‌ మాధవీదేవిలను హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సన్మానించింది. తనను తెలంగాణ హైకోర్టు సీజేగా ఎంపిక చేసిన సుప్రీంకోర్టు కొలీజియంకు జస్టిస్‌ శర్మ కృతజ్ఞతలు తెలియజేశారు. తాను వచ్చిన తర్వాత వెలుగు వచ్చిందని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పేర్కొన్నారని.. కానీ ఈ హైకోర్టులో ఎప్పటి నుంచో వెలుగు ఉందని, ఇది గొప్ప హైకోర్టు అని వ్యాఖ్యానించారు. కేసుల భారాన్ని తగ్గించేందుకు న్యాయవాదులు సహకరించాలని, ఎక్కువ వాయిదాలు తీసుకోకుండా సిద్ధమై రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఏ నరసింహారెడ్డి, పీపీ ప్రతా్‌పరెడ్డి, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

జస్టిస్‌ భుయాన్‌ 22న ప్రమాణం

బాంబే హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ఈనెల 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ హైకోర్టు నుంచి త్రిపుర హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌కు ఈనెల 21న వీడ్కోలు సమావేశం నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ జనరల్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-19T08:42:13+05:30 IST