రాయలసీమ వాగ్వైభవం

ABN , First Publish Date - 2022-03-18T06:20:28+05:30 IST

రాయలసీమ వైతాళికుడు పప్పూరు రామాచార్యులు (1896–1972) బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు. 1932, 1942లో జైలుకు వెళ్లారు. ఒక్క చేతి మీదుగా ‘శ్రీ సాధన వారపత్రిక’ను...

రాయలసీమ వాగ్వైభవం

రాయలసీమ వైతాళికుడు పప్పూరు రామాచార్యులు (1896–1972) బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు. 1932, 1942లో జైలుకు వెళ్లారు. ఒక్క చేతి మీదుగా ‘శ్రీ సాధన వారపత్రిక’ను 46 సంవత్సరాల (1926–72) పాటు అనంతపురం నుండి నడిపాడు. అయిదు సంవత్సరాలు (1947–52) అనంతపురం మునిసిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆరేళ్లు అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పనిచేసారు. ఏడేళ్లు (1955–62) ధర్మవరం శాసనసభ్యులుగా పనిచేశారు. ఏ పదవి చేపట్టినా అందులో తనదైన ముద్ర ఉండేటట్లు చేయడం రామాచార్యుల విశిష్టత.


ఆయన వాక్కులో రచనలో ప్రవర్తనలో ఏదో చమత్కారం కన్పించేది. జైలులో తండ్రి ఆబ్దికం సలక్షణంగా నిర్వహించారు. మునిసిపల్‌ చైర్మన్‌గా ఇంటిపన్ను తగ్గించి చరిత్ర సృష్టించారు. రాజకీయ నాయకులకు గాకుండా సాహితీవేత్తలయిన గడియారం శేషశాస్త్రి మొదలగు వారికి పౌరసన్మానాలు చేశారు.


గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అనంతపురంలో బాలలు, మహిళల కోసం ప్రత్యేకంగా గ్రంథాలయం నెలకొలిపారు. అనంతపురంలో బిఎ విద్యార్థిగా ఉన్నప్పుడే రామాచర్యులు పత్రికా రచనకు శ్రీకారం చుట్టాడు. విద్యార్థులంతా కలసి ‘వదరుబోతు’ అనే పక్షపత్రిక నడిపారు. అది కడు చమత్కారాలతో సంఘ దురాచారాలను ఖండిస్తూ సాగింది. రాళ్లపల్లి సోదరులు (గోపాలకృష్ణమాచార్యులు, అనంతకృష్ణశర్మ) మొదలగు ప్రముఖులు వ్యాసకర్తలు. 1932లో ఆ వ్యాసాలను రామాచార్యులు ఒక గ్రంథంగా వెలువరించారు. అది చదివిన కొందరు ఇందులో హాస్యం అంతగా లేదని వ్యాఖ్యానించారు. రామాచార్యులు తన శ్రీసాధనలో ఒక కథ వేసి వారిని నిరుత్తరులను చేశారు. ఆ కథ ఇది– ‘రామపట్టాభిషేకానికి వానర స్త్రీలు కూడా అయోధ్యకు వెళ్లారు. వారు అక్కడ సీతాదేవిని చూచి ఇలా అన్నారు’ సీత దేహం పచ్చని ఛాయతో అందంగా ఉంది. కళ్లు చూద్దామా పొడుగ్గా ఉన్నాయి. ముక్కయితే ఎత్తుగా ఉంది. సన్నని నడుము. పెద్దాపయోధరాలు చిత్రమైన వస్త్రాలు ధరించింది. ఒంటియందు రోమాలు లేవు. భర్తకు ఎంతో హాయి. కాని ఒక చిన్న తోకయినా లేదు. అది ఉంటే ఎంత బాగుండేది. ఇంతకూ అన్ని ఒకచోట ఎలా ఉంటాయి? వదరుబోతులో హాస్యం లేదనడం ఇలాంటిదే అని ఆయన ఛలోక్తి. అనంతపురం జిల్లా బోర్డు ఎన్నికలప్పుడు తోలుబొమ్మలాట అనే కథనం వేసి ప్రత్యర్థి వర్గం వారైన కల్లూరి సుబ్బారావు, నీలం సంజీవరెడ్డిలను ఏకిపెట్టాడు.


తోలుబొమ్మలాట నాందీ ప్రస్తావనంలో సూత్రదారుడు ‘ఈ నాటక రచయిత ఇల్లూరి సంజన్న (నీలం సంజీవరెడ్డి). దీనిని మేము (కల్లూరి ప్రభృతులు) మద్రాసు మొదలగు అనేక తావులలో ఆడాము. ఇంకా మేము ఆడినవి ఎన్నో నాటకాలు ఉన్నాయి. ఇల్లూరి సండ్రన్న, కల్లూరి సుబ్బన్నను శ్లాఘిస్తూ మాట్లాడతారు. ఇందులో జూలూరు నాగన్న (జెసి నాగిరెడ్డి) దీపం పట్టుకుంటారు. నాటకం చివర ఇదంతా చిదంబర రహస్య (చిదంబరరెడ్డి అని ధ్వని) అని ముగిస్తారు. ఇందులో హాస్య పోషణకు ప్రత్యర్థులు కూడా ముగ్ధులయ్యేవారు.


రాయలసీమ కరువును గూర్చి రామాచార్యులు కథనం ఇలా ‘చెవిటి మొఘం’ శీర్షికన వెలువడింది. ‘ఒకసారి దేవేంద్రుడు మేఘాల సమావేశం ఏర్పాడు చేశాడు. రాయలసీమ ప్రజలు పాపాత్ములు. అందుచేత మీరు అటువైపు వెళ్లరాదని శాసించాడు. ఒక చెవిటి మేఘం ఇంద్రుని మాటను ఖాతరు చేయక రాయలసీమలో కొద్దిగా వర్షించింది. ఇంద్రుడు వెంటనే చెవిటి మేఘాన్ని పిలిపించి సంజాయిషీ అడిగాడు. రాయలసీమ ప్రజలు తమవద్ద విత్తనాల గింజలు నిల్వచేసికొన్నారు. మొన్న కురిసిన వర్షానికి వాటిని చల్లుకున్నారు. అవి కూడా వారికి ఎందుకు దక్కాలని నేను పోయి కొద్దిపాటి వర్షం కురిపించాను అన్నది చెవిటి మేఘం. దాని తెలివికి మెచ్చి ఇంద్రుడు శబాష్‌ అన్నాడు.


భోజనాల సందర్భంగా ఆచార్యుల వారి చమత్కారాలు. ఒకసారి సర్కారు ప్రాంత పెద్దమనిషి రామాచార్యులకు అతిథిగా ఆయన సరసనే భోజనం చేస్తున్నాడు. వడ్డించిన పదార్థాలలో ఒక కూరను చూపుతూ ‘ఇది మావైపు పశువులకు వేస్తుంటామండీ’ అన్నారు. రామాచార్యులు క్షణం కూడా తడుముకోకుండా మేము ఎన్నడూ చేయమండీ ఏదో మీరు వచ్చారని అనే సరికి అతిథికి నోటిలోకి ముద్ద మ్రింగుడు పడలేదు.


ఒకసారి కమ్యూనిస్టు నేత వేడుకల్లో సదాశివన్‌ రామాచార్యులు గారింట వారి సరసన భోంచేస్తున్నారు. భోజనం చేస్తున్న ఆచార్యులు ‘అన్నం వండను వండి రుబ్బనూ రుబ్బి ఏటికి పోయి ఎప్పుడు తీసుకొని వస్తివి’ అని భార్యను హాస్యం చేశాడు. ఆనాడు అన్నం ముద్ద అయింది. ప్రెగారాళ్లు వస్తున్నవి. అందుకు ఈ హాస్యం. రామాచార్యులు సభలు ఉన్నాడంటే ఛలోక్తులు వుండి తీరాల్సిందే! ఒకసారి ఆచార్య రంగా అనంతపురం విచ్చేసి ఒక సభలో పాల్గొన్నారు. సభాధ్యక్షులు పప్పూరు రామాచార్యులు. కార్యకర్తలు ఒకే పూలహారాన్ని తెచ్చారు. దానిని ఎవరికి వేయడమా అని సంకోచంలో పడినారు. ఆచార్యులవారది గ్రహించి ఆ పూలహారం రంగా గారికి వేయడం సమంజసం. ఏలనంటారా పూలరంగడంటారు గానీ పూలరాముడు అనరు.


పైడి లక్ష్మయ్యగారు అనంతపురం జిల్లాలో ప్రముఖులు వారి సన్మాన సభలో రామాచార్యులు ప్రసంగిస్తూ ‘లక్ష్మయ్య గారు పైడివారు పైడి అంటే బంగారు. దాని రంగు పసుపు. మా ఇంటి పేరు పప్పు (కందిపప్పు). దాని రంగు పసుపే! బంగారం ధర యుద్ధ కాలంలో విపరీతంగా పెరిగింది. (యుద్ధానికి అనుకూలంగా ప్రచారం చేసినందుకు లక్ష్మయ్యకు దివాను బహదూర్‌ లభించిందని ధ్వని) కానీ పప్పు ధర ఎప్పుడూ ఒక రీతిగానే ఉంటుంది. ఇందులో స్వారస్యం గ్రహించిన పెద్దలు నవ్వుతూ కనిపించారు.


1936లో దేశ నాయకులు ధర్మవరం వచ్చి భూకంప బాధితులకు నిధి వసూలు చేయసాగారు. రామాచార్యులు వసూలయిన మొత్తం ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వచ్చారు. ఒక దశలో మొత్తం రూ. 111 అయింది. ఆ సంఖ్య చెపితే ఆచార్యులవారి మూడు నామాలని జనం అపహాస్యం చేయవచ్చుననే భావంతో రూ. 116కు రూ. 5 తక్కువ అంటూ సమయస్ఫూర్తితో పలికారు. శ్రోతలు అప్పుడు గొనుగుకొనక తప్పలేదు.


అనంతపురం మునిసిపల్‌ ఎన్నికలలో నీలం సంజీవరెడ్డి వర్గం వారు ఒక వార్డులో ఒక గృహిణిని తమ అభ్యర్థిగా ప్రకటించారు. రామాచార్యులు వర్గం ఆమెకు పోటీగా ఒక బోగం వనితను నిలిపారు.


నీలం వర్గీయులు మాటికి మాటికి ప్రత్యర్థిని బోగం ఆమె అని హేళన చేయసాగారు. ఆచార్యుల వారు ఎదిరి అభ్యర్థిని పతివ్రత అంటూ తన పత్రికలో విరివిగా రాయసాగాడు. ఇది ఆ పార్టీ వారికే ఇబ్బందిగా పరిణమించి, ఆచార్యులవారి వద్దకు వచ్చి అలా రాయవద్దని కోరారు. ఆచార్యులవారు మరుసటి సంచికలో ఆమె పతివ్రత కాదట అని ప్రకటించారు. ఇది మరీ విపరీతానికి దారితీసి చివరకు ఆమె ఓడిపోయేదాకా వెళ్లింది. 


రాష్ట్రపతి పదవినలంకరించిన నీలం సంజీవరెడ్డి పప్పూరి రామాచార్యుల చెంత ఎబిసిలు నేర్చాడు. ఆయనను తన గురువుగా ప్రతి సభలో గౌరవించేవారు. 1951లో కాంగ్రెసు వర్గాలలో ఆచార్యుల వారు నీలం వారి ఎదిరి వర్గంలో చేరిపోయారు. పార్టీ వ్యతిరేక చర్యలకుగాను ఆచార్యులను ఎపిసిసి అధ్యక్షులుగా నీలంవారు సస్పెండ్‌ చేశారు. అందుకు సంజాయిషీ ఇస్తూ ఆచార్యులవారు ‘రెడ్డిగారికి అధికారం ఉంటే నాకు ఉరిశిక్ష వేసేవారు. ఇంతకంటే అదే నయమంటూ’ రాశారు.

రావినూతల శ్రీరాములు

(మార్చి 21: పప్పూరు రామాచార్యులు 50వ వర్ధంతి)

Updated Date - 2022-03-18T06:20:28+05:30 IST