ఇక డిగ్రీ చదువు ఇంగ్లీషు మీడియంలోనే

ABN , First Publish Date - 2021-06-15T09:03:55+05:30 IST

డిగ్రీ కోర్సుల్లో ఇక నుంచి తెలుగు మీడియం మాయం కానుంది. రాష్ట్రంలో డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఇంగ్లీషు మీడియంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

ఇక డిగ్రీ చదువు ఇంగ్లీషు మీడియంలోనే

కాంబినేషన్‌/ మీడియం కన్వర్షన్‌కు కాలేజీలు ప్రపోజల్‌ సమర్పించాలి

ప్రోగ్రామ్స్‌ సరెండర్‌ చేయాలనుకుంటే ఉపసంహరణకు అవకాశం

18 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకునే వీలు.. ప్రాసెసింగ్‌ ఫీజు లేదు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సెక్రెటరీ సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ వెల్లడి


అమరావతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ కోర్సుల్లో ఇక నుంచి తెలుగు మీడియం మాయం కానుంది. రాష్ట్రంలో డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఇంగ్లీషు మీడియంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఉన్నత విద్యపై తాజాగా నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో అన్‌ ఎయిడెడ్‌ ప్రోగ్రామ్స్‌కు సంబంధించి కొత్త/అదనపు ప్రోగ్రామ్స్‌ మంజూరు, కాంబినేషన్‌/ఇంగ్లీషు మీడియంకు మార్పిడి కోసం మాత్రమే పాత కాలేజీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఈ విషయాన్ని ఏప్రిల్‌ 27న ఇచ్చిన నోటిఫికేషన్‌లోనే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పేర్కొంది. అలాగే 2021-22 నుంచి కొత్త అన్‌ ఎయిడెడ్‌ నాలుగేళ్ల యూజీ ఆనర్స్‌ ప్రోగ్రామ్స్‌ ఇంగ్లీషు మీడియంలో మాత్రమే ఉంటాయని మండలి మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. 


ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్ని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు, తెలుగు మీడియంలో అన్‌ ఎయిడెడ్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తోన్న ప్రైవేట్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు కూడా ప్రస్తుతం తెలుగు మీడియంలో నిర్వహిస్తున్న సెక్షన్లను (లాంగ్వేజెస్‌ మినహా) ఇంగ్లీషు మీడియంలోకి మార్పిడి చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లతో ప్రతిపాదనలను ఈ నెల 18 నుంచి 28లోగా ఉన్నత విద్యా మండలికి సమర్పించుకోవాలి. లేకుంటే 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఆయా కోర్సులను నిర్వహించే అవకాశం ఉండదు. ఒకవేళ గిట్టుబాటు కాని ప్రోగ్రామ్స్‌ను ఉపసంహరించుకోవాలనుకుంటే వాటికి కూడా ఈ నెల 18 నుంచి 28లోగా ప్రతిపాదనలు సమర్పించుకోవాలి. మీడియం కనర్వర్షన్‌ లేదా ప్రోగ్రామ్స్‌ ఉపసంహరణకు కాలేజీల మేనేజ్‌మెంట్లు ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజునూ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెక్రెటరీ కె.సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2021-06-15T09:03:55+05:30 IST