లక్ష కోట్లయినా ఇస్తాం

ABN , First Publish Date - 2021-07-25T07:48:53+05:30 IST

రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం తలపెట్టిన దళితబంధు పథకానికి లక్ష కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు...

లక్ష కోట్లయినా ఇస్తాం

  • ‘దళితబంధు’ యావత్‌ దేశానికే ఆదర్శం
  • ప్రతి దళిత వాడలో ఒక కేసీఆర్‌ పుట్టాలె
  • దళితబంధును కొందరు అనుమానిస్తున్నరు
  • పథకాన్ని విజయవంతం చేసి చూపుతాం
  • బండా శ్రీనివాస్‌ నెత్తిన బండ పెట్టా: కేసీఆర్‌

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం తలపెట్టిన దళితబంధు పథకానికి లక్ష కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ పథకం యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నదన్నారు. కాళ్లు, రెక్కలే ఆస్తులుగా ఉన్న దళిత కుటుంబాల అభ్యున్నతే తొలి ప్రాధాన్యంగా దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోని అర్హులందరికీ అందజేస్తామని తెలిపారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు.. దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి విముక్తులను చేసే పథకంగా మారాలని ఆకాంక్షించారు. ఆ మేరకు అందరం కలిసి పథకాన్ని విజయవంతం చేద్దామంటూ దళిత ప్రజాప్రతినిధులు, సంఘాల నేతలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు.


ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండా శ్రీనివా్‌సను నియమించిన నేపథ్యంలో సీఎంకు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు శనివారం ప్రగతిభవన్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా బండా శ్రీనివా్‌సకు సీఎం కేసీఆర్‌ శాలువా కప్పి సత్కరించారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళిత బంధు విజయవంతానికి ప్రతి దళిత బిడ్డ పట్టుబట్టి పని చేయాలన్నారు. ప్రతి దళితవాడలో ఒక కేసీఆర్‌ పుట్టాలని ఆకాంక్షించారు. హుజూరాబాద్‌లో విజయవంతం కావడం ద్వారా ప్రసరించే వెలుగు.. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా విస్తరించాలన్నారు. ‘‘రాజులు, జాగీర్దార్లు జమీందార్లు, భూస్వాములు, అనంతరం వలస పాలకులు, ఇట్లా 100 ఏళ్ల పాటు అనేక రకాల పీడనను అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్నరు. అన్ని రంగాలను ఒక్కటొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నం. తెలంగాణ గాడిలో పడింది’’ అని అన్నారు.


‘‘ఉద్యమం ప్రారంభించిన మొదట్లో తెలంగాణ వస్తదా? అని అనుమానపడ్డరు. వచ్చింది! 24 గంటలు కరెంటు అయ్యేదా పొయ్యేదా? అన్నరు. అయ్యింది! కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు అయితదా? అన్నరు. అయింది! దండుగన్న వ్యవసాయం పండుగైంది! రైతుబంధు తెచ్చినప్పుడు కొందరు పెదవి విరిచిన్రు. ఇవ్వాళ తెలంగాణ రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నరు! అట్లనే దళితబంధును కూడా కొందరు అనుమానపడుతున్నరు. వారి అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తం. అదే స్ఫూర్తితో దళితబంధును అమలు చేస్తం. విజయం సాధిస్తం’’ అని సీఎం స్పష్టం చేశారు. దళితబంధును విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ సమాజానికే కాదు.. దేశ దళిత సమాజాభివృద్ధికి హుజూరాబాద్‌ దళితులే దారులు వేయాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. అందుకు పునాది వేద్దామా.. అని సభికులతో ప్రతిజ్ఞ తీసుకున్నారు. తెలంగాణ ప్రజలు గత పాలనలో గొర్రెల మందలో చిక్కుకుపోయిన పులి పిల్లలాంటి వాళ్లనే సంగతిని స్వయంపాలన ఏర్పాటయినంక ప్రపంచం పసిగట్టిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం నివ్వెర పోతున్నదన్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు తదితర అభాగ్యులకు ప్రభుత్వం ఆసరాగా నిలిచిందని, వారి కళ్లలో సంతోషం కనిపిస్తున్నదని.. అలాగే దళిత సమాజం మోములో ఆనందాన్ని చూడాలనేదే తన పట్టుదల అని సీఎం చెప్పారు. 


శ్రీనివాస్‌కు పదవి మాత్రమే కాదు..

తాను టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన నాటి నుంచి ఎంతో క్రమశిక్షణతో పని చేసుకుంటూ వస్తున్న బండ శ్రీనివా్‌సకు తాను పదవిని మాత్రమే ఇవ్వలేదని, తెలంగాణ దళిత సమాజాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఆయన నెత్తిన పెద్ద బాధ్యతతో కూడిన ‘బండ’ను పెట్టానని సీఎం చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. ‘‘ఇన్నాళ్లూ ఏవేవో పథకాలను తెచ్చి ప్రభుత్వాలు బ్యాంకుల గ్యారంటీ అడిగినయి. కాళ్లూ చేతులే ఆస్తులుగా ఉన్న కడు పేద దళితులు గ్యారంటీలను ఎక్కడి నుంచి తెస్తరు? అందుకే దళిత బంధు పథకం ద్వారా ప్రభుత్వం అందించే ఆర్థికసాయం పూర్తి ఉచితం. ఇది అప్పు కాదు’’అని వివరించారు. ‘‘దళితుల్లో ఆత్మ విశ్వాసం, ధీమా పెరిగి తమ అభివృద్ధిని తామే నిర్వచించుకోగలం అనే భరోసాను కలిగించే ప్రయత్నమే దళితబంధు పథకం. ఇచ్చిన పైసలను పప్పు పుట్నాలకు ఖర్చు చేయకుండా, పైసను పెట్టి పైసను సంపాదించే ఉపాధి మార్గాలను అన్వేషించాలి’’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. గాంధీజీ, అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగించి దళితుల అభివృద్ధిని సాధించి చూపెడతామన్నారు. ‘‘ఎక్కడో ఒక దగ్గర ప్రేరణ కావాలి. అది హుజూరాబాద్‌ అవుతున్నందుకు మీరందరూ గర్వపడాలి’’అని అన్నారు.


హుజూరాబాద్‌ దళితుల చిత్తశుద్ధిపై..

‘‘మంచి జరిగి వెలుతురొస్తే.. అణగారిన దళిత వర్గాలందరికీ మేలు జరిగి ఒక తొవ్వ పడుతుంది. హుజూరాబాద్‌ దళిత నాయకుల పట్టుదల, నిబద్ధత, చిత్తశుద్ధి మీద ఇది ఆధారపడి ఉంది. పార్టీలకతీతంగా దళితబంధును అమలు చేసుకుందాం. అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలె. కొట్లాటలు, కక్షలు, లేని వాడలుగా దళిత వాడలు పరిఢవిల్లాలె’’ అని సీఎం ఆకాంక్షించారు. ఒకరు ఏమాత్రం కింద పడే పరిస్థితి ఉన్నా వెంటనే ఆదుకొనే ఖోజా జాతి ఆదర్శం కావాలన్నారు. దళిత బంధు పథకం.. రాష్ట్ర ఉద్యమం మాదిరి దళితుల అభ్యున్నతి కోసం సాగే ఉద్యమమని పునరుద్ఘాటించారు. 

Updated Date - 2021-07-25T07:48:53+05:30 IST