మీ కోసం... రెడ్‌ డాట్‌ ఛాలెంజ్‌!

ABN , First Publish Date - 2020-05-27T05:30:00+05:30 IST

మహిళలు నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించకపోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ప్రాణం...

మీ కోసం... రెడ్‌ డాట్‌ ఛాలెంజ్‌!

మహిళలు నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించకపోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ప్రాణం మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ విషయమై మహిళలతో పాటు అందరిలో అవగాహన తీసుకొచ్చేందుకు ‘యునిసెఫ్‌’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ‘రెడ్‌ డాట్‌ ఛాలెంజ్‌’. మే 28న ‘అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా నటీనటులు, మోడల్స్‌, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారితో నెలసరి పరిశుభ్రతపై క్యాంపెయిన్‌ మొదలెట్టింది. ఆ విశేషాలే ఇవి...


‘యునిసెఫ్‌’ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మందికి పైగా అమ్మాయిలు, మహిళలు సాధారణ పరిశుభ్రత లేక బాధపడుతున్నారు. కొన్ని వెనుకబడిన దేశాల్లో కేవలం 27 శాతం మంది ప్రజలకు మాత్రమే ఇంట్లో సబ్బు, నీటితో చేతులు శుభ్రం చేసుకునే వెసులుబాటు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు, అమ్మాయిలు నెలసరి సమయంలో పరిశుభ్రత కోసం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో కనీస సదుపాయాలు లేక, పాఠశాల టాయిలెట్స్‌లో సరైన శానిటేషన్‌ లేకపోవడంతో నెలసరి అంటేనే అదో శాపంలా ఫీలవుతున్నారు. దాంతో చాలామంది అమ్మాయిలు బడికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. చాలా పాఠశాలల్లో అమ్మాయిల డ్రాపౌట్స్‌ పెరగడానికి కారణం నెలసరి సమస్యలే అంటే ఆశ్చర్యం కలుగుతుంది.  


‘రెడ్‌ డాట్‌ ఛాలెంజ్‌’ ఏమిటి?

నెలసరి విషయంలో అమ్మాయిల్లో, మహిళల్లో అవగాహనను పెంపొందించి, ఆ సమయంలో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించేందుకు ‘యునిసెఫ్‌’ ఇండియా విభాగం రూపొందించిన కార్యక్రమమే ‘రెడ్‌ డాట్‌ ఛాలెంజ్‌’. ఇందులో భాగంగా మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేయగల సెలబ్రిటీలు తమ అరచేతిలో పెద్ద ఎరుపు చుక్కను పెట్టుకుని, ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ, నెలసరిపై తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవానికి వారం రోజుల ముందు నుంచే సెలబ్రిటీలు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ‘‘పీరియడ్స్‌ అనగానే ఇబ్బందిగా ఎందుకు ఫీలవుతారో నాకు అర్థం కాదు... లాక్‌డౌన్‌లో నా శరీరం గురించి మరింత తెలుసుకునేందుకు అవకాశం కలిగింది. శరీరానికి విశ్రాంతి ఇచ్చి, హైడ్రేట్‌గా ఉంటూ నన్ను నేను మరింతగా ప్రేమించుకోవాలను కుంటున్నా. మీ శరీరం గురించి, ‘సైకిల్‌’ (పీరియడ్స్‌) గురించి గర్వంగా ఫీలవ్వండి’’ అంటూ నటి కుబ్రా సైట్‌ అవగాహన కల్పించారు. టీవీ హోస్ట్‌, మోడల్‌గా ఉన్న కుబ్రా ‘రెడీ’, ‘సుల్తాన్‌’, ‘గల్లీబాయ్‌’ సినిమాలతోపాటు పలు వెబ్‌ సిరీస్‌లలో కూడా నటించింది.


‘కాక్‌టెయిల్‌’, ‘హ్యాపీ భాగ్‌ జాయేగీ’ వంటి సినిమాల్లో మెరిసిన ప్రముఖ మోడల్‌ డయానా పెంటీ కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటూ ‘‘మనమంతా ‘పీరియడ్‌ షేమింగ్‌’ను ఎదుర్కొనే పీరియడ్‌ ఇది. పీరియడ్స్‌ అనేది సహజమైన ప్రక్రియ. అందులో షేమింగ్‌ అనేదే లేదు’’ అన్నారు. ప్రముఖ స్టయిలిస్ట్‌, ఫ్యాషన్‌కర్త తన్యా ఘావ్రీ అరచేతిలో రెడ్‌ డాట్‌ చూపుతూ ‘‘పీరియడ్‌ అనే స్టిగ్మాను ఇకనైనా ఆపండి’’ అంటూ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అమితమైన ఫాలోయింగ్‌ ఉన్న దీపా బుల్లెర్‌ ఖోస్లా ‘యునిసెఫ్‌’తో తనకున్న ఏడాది అనుభవాన్ని ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టులకు పదిలక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ‘‘ఈ అవగాహన కార్యక్రమంలో మహిళలే కాదు... మగవాళ్లు కూడా పాల్గొంటున్నారు. అమ్మాయిల్లో సహజసిద్ధంగా జరిగే నెలసరి సైకిల్‌ గురించి గతంలోలాగా భయపడి, సిగ్గుపడే రోజులు పోయాయి. ఈ ‘అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా అందరం కలిసి నవ శకాన్ని ప్రారంభిద్దాం’’ అంటూ సందేశమిచ్చారు. ఈ ఛాలెంజ్‌ ఇప్పటికే సోషల్‌  మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated Date - 2020-05-27T05:30:00+05:30 IST